స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లలితా స్తోత్రాలు » లలితా సహస్రనామ ఫలశృతి 11-20 శ్లోకాలు తెలుగులో అర్థం

లలితా సహస్రనామ ఫలశృతి 11-20 శ్లోకాలు తెలుగులో అర్థం

శ్రీలలితా సహస్రనామంలోని ఫలశ్రుతి భాగం, ఈ దివ్య నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేయడం వల్ల కలిగే మహిమలను వివరిస్తుంది. ఫలశ్రుతి ద్వారా ఈ సహస్రనామం కేవలం స్తోత్రమే కాక, భక్తుల జీవితాలను ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ఉన్నత స్థితికి చేర్చే దివ్య సాధనమని తెలియజేయబడుతుంది. పరాశక్తి అయిన శ్రీలలితా మహాత్రిపురసుందరీ కృపను పొందడానికి ఈ నామాల జపం అత్యంత శ్రేష్ఠమైన మార్గంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.

భక్తితో శ్రీలలితా సహస్రనామ ఫలశ్రుతిని చదవడం లేదా వినడం ద్వారా పాపక్షయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానసౌభాగ్యం, విద్యా ప్రాప్తి, శత్రువుల నుండి రక్షణ వంటి అనేక శుభఫలితాలు లభిస్తాయని చెప్పబడింది. అంతేకాక, పరమాత్మసాక్షాత్కారం మరియు మోక్షప్రాప్తికి కూడా ఈ స్తోత్రం దోహదపడుతుందని ఫలశ్రుతి వివరిస్తుంది. ఇప్పుడు ఈ ఫలశ్రుతి శ్లోకాల యొక్క తెలుగు అర్థాన్ని తెలుసుకుందాం.

యః కోటిం హయమేధానాం ఆహరేద్గాంగరోధసి 
ఆచరేత్కూపకోటీర్యో నిర్జలే మరుభూతలే || 11 ||

ఈ రకంగా నామ పారాయణం చేసినవారికి- గంగా నదీ తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేసినంత  ఫలము, నీరు లేని బీడుభూమిలో కోటి నూతులను తవ్వించినంత పుణ్యము కలుగుతుంది.

దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణభోజనమ్ 
శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్ర పరివత్సరాన్ || 12 ||

ఈ లలితా సహస్రనామ పారాయణం చేసినవారికి- కరువుకాలంలో పన్నెండు వేల సంవత్సరాలు, శ్రద్ధతో ప్రతిరోజూ కోటిమంది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది.

తత్పుణ్యం కోటిగుణితం లభేత్పుణ్యమనుత్తమమ్ 
రహస్యనామసాహస్రే నామ్నోఽప్యేకస్య కీర్తనాత్ || 13 ||

పై శ్లోకములలో చెప్పబడిన పుణ్యమునంతటినీ మరలా కోటి సంఖ్యతో గుణిస్తే వచ్చే పుణ్యమంతా- ఈ సహస్రనామాలలోని కేవలం ఒక్క నామమును పారాయణం చేస్తే కలుగుతుంది. 

రహస్యనామసాహస్రే నామైకమపి యః పఠేత్ 
తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి న సంశయః || 14 ||

రహస్యమైన ఈ దేవీ సహస్రనామాలలో ఒక్క నామమును చదివినా, అనేక జన్మల పాపాలు నిస్సందేహంగా నశించిపోతాయి. 

నిత్యకర్మాననుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి 
యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి దృతమ్ || 15 ||

ఈ పారాయణం చేయడం వల్ల- నిత్యము చేయవలసిన కర్మలను ఆచరించకపోవడం వల్ల, శాస్త్రములో నిషేధించిన కర్మలను చేయడం వల్ల కలిగే అంతటి పాపం కూడా  నశించిపోతుంది.

బహునాత్ర కిముక్తేన శృణు త్వం కుంభసంభవ  (కలశీసుత)
అత్రైకనామ్నో యా శక్తిః పాతకానాం నివర్తనే
తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ || 16 || 

ఓ అగస్త్యుడా! పాపములను పోగొట్టే విషయంలో ఈ నామాలకు గల శక్తిని గురించి అనేక విధాలుగా నీకు చెప్పాను. పద్నాలుగు లోకాలలోని ప్రాణులు చేసిన పాపమునంతా ఈ నామము పోగొట్టగలదు. 

యస్త్యక్త్వా నామసాహస్రం పాపహానిమభీప్సతి
స హి శీతనివృత్త్యర్థం హిమశైలం నిషేవతే   || 17 ||

ఏ ఉపాసకుడైనా తన పాపాలను పోగొట్టుకోవడానికి, ఈ సహస్రనామాలను విడిచి, ఇతర ప్రాయశ్చిత్తములను చేయాలనుకుంటాడో- అది, చలి బాధను పోగొట్టుకోవడానికి హిమవత్పర్వతాన్ని సేవించినట్టు అవుతుంది.

భక్తో యః కీర్తయేన్నిత్యమిదం నామసహస్రకమ్
తస్మై శ్రీలలితాదేవీ ప్రీతాఽభీష్టం ప్రయచ్ఛతి   || 18 ||

నిత్యమూ ఈ సహస్రనామ పారాయణం చేయు భక్తుని పట్ల సంతోషించి, లలితాదేవి- అతడు ఏ కోరిక అడిగినా తప్పకుండా తీరుస్తుంది.

అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి || 19 ||

ఈ స్తోత్రం పారాయణం చేయనివాడు భక్తుడు ఎలా కాగలడు.

నిత్యం సంకీర్తనాశక్తః కీర్తయేత్పుణ్యవాసరే 
సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయేఽయనే || 20 ||

ప్రతిరోజూ నామపారాయణం చేయడానికి శక్తి లేనివారు- పవిత్రమైన దినాలైన సంక్రాంతి, తన జన్మతిథి, సూర్యుడు కర్కాటక, మకరరాశులలో ప్రవేశించిన పుణ్యతిథులలో అంటే మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణంలలో  పారాయణం చేయవచ్చు.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top