శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత కథ – మహిమ & పూజా విధానం
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా… భగవంతునిపై భక్తి, విశ్వాసం మనకు అండగా నిలుస్తాయి. అనంత పద్మనాభ స్వామి వ్రత మహిమను తెలిపే సుశీల–కౌండిన్యుల ఈ పురాణ కథలో, దైవానుగ్రహాన్ని తక్కువగా చూడటం వల్ల వారి జీవితం ఎలా మారిపోయింది? 14 ముడుల అనంత సూత్రం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అనంత వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం.
శ్రీ అనంతపద్మనాభ స్వామి వ్రత కథ
సూత మహర్షి శౌనకాది మహర్షులతో “ఓ మహర్షులారా! ఈ లోకంలో దారిద్ర్యంతో బాధపడుతున్న వారికి ఆ కష్టాలను తొలగించే ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరిస్తే మనిషి జీవితంలో ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. ఆ పవిత్రమైన వ్రతం గురించి మీకు చెబుతాను. శ్రద్ధగా వినండి” అని ఇలా చెప్పాడు.
వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు- శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “ఓ ధర్మరాజా! స్త్రీలు, పురుషులు భక్తితో ఆచరించగలిగే ఒక గొప్ప వ్రతం ఉంది. అదే అనంత వ్రతం. ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్దశి రోజున ఆచరించాలి. భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే కీర్తి, సుఖం, శుభం, సంతానం, ఐశ్వర్యం వంటి అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. మీ రాజ్యం మీకు తిరిగి లభిస్తుంది” అని చెప్పాడు.
అప్పుడు ధర్మరాజు “అనంతుడు ఎవరు?” అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “ధర్మరాజా! అనంతుడు మరెవరో కాదు—నేనే. క్షణం నుంచి యుగం, కల్పం వరకు కాలం యొక్క ప్రతి రూపం నా స్వరూపమే. నా హృదయంలోనే పద్నాలుగు లోకాలతో సహా సమస్త సృష్టి నిండి ఉంది. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి, నాభి పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు” అని సమాధానమిచ్చాడు.
అప్పుడు ధర్మరాజు “ఓ జగన్నాథా! మీరు చెప్పిన అనంత వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ వ్రతాన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించి సుఖసంపదలను పొందారు?” అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “ధర్మరాజా! ఆ కథను నీకు చెబుతాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పడం ప్రారంభించాడు.
సుశీల-కౌండిన్యుల కథ
పూర్వకాలంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు దీక్షాదేవి. వారికి సుశీల అనే సద్గుణ సంపన్నురాలైన కుమార్తె ఉండేది. సుశీల చిన్నప్పటి నుంచే ఎంతో దైవభక్తితో ఉండేది. చిన్న వయసులోనే సుశీల తల్లి దీక్షాదేవి మరణించింది. తరువాత సుమంతుడు కర్కశ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె స్వభావం కఠినంగా ఉండేది. సుశీల పట్ల ఆమెకు ప్రేమాభిమానాలు ఉండేవి కాదు. అయినా సుశీల ఎంతో ఓర్పుతో, సంస్కారంతో పెరిగింది. కాలం గడిచింది. సుశీల వివాహ వయసుకు వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు కౌండిన్య మహర్షి- సుమంతుని ఇంటికి వచ్చాడు. కౌండిన్యుడు గొప్ప తపస్వి, వేదవేత్త. సుశీలకు తగిన వరుడని భావించిన సుమంతుడు తన కుమార్తెను కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేముందు చీర సారె పెట్టి పంపుదామంటే సవతితల్లి ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురుకిచ్చి పంపాడు. వివాహం అనంతరం కౌండిన్యుడు తన భార్య సుశీలను వెంట తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరాడు.
నదీతీరంలో సుశీలకు అనంత వ్రత పరిచయం
అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒకరోజు వారు ఒక నది తీరానికి చేరుకున్నారు. అది భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు. కౌండిన్యుడు నది దగ్గరకు సంధ్యావందనం చేయడానికి వెళ్లాడు. అక్కడ సుశీలకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. చాలామంది స్త్రీలు ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎంతో భక్తిశ్రద్ధలతో అనంతపద్మనాభ స్వామిని పూజిస్తున్నారు. సుశీల వారి దగ్గరకు వెళ్లి “అమ్మలారా! మీరు ఎవరిని పూజిస్తున్నారు? ఈ వ్రతం యొక్క విశేషం ఏమిటి?” అని అడిగింది. అప్పుడు ఆ స్త్రీలు, “అమ్మా! ఇది అనంతపద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఎంతో గొప్ప ఫలితాలు లభిస్తాయి” అని పూర్తి వ్రత విధానాన్ని ఆమెకు వివరించారు.
ఆ మాటలు విన్న సుశీల ఎంతో సంతోషించింది. వెంటనే స్నానం చేసి, ఆ స్త్రీల సహాయంతో అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించింది. 14 ముడులు కలిగిన ఎర్రని అనంత సూత్రాన్ని చేతికి కట్టుకుంది. తన తండ్రి ఇచ్చిన పిండితో అరిసెలు, బూరెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. తాను కూడా ప్రసాదంగా స్వీకరించింది. వ్రతాన్ని భక్తితో పూర్తి చేసిన తర్వాత ఎంతో సంతోషంగా తన భర్త కౌండిన్యుడి దగ్గరకు వెళ్లింది. కౌండిన్యుడు కూడా భోజనం చేసి సంతృప్తి చెందాడు.
అనంత వ్రత ప్రభావం
సుశీల అనంత సూత్రాన్ని ధరించి కౌండిన్యునితో కలిసి ఆశ్రమానికి చేరుకున్న తరువాత వారి జీవితంలో గొప్ప మార్పు కనిపించింది. వారు తమ ఆశ్రమానికి చేరుకునే సరికి ఆ ప్రదేశం అంతా బంగారంలా ప్రకాశిస్తూ కనిపించింది.
వారి ఇల్లు అపారమైన ఐశ్వర్యంతో నిండిపోయింది. ధనధాన్యాలు, పశువులు, సంపదలు అన్నీ సమృద్ధిగా లభించాయి. ఇద్దరూ ఎంతో సంతోషంగా, సుఖంగా జీవించడం ప్రారంభించారు. కానీ ఈ సంపదకు అసలు కారణం అనంతుడి అనుగ్రహమని కౌండిన్యుడు అర్థం చేసుకోలేదు.
కౌండిన్యుడు అనంత సూత్రాన్ని అవమానించడం
ఒకరోజు కౌండిన్యుని దృష్టి సుశీల చేతికి కట్టుకున్న ఎర్రని సూత్రంపై పడింది. “ఇదేమిటి? నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా?” అని అడిగాడు. సుశీల చేతులు జోడించి అనంత వ్రతం గురించి చెప్పి, మనకు కలిగిన ఈ ఐశ్వర్యం కూడా అనంతుడి అనుగ్రహమే” అని చెప్పింది. కానీ కౌండిన్యుడు కోపంతో- తన తపస్సు, తన కృషి వల్లే ఈ సంపద వచ్చిందని చెప్పి, సుశీల చేతిలోని అనంత సూత్రాన్ని తీసి అగ్నిలోకి విసిరేశాడు. సుశీల వెంటనే ఆ సూత్రాన్ని అగ్నిలో నుంచి తీసి, దానికి ఏమైనా అపచారం జరిగిందేమోనని, దాన్ని పాలలో వేసి భద్రంగా ఉంచింది. కానీ కౌండిన్యుడు చేసిన ఆ అపచారం వల్ల వారి జీవితంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
కొద్దికాలంలోనే కౌండిన్యుని ఇంటి సంపద క్రమంగా నశించింది. ఒకప్పుడు సంతోషంతో కళకళలాడిన వారి జీవితం మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోయింది. దీంతో కౌండిన్యుడి మనసులో పశ్చాత్తాపం మొదలైంది. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి, అనంత పద్మనాభ స్వామిని దర్శించాలని నిర్ణయించుకున్నాడు.
అనంతుడి కోసం కౌండిన్యుని అన్వేషణ
కౌండిన్యుడు అనంతుడిని వెతుకుతూ అడవిలోకి బయలుదేరాడు. అప్పుడు మార్గమధ్యలో పూతా కాయా లేని మామిడి చెట్టుపై ఎలాంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు.
మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూస్తాడు. మరోచోట రెండు కొలనులు కనిపించాయి. వాటిలో ఒక కొలనులోని నీరు మరొక కొలనులోకి ప్రవహిస్తోంది. అక్కడ ఒక కొంగైనా వాలడం లేదు. తరువాత ఒక గాడిదను, ఏనుగును చూస్తాడు. వాటన్నింటినీ అనంతుడి గురించి ప్రశ్నిస్తాడు. కానీ ఎక్కడా అనంతుడి జాడ కనిపించలేదు. అలా అనంత పద్మనాభ స్వామివారిని అన్వేషిస్తూ వెళుతున్న కౌండిన్యుడు ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోతాడు.
అనంత పద్మనాభుని ప్రత్యక్ష దర్శనం
అప్పుడు అనంత పద్మనాభ స్వామి వారికి కౌండిన్యుడిపై జాలి కలిగి, ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వస్తాడు. స్వామివారు కౌండిన్యుడిని లేవనెత్తి, ఒక భవనానికి తీసుకువెళ్లి సేదతీర్చి, ఈ తర్వాత తన నిజరూపంతో దర్శనం ఇస్తాడు. అప్పుడు కౌండిన్యుడు అనంత పద్మనాభ స్వామి వారిని అనేక విధాల స్తుతిస్తూ తన దారిద్య్రాన్ని తొలగించి, చివరికి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అనంతుడు అతనిపై కరుణ చూపి, అనుగ్రహించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను మార్గమధ్యలో కళ్లారా చూసిన వింతల గురించి స్వామివారిని అడుగుతాడు. దానికి స్వామి వారు బదులిస్తూ.. “ఓ విప్రోత్తమా.. తాను నేర్చుకున్న ఏదైనా విద్యను ఇతరులకు దానం చేయని వ్యక్తి అలా ఒంటరి మామిడి చెట్టుగా మిగులుతాడు. చవిటి నేలను దానం ఇచ్చినవాడు మరుజన్మలో మేత మేయని పశువు, ఒకరికొకరు దానాలు ఇచ్చిపుచ్చుకున్న అక్కాచెల్లెళ్లు ఆ కొలనులు. అలాగే ఎంత ధనవంతుడిగా పుట్టినా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయనివాడు ఒంటరి ఆంబోతుగా.. కారణం లేకుండా ఇతరులను దూషించే వాడు గాడిదగా.. అధర్మంగా నడిచేవాడు ఏనుగులా పుడతాడు” అని వాటి పూర్వ జన్మలు చెప్పాడు. అప్పుడు కౌండిన్యుడు, “స్వామీ! వాటిని కటాక్షించు” అని వేడుకుంటే “నీ నిస్వార్థమైన కోరికకు సంతోషించి వాటికి విముక్తిని ఇస్తున్నాను. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు” అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యాడు.
కౌండిన్యుని తిరుగు ప్రయాణం
భగవంతుని దర్శనం పొందిన కౌండిన్యుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సుశీలతో కలిసి భక్తిశ్రద్ధలతో అనంత వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించాడు వారి జీవితంలో మళ్లీ సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి నెలకొన్నాయి. చివరికి కౌండిన్యుడు జీవితానంతరం ఉత్తమమైన లోకాలను, నక్షత్రమండలాన్ని పొందాడు.
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “ఓ ధర్మరాజా! మహాత్ముడైన కౌండిన్యుడు ఇప్పటికీ నక్షత్రమండలంలో కనిపిస్తాడు. అలాగే అగస్త్య మహర్షి కూడా ఈ అనంత వ్రతాన్ని ఆచరించి లోకంలో గొప్ప కీర్తిని పొందాడు. సగరుడు, దిలీపుడు, భరతుడు, హరిశ్చంద్రుడు, జనక మహారాజు వంటి అనేక మంది మహారాజులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తమ జీవితాల్లో రాజ్యసుఖాలను అనుభవించి, చివరికి స్వర్గలోకాన్ని పొందారు. ఈ వ్రతాన్ని ఆచరించి, ఈ కథను శ్రద్ధగా విని, భక్తితో అనంతపద్మనాభ స్వామిని స్మరించే వారు ఇహలోకంలో అష్టైశ్వర్యాలను అనుభవించి, చివరికి ఉత్తమమైన పరమపదాన్ని పొందుతారు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇలా శ్రీకృష్ణుడు చెప్పిన అనంతపద్మనాభ స్వామి వ్రత మహిమను సూత మహర్షి శౌనకాది మహర్షులకు వివరించాడు.
ఇలా అనంతుడి అనుగ్రహాన్ని పొందిన కౌండిన్యుని కథ మనకు వ్రతం యొక్క మహిమను తెలియజేస్తుంది. మరి మనం ఈ పవిత్రమైన అనంత వ్రతాన్ని సాధారణంగా ఎలా ఆచరించాలి? ఇప్పుడు ఆ పూజా విధానాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం.
అనంత పద్మనాభ వ్రతం – పూజా విధానం
ఈ వ్రతం ఆచరించాలి అనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఎర్రటి వస్త్రాలు ధరించాలి. ఈ వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయం (ఆవు పేడ)తో అలికి, రంగవల్లులు, పూలు, పత్రాలతో అలంకరించాలి. పూజా పీఠాన్ని ఏర్పాటు చేయాలి. అనంత పద్మనాభుని చిత్రం లేదా విగ్రహం, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, తులసి దళాలు, అక్షతలు, ధూపం, దీపం, పండ్లు, నైవేద్యం, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, 14 ముడుల అనంత సూత్రం, దర్భలు వంటి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
కలశంలో నీరు, కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేసి, పసుపు, కుంకుమతో అలంకరించాలి. మామిడి ఆకులు ఉంచి, పైన కొబ్బరికాయను ఏర్పాటు చేయాలి. ఈ కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేయాలి. దర్భలతో పాము బొమ్మను తయారుచేసి, కలశం మీద ఉంచాలి. పిండితో ఏడు పడగల పామును చిత్రించాలి.
అనంతుడైన శ్రీమహావిష్ణువును ధ్యానించి పూజకు ఆహ్వానించాలి. అనంత శేషునిపై శయనిస్తున్న శ్రీమహావిష్ణువు స్వరూపాన్ని ధ్యానిస్తూ షోడశోపచారాలతో పూజ చేయాలి. 14 ముడులు కలిగిన అనంత సూత్రాన్ని పూజా స్థలంలో ఉంచి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఈ సూత్రాన్ని- పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి కట్టుకోవాలి. ఈ పద్నాలుగు ముడులు పద్నాలుగు లోకాలకు ప్రతీకలుగా భావించబడతాయి. మరుసటి సంవత్సరం పాత తోరం విసర్జించి, కొత్త తోరం కట్టుకోవాలి. పూజ అనంతరం అనంత వ్రత కథను భక్తితో వినాలి లేదా చదవాలి. 14 లేదా 28 రకాల పిండి వంటలను, భక్ష్యాలను ముఖ్యంగా బెల్లంతో చేసిన అరిసెలు నైవేద్యంగా సమర్పించి, హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ భగవంతునికి నమస్కరించాలి. 14 సంవత్సరాల పాటు వ్రతాన్ని కొనసాగించి, అనంతరం ఉద్యాపనం చేయాలి.
సుశీల–కౌండిన్యుల కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భగవంతుని అనుగ్రహాన్ని తక్కువగా చూడకూడదు, అహంకారానికి దూరంగా ఉండాలి. భక్తి, విశ్వాసం, వినయంతో ధర్మమార్గంలో నడుస్తూ, తప్పులు జరిగినప్పుడు భగవంతుని శరణు కోరాలి. అదే అనంత వ్రతం యొక్క అసలైన భావం.
శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి కృపాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని… మీ ఇంట సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

