భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

Bhagavadgita meaning in telugu

11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము

అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు.
అప్పుడు శ్రీ భగవానుడు “పార్ధా! అనేక రంగులతో, అనేక ఆకారాలతో అనేక విధాలుగా వందల కొద్ది, వేల కొద్ది వున్న నా దివ్యరూపాలను చూడు. అర్జునా! ఆదిత్యులను, వస్తువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మారుత్తులను చూడు. అలాగే ఇది వరకు ఎప్పుడూ కనివినీ ఎరుగని వింతలను వీక్షించు. అర్జునా! నా శరీరంలో ఒకే భాగంలో వున్న చరాచారాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలచినదంతా ఈ దేహంలోనే అవలోకించు.  నీ కళ్ళతో నీవు నన్ను చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను. దానితో నా విశ్వరూపం చూడు” అని మహాయోగీశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి శ్రేష్టమైన తన విశ్వరూపం చూపించాడని సంజయుడు దృతరాష్ట్రుడికి చెప్పాడు.
ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, దివ్యాభరణాలతో, ఎక్కు పెట్టిన పెక్కు దివ్యాయుధాలతో, దివ్య పుష్ప వస్త్రాలతో, దివ్యగంధాలతో మహాశ్చర్యకరం, దేదీప్యమానం, అనంతం, విశ్వముఖమూ అయి విరాజిల్లుతున్నది. ఏకకాలంలో ఆకాశంలో వేలమంది సూర్యులు వెలుబడిన కలిగే కాంతి,  ఆ మహత్ముడి విశ్వరూప తేజస్సుకు సాటికాదు. అప్పుడు అర్జునుడు, దేవదేవుడి దేహంలో ఒకేచోట ఎన్నో విధాలుగా విభజించబడివున్న సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరంలో పులకరించగా, భగవంతుడికి తలవంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు.
 దేవా! నీ దేహంలో సమస్త దేవతలనూ, చరాచర జగత్తునూ, కమలాసనంలో వున్న బ్రహ్మనూ, సర్వఋషులనూ, దివ్యసర్పాలను చూస్తున్నాను. అనేక భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంతరూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుదీ, మొదలు, మధ్య మాత్రం నాకు కానరావడం లేదు.
కిరీటం, గదా, చక్రం ధరించి దశదిశలా కాంతి పుంజం లాగా వెలుగొందుతూ, చూడడానికి సాధ్యపడకుండా, సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తూన్న, అంతూ దరీ లేని నిన్ను అంతటా చూస్తున్నాను.
నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవనీ, సమస్త జగత్తుకి మూలాధారమైన వాడవనీ, నాశనం లేనివాడవనీ, సనాతన ధర్మ సంరక్షకుడవనీ, పురాణపురుషుడవనీ నేను భావిస్తున్నాను. నీవు ఆదిమధ్యంతాలు లేనివాడవు, అపరిమితమైన సామర్ధ్యం కలవాడవు, ఎన్నో చేతులు కలవాడవు, చంద్ర సూర్యులు కన్నులుగా కలవాడవు, ప్రజ్వలిస్తూన్న అగ్ని లాంటి ముఖం కలవాడవు. నీ తేజస్సుతో ఈ జగత్తునంతటిని తపించేస్తున్నవాడవు అయిన నీవు నాకు సాక్షాత్కారిస్తున్నావు.
భూమికి ఆకాశానికి మధ్యవున్న ఈ ప్రదేశంలో దిశదశలూ నీతో నిండి వున్నాయి. అధ్బుతం, అతి భయంకరం అయిన నీ ఈ విశ్వరూపం చూసి మూడు లోకాలూ గడగడ వణుకుతున్నాయి. ఈ దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంత మంది భీతితో, చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు, మంగళ వాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగతున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, సిద్ది, అసురులు – వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు. ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, కోరలతో, భయంకరంగా వున్న నీ రూపం చూసి లోకులంతా ఎంతో భయపడుతున్నారు. అలాగే నేనూ భయపడుతున్నాను.
ఆకాశాన్ని అంటుతూ, అనేక రంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి, ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా, ప్రళయకాలంలోని అగ్నిలాగా కానవస్తున నీ ముఖాలు, నాకు దిక్కు తోచకుండా చేశాయి. దిగులుపడి వున్న నన్ను అనుగ్రహించు. ఎంతోమంది రాజులతోపాటు, ఈ దృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ, వాడి కోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ల సందులో ఇరుక్కుపోయి, పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు. అనేక నది ప్రవాహాలు సముద్రం వైపు పరుగెడుతున్నట్లే ఈ నరలోక వీరులంతా ప్రజ్వలిస్తూన్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే, నశించడం కోసం మహావేగంగా నీ నోళ్ళలో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు. మండుతున్న నీ నోళ్ళతో ఈ సర్వ లోకాలను మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటిని నీ తేజస్సుతో నింపి, తీవ్రమైన కాంతితో దాన్ని తపింపచేస్తున్నావు. ఉగ్రరూపంలో వున్న నీవెవరవో చెప్పు. నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. ఆది పురుషుడైన నిన్ను గురించి తెలుసుకోదలచాను. నీ ప్రవృత్తి నాకు అర్ధం కావడం లేదు.” అన్నాడు.
అప్పుడు శ్రీ భగవానుడు ఇలా పలికాడు. ఈ లోకసంహారానికి విజృంభించిన కాలస్వరూపుణ్ణి నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించడమే నా సంకల్పం. నీవు యుద్దం చేయకపోయినా శత్రుసైన్యంలోని వీరులంతా వినాశనం పొందడం ఖాయం. అందువల్ల నీవు యుద్దానికి సిద్దమై, పేరు ప్రఖ్యాతలు పొందు. శత్రువులను జయించిన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళందరిని ముందే నేనే చంపేశాను. నీవు నిమిత్తమాత్రంగా నిలబడు. ఇది వరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రదుడు, కర్ణుని వంటి వీరులందరినీ నీవు వధించు. భయపడకు. యుద్దం చెయ్యి. శత్రువులను జయిస్తావు.
శ్రీ కృష్ణుడి మాటలు విని అర్జునుడు వణుకుతూ, చేతులు జోడించి నమస్కరించి, బాగా భయపడి పోయి, మళ్ళీ నమస్కారం చేసి, గద్గద స్వరంతో ఇలా అన్నాడు. హృషీకేశా! నీ మహిమను పొగుడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్దుల సంఘాలన్ని నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే. మహాత్మా, నీవు అంతంలేని వాడవు. దేవతలకు, జగత్తుకంతటికి ఆధారుడవు, శాశ్వతుడవు. అందరికంటే గొప్పవాడవు. బ్రహ్మదేవుడికి కూడా ఆదికారణుడవు అయిన నీకు వాళ్ళెందుకు నమస్కరించరు. నీవు ఆదిశేషుడవు. పురాణపురుషుడవు.
సమస్తజగత్తుకూ ఆధారుడవు. సర్వమూ తెలిసినవాడవు. తెలుసుకోదగ్గవాడవు. అనంతరూపా! ఈ విశ్వమంతా, పరంధాముడవైన నీతో నిండివున్నది. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు నీవే.
నీకు అనేక వేల వేల నమస్కారాలు. సర్వ స్వరూపా! అపరిమిత సామర్ధ్యమూ, అమిత పరాక్రమమూ కలిగిన నీవు, సర్వత్రా వ్యాపించి వున్నావు. అచ్యుతా! నీ మహిమ తెలుసుకోలేక, స్నేహితుడవనే ఉద్దేశ్యంతో, పొరపాటునో, చనువు వల్లనో,  “కృష్ణా! యాదవా! సఖా!” అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకూ, కలిసిమెలిసి తిరిగేటప్పడు, పడుకున్నపుడు, ఇతరులతో వున్నపుడు, వేళాకోళంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవైన నిన్ను, తప్పులన్నిటినీ మన్నించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. ఈ చరాచర ప్రపంచమంతటికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురువులకు గురువుడవు. మూడు లోకాలలో నీతో సమానమైనవాడే లేనప్పుడు, నిన్ను మించినవాడెలా వుంటాడు. అందువల్ల ప్రభుడవు పూజ్యుడవు, అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసినదిగా వేడుకుంటున్నాను. దేవా! తండ్రి కొడుకునీ, స్నేహితుడు స్నేహితుణ్ణి, ప్రియుడు ప్రియురాలినీ క్షమించినట్లు నీవు నన్ను క్షమించాలి.
దేవా! ఎప్పుడు చూడనీ ఈ విశ్వారూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనస్సు భయంతో ఎంతో బాధపడుతున్నది. దయ వుంచి నీ పూర్వ రూపాన్నే చూపించు, అనుగ్రహించు. మునుపటిలాగే కిరీటం, గద, చక్రం ధరించి నిన్ను చూడదలిచాను. వేయి చేతులు కలిగిన విశ్వమూర్తీ! నాలుగు భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు” అన్నాడు.
శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “అర్జునా! నీ మీద దయా తలచి నా యోగమహిమతో తేజోమయమూ, సర్వోత్తమమూ, సనాతనమూ, అనంతమూ అయిన విశ్వరూపం నీకు చూపించాను. నీకు తప్ప ఎవరూ ఈ రూపాన్ని చూడలేరు. నీవు తప్ప, ఈ లోకంలో ఇంకెవ్వరు వేదాలు చదవడంవల్ల కాని, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోర తపస్సులు చేయడం వల్ల కాని, ఈ విశ్వ రూపాన్ని సందర్శించడం సాధ్యపడదు. ఘోరమైన నా ఈ విశ్వరూపం చూసి భయపడకు. భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు”  అని అర్జునుడితో చెప్పి, శ్రీ కృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహత్ముడు, తన శాంతమైన శరీరం ధరించి, భయభీతుడైన అర్జునుణ్ణి ఓదార్చాడని సంజయుడు దృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.
అర్జునుడు శ్రీకృష్ణుడితో  “జనార్ధనా! ప్రశాంతమైన నీ మానవరూపం చూశాక నా మనసు కుదుటపడింది. నాకు స్వస్థత ఏర్పడింది” అన్నాడు.  అందుకు శ్రీ కృష్ణభగవానుడు “నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడడం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యమూ కోరుతుంటారు.
విశ్వరూపుడైన నన్ను నిజంగా తెలుసుకోవడానికి, చూడడానికి, చేరడానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది. అర్జునా! నా కోసమే కర్మలు చేస్తూ, నన్నే పరమగతిగా భావించి, నా మీదే భక్తి కలిగి, దేని మీదా ఆసక్తి లేకుండా, సమస్త ప్రాణులపట్ల శత్రుభావం లేనివాడు నన్ను పొందుతాడు.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
Tags: , , , , , , , , , , ,