కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి, యోగి అవుతాడు. అంతే కానీ అగ్నిహోత్రాది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. సన్యాసమూ, కర్మ యోగమూ ఒకటే అని తెలుసుకో. ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్ది పొందిన వాడికి కర్మ త్యాగమే సాధనం. తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు చేసుకోకుడదు. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి, తన మనస్సే బంధువు. మనస్సును జయించడానికి మనస్సే ప్రబల శత్రువులాగ ప్రవర్తిస్తుంది. ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాల పట్ల సమభావం కలిగి ఉంటాడు.
ఇంద్రియాలను జయించినవాడు మట్టినీ, రాతినీ, బంగారాన్ని సమదృష్టితో చూసేవాడు యోగి అని చెప్పబడతాడు. శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి – వీళ్ళందరిపట్ల సమబుద్ది కలిగినవాడే సర్వోత్తముడు. యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా వుండి, ఆశలను వదిలి ఇంద్రియాలనూ, మనస్సునూ వశపరచుకొని, ఏమి పరిగ్రహించకుండా, చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి. ఎక్కువ ఎత్తు, పల్లమూ కాని పరిశుద్దమైన ప్రదేశంలో దర్బలు పరచి, దాని మీద చర్మమూ, ఆ పైన వస్త్రమూ వేసి, స్థిరమైన అసనాన్ని ఏర్పరచుకోవాలి. ఆ ఆసనం మీద కూర్చొని, ఇంద్రియాలనూ, మనస్సునూ స్వాధీన పరచుకొని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ది కోసం, యోగాభ్యాసం చేయాలి. శరీరమూ, శిరస్సు, కంఠమూ కదలకుండా స్థిరంగా ఉంచి, దిక్కులు చూడకుండా, ముక్కు చివర దృష్టి నిలిపి, ప్రశాంత చిత్తంతో, భయం విడిచిపెట్టి, బ్రహ్మచర్యవ్రతం అవలంబించి మనోనిగ్రహం కలిగి, బుద్దిని నా మీదనే లగ్నంచేసి, నన్నే పతిగా, గతిగా భావించి ధ్యానం చేయాలి. అలాంటి యోగి ఆత్మానుభవం మీద మనస్సును నిరంతరం నిలిపి, నా అధీనంలో వున్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు. అర్జునా! అమితంగా భుజించేవాళ్ళకి, బొత్తిగా తినని వాళ్ళకి, అధికంగా నిద్రపోయే వాళ్ళకి, అస్సలు నిద్ర పోని వాళ్ళకి యోగం సిద్దించదు.
ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కోవడంలో పరిమితి పాటించే యోగికి, సర్వ దుఃఖాలూ పోయి, యోగసిద్ది కలుగుతుంది. మనస్సును వశపరచుకొని, ఆత్మమీద నిశ్చలంగా నిలిపి, సర్వవాంఛలూ విసర్జించినప్పుడు, యోగసిద్ది పొందుతాడని చెబుతారు. ఆత్మయోగం అభ్యసించేవాడి మనస్సు గాలిలేని చోట వుండే దీపంలాగా, నిలకడగా వుంటుంది.
ఏ స్థితిలో మనస్సు యోగాభ్యాసం వల్ల నిగ్రహించబడి, శాంతిని పొందుతుందో, యోగి ఎప్పుడు పరిశుద్దమైన మనస్సుతో, పరమాత్మను తనలో సందర్శిస్తూ సంతోషిస్తున్నాడో, ఇంద్రియాలకు గోచరించకుండా బుద్దివల్లనే గ్రహించబడే అనంత సుఖాన్ని అనుభవిస్తాడో, ఏ స్తితిలో స్థిరంగా వుండి, దుర్భర దుఃఖానికయినా కలత చెందడో, దుఃఖాలకు దూరమైన అలాంటి దానినే యోగమంటారు.
దిగులు పడకుండా దీక్షతో ఆ యోగాన్ని అభ్యసించాలి. సంకల్పం వల్ల కలిగే సకల వాంఛలనూ సంపూర్ణంగా విడిచిపెట్టి, ఇంద్రియాలన్నిటినీ సమస్త విషయాల నుంచి మనస్సుతోనే మళ్ళించి, బుద్ది, ధైర్యంతో మనస్సును ఆత్మమీదనే నెమ్మదిగా నిలిపి, చిత్తశాంతి పొందాలి. చంచలమూ, అస్థిరమూ అయిన మనస్సు ఏయే విషయాల మీదకు వెళుతుందో, ఆయా విషయాల నుంచి దానిని మళ్లించి, ఆత్మమీదే నిలకడగా వుంచాలి. ఇలా మనస్సునెప్పుడు ఆత్మమీద లగ్నం చేసి, యోగి అతి సులభంగా సర్వోత్కృష్టమైన సుఖం పొందుతాడు. అన్నీ భూతాలలో నన్ను, నాలో అన్నీ భూతలనూ చూసేవాడికి నేను లేకుండా పోను. నాకు వాడు లేకుండా పోడు. సమస్తజీవుల సుఖదుఃఖాలను తనవిగా తలచేవాడు యోగులలో శ్రేష్టుడని నా అభిప్రాయం” అని పలికాడు. అప్పుడు అర్జునుడు “మధుసుదనా! మనస్సు నిలకడ లేనిది కావడం వల్ల, నీవు ఉపదేశించిన ఈ జీవాత్మపరమాత్మల సమత్వయోగాన్ని స్థిరమైన స్థితిలో చూడలేకపోతున్నాను. కృష్ణా! మనస్సు చాలా చంచలం, బలవత్తరం, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించడం, వాయువును నిరోధించడంలాగ దుష్కరమని భావిస్తున్నాను” అన్నాడు. అప్పుడు శ్రీ భగవానుడు “అర్జునా! మనస్సు చంచల స్వభావం కలిగింది, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల వశపరచుకోవచ్చు. ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్దించదని నా వుద్దేశం. ఆత్మ నిగ్రహం వుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు” అన్నాడు.
అర్జునుడు శ్రీకృష్ణుడితో “శ్రద్ద వున్నప్పటికి మనో నిగ్రహం లోపించిన కారణంగా, యోగంలో చిత్తం చలించినవాడు యోగ సంసిద్ది పొందకుండా ఏ గతి పొందుతాడు. మోక్ష సంపాదన మార్గంలో నిలకడ లేనివాడు, ఇహపర సౌఖ్యాలు రెండింటికి భ్రష్టుడై చెదరిన మేఘాలలాగ చెడిపోడు కదా! ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమార్ధడవు. ఈ సంశయాన్ని తీర్చడాన్నికి నన్ను మించినవాడు మరొక్కడెవ్వడూ లేడు” అని పలికాడు. అర్జునుడి మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “అర్జునా! యోగభ్రష్టుడికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కాని ఎలాంటి హాని కలుగదు. మంచిపనులు చేసిన మానవుడేపుడూ దుర్గతి పొందడు. యోగభ్రష్టుడు, కర్మలు చేసేవాడు పొందే ఉత్తమలోకాలు చేరి, చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నులైన భాగ్యవంతులైన యింటిలో జన్మిస్తాడు. లేకపోతే బుద్దిమంతులైన యోగుల వంశంలోనే పుడుతాడు.
అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందడం ఎంతో దుర్లభం. అలా యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కార విశేషం వల్ల సంపూర్ణ యోగిసిద్ది కోసం గతంలో కంటే ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తాడు. పూర్వజన్మ లోని అభ్యాసబలం మూలంగా, ఆ యోగభ్రష్టుడు తాను తలపెట్టక పోయినా, మళ్ళీ యోగసాధన వైపుకు లాగబడుతాడు. పట్టుదలతో ప్రయత్నించే యోగి పాపవిముక్తుడై, అనేక జన్మలకు సంబంధించిన సాధనాసంపర్కం వల్ల, యోగసిద్ది తరువాత మోక్ష ఫలం పొందుతాడు. తపస్సు చేసేవాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానం కలవాళ్ళకంటే, యోగుల కంటే, ధ్యానయోగి గొప్పవాడు. కనుక నీవు ధ్యానయోగం సాధించాలి. యోగులందరిలోనూ- మనస్సు నా మీదే నిలిపి, శ్రద్ధాభక్తులతో నన్ను సేవించేవాడే ఉత్తముడని నా వుద్దేశం.