లలితా సహస్రనామ ఫలశృతి 21-30 శ్లోకాలు తెలుగులో అర్థం
శ్రీలలితా సహస్రనామంలోని ఫలశ్రుతి భాగం, ఈ దివ్య నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వల్ల కలిగే మహిమలను వివరిస్తుంది. ఫలశ్రుతి ద్వారా ఈ సహస్రనామం కేవలం స్తోత్రమే కాక, భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ఉన్నత స్థితికి చేర్చే దివ్య సాధనమని తెలియజేయబడుతుంది. పరాశక్తి అయిన శ్రీలలితా మహాత్రిపురసుందరీ కృపను పొందడానికి ఈ నామాల జపం అత్యంత శ్రేష్ఠమైన మార్గంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.
భక్తితో శ్రీలలితా సహస్రనామ ఫలశ్రుతిని చదవడం లేదా వినడం ద్వారా పాపక్షయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానసౌభాగ్యం, విద్యా ప్రాప్తి, శత్రువుల నుండి రక్షణ వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయని చెప్పబడింది. అంతేకాక, పరమాత్మసాక్షాత్కారం మరియు మోక్షప్రాప్తికి కూడా ఈ స్తోత్రం దోహదపడుతుందని ఫలశ్రుతి వివరిస్తుంది. ఇప్పుడు ఈ ఫలశ్రుతి శ్లోకాల యొక్క తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం.
నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే
కీర్తయేన్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః
ప్రతిదినమూ చేయలేనివారు శుక్లపక్షంలో వచ్చే అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి తిథులలో, శుక్రవారం నాడు తప్పకుండా పారాయణ చేయాలి.
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్
పంచోపచారైః సంపూజ్య పఠేన్నామసాహస్రకమ్ || 21 ||
పౌర్ణమి రోజు, చంద్రబింబంలో లలితాదేవి స్వరూపాన్ని భావన చేసుకొని- గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అనే పంచోపచారాలతో పూజచేసి, తరువాత లలితాసహస్రనామ పారాయణం చేయాలి.
సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యం చ విందతి
అయమాయుష్కరో నామ ప్రయోగః కల్పనోదితః || 22 ||
ఈ విధంగా పూజించి, ధ్యానం చేసి, నామపారాయణం చేసేవారికి సకల రోగాలూ నశించి, దీర్ఘాయుష్షు కలుగుతుంది.
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామసహస్రకమ్
తత్‍క్షణాత్ప్రశమం యాతి శిరస్తోదో జ్వరోఽపి చ || 23 ||
ఉపాసకుడు- జ్వరంతో బాధపడుతున్న వారి తలమీద చేయి ఉంచి, ఈ సహస్రనామాలను చదివితే, వెంటనే తలనొప్పి, జ్వరము మొదలైన బాధలన్నీ నశిస్తాయి.
సర్వవ్యాధినివృత్త్యర్థం స్పష్ట్వా భస్మ జపేదిదమ్
తత్ భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్ || 24 ||
సహస్రనామాలతో విభూతిని మంత్రించి (అంటే నామాలను చదువుతూ, విభూతిని చేతివేళ్ళతో కదపడం), రోగి శరీరానికి పూస్తే, వెంటనే సర్వరోగాలూ శాంతిస్తాయి.
జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే
అభిషించేత్ గ్రహగ్రస్తాన్ గ్రహాః నశ్యంతి తత్‍క్షణాత్ || 25 ||
ఓ అగస్త్యమునీ! ఒక బిందెలో నీటిని పోసి, ఆ నీటిని ఈ సహస్రనామాలతో అభిమంత్రించి, ఆ నీటితో గ్రహం పట్టుకున్న వారిని స్నానం చేయిస్తే, వెంటనే ఆ గ్రహాలన్నీ (బాలగ్రహములు, పిశాచాలు, నవగ్రహములు మొదలైనవాటి బాధలన్నీ) వదిలిపోతాయి.
సుధాసాగరమధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికామ్
యః పఠేన్నామసాహస్రం విషం తస్య వినశ్యతి || 26 ||
శ్రీలలితాదేవిని సుధాసముద్రమధ్యలో ఉన్నదానినిగా భావన చేసి, సహస్రనామపారాయణం చేసిన వాని విషము (కష్టము) నశిస్తుంది.
వంధ్యానాం పుత్రలాభాయ నామసాహస్రమంత్రితమ్
నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభో భవేద్ధ్రువమ్ || 27 ||
సంతానభాగ్యం అస్సలు లేనివారికి కూడా – ఈ సహస్రనామాలతో మంత్రించిన వెన్నను తింటే, తప్పక సంతానం కలుగుతుంది.
దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టామంకుశేన చ
ధ్యాత్వాఽభీష్టాం స్త్రియం రాత్రౌ పఠేన్నామసహస్రకమ్
ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురం గతా || 28 ||
సాధకుడు ధర్మార్థకామములలో ధర్మబద్ధమైన కామమును సాధించుటకు తగు స్త్రీని లలితాదేవి యొక్క తాడుతో కట్టబడినదిగా చేసి ధ్యానం చేసి, రాత్రిలో సహస్రనామమును పారాయణ చేయవలెను.
రాజాకర్షణకామశ్చేత్ రాజావసథ దిఙ్ముఖః || 29 ||
త్రిరాత్రం యః పఠేత్ ఏతత్ శ్రీదేవీధ్యానతత్పరః
స రాజా పారవశ్యేన తురంగం వా మతంగజమ్ || 30 ||
రాజును స్వాధీనం చేసుకోవాలి అనే కోరిక కలవాడు- ఆ రాజగృహము వైపుకు ముఖము పెట్టి, లలితాంబను ధ్యానం చేస్తూ, మూడు రాత్రింబవళ్ళు ఈ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణ చేసినచో, ఆ రాజు తనంతటతానే గుర్రమును గానీ, ఏనుగును గానీ ఎక్కి పారవశ్యంతో ఉపాసకుని దగ్గరకు వచ్చి, సేవకుని వలె నమస్కరించి, తన రాజ్యమును, ధనమును కూడా బుద్ధి పూర్వకంగా ఉపాసకునికి ఇచ్చును.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



