అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?”
దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ, నాశ రహితమూ అనిర్వచనీయమూ, అవ్యక్తమూ, సర్వవ్యాప్తమూ, ఉహాతీతమూ, నిర్వికారమూ, నిశ్చలమూ, నిత్యమూ అయిన ఆత్మ స్వరూపాన్ని ఉపాసించేవాళ్లు నన్నే పొందుతారు. అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని ఆరాధించేవాళ్ల శ్రమ ఎంతో ఎక్కువ. ఎందువల్లనంటే శరీరం మీద అభిమానం కలవాళ్లకు అవ్యక్తబ్రహ్మం మీద నిష్ట కుదరడం కష్టసాధ్యం.
పార్ధా! సమస్త కర్మలూ నాకే సమర్పించి, నన్నే పరమగతిగా భావించి, ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనస్సు నా మీదే నిలిపే వాళ్లను, మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్దరిస్తాను. నా మీదే మనస్సునూ, బుద్దినీ నిలుపు. అలా మనస్సు నా మీదే నిశ్చలంగా నీవు నిలపలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడంవల్ల కూడా నీవు మోక్షం పొందగలుగుతావు. ఇక అదీ చేయలేకపోతే, నన్ను ఆశ్రయించి, మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చేయి. సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా, స్నేహభావం, దయ, కలిగి అహంకార మామకారాలు విడిచి పెట్టి సుఖదుఖాలను సమానంగా చూస్తూ, ఓర్పుతో వ్యవహరిస్తే, నిత్యం సంతృప్తితో, యోగ సాధనతో, ఆత్మనిగ్రహంతో, ధృడ సంకల్పంతో మనసూ, బుద్ది నాకు అర్పించిన నా భక్తుడు, నాకు ఇష్టుడు. తన లోకమూ, లోకం వల్ల తానూ భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా వుండేవాడు నాకు ఇష్టుడు.
దేని మీదా కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకు చింతా లేనివాడు, ఆడంబర కర్మలన్నీటిని విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. సంతోషం, ద్వేషం లేకుండా దుఃఖం, కోరికలూ, శుభాశుభాలు వదిలిపెట్టిన నా భక్తుడు అంటే నాకు ఇష్టం.
శత్రువుల పట్ల, మిత్రుడు పట్ల, అలాగే మానవ, అమానవ, శీతోష్ణాలూ, సుఖదుఃఖాలు, దూషణభూషణాల పట్ల సమభావం కలిగినవాడు దేని మీదా ఆసక్తి లేనివాడు, మౌనంగా వుండేవాడు, ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు. స్థిరనివాసం లేనివాడు, ధృడనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. శ్రద్దతో నన్నే పరమగతిగా నమ్మి, అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు.
1 thought on “భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము”