భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

Bhagavadgita meaning in telugu

17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము

అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా?
శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద ఉంటుందో, వాడు అలాంటి వాడే అవుతాడు. సాత్త్వికులు దేవతలనూ, రాజసులూ యక్షరాక్షసులను, తామసులు భూతప్రేతాలను పూజిస్తారు. శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా, అంతరాత్మగా వున్న నన్ను కూడా పీడించే  ఆడంబరులూ, అహంకారులూ, కామ బల గర్వితులూ, అసుర స్వభావం కలిగిన వాళ్లని తెలుసుకో. అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, జ్ఞానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను. సాత్త్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్దాలు ఇవి – ఆయుర్ధాయం బుద్ది బలం, శరీర బలం, ఆరోగ్యం సుఖం సంతోషం వీటిని వృద్ది చేస్తూ రసమూ, చమురు కలిగి చాలా కాలం ఆకలిని అణిచిపెట్టి, మనస్సుకి ఆహ్లాదం కలుగజేసేవి. రాజసులకు- బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం కలిగి వెర్రి దాహం పుట్టించే ఆహార పదార్ధాలంటే ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనస్సుకు వ్యాకులత, వ్యాధులు కలుగజేస్తాయి. తామసులకు చల్లబడిపోయింది, సారం లేనిది, వాసన కొడుతున్నది, చల్లటిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం అంటే ఇష్టం.
అర్జునా! ఫలాన్ని ఆశించి కాని, ఆడంబరం కోసం కాని చేసే యజ్ఞం రాజసయజ్ఞం అని గ్రహించు. ఆశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్దతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమంటారు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా ఉండడం, కల్లా కపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మ చర్య దీక్షనూ, అహింసా వ్రతాన్ని అవలంబించడం – వీటిలో శరీరంతో చేసే తపస్సని చెబుతారు. ఇతరులకి బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితం అయిన సంభాషణ సాగించడం, వేదాధ్యయనం చేయడం, వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు. మనస్సును నిర్మలంగా వుంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావమూ, ఆత్మ నిగ్రహమూ అంతఃకరణ శుద్ది కలిగి ఉండడం – మనస్సుతో చేసే తపస్సు అంటారు.
నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్లు పరమశ్రద్దతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేసే అది సాత్త్వికం చెబుతారు. సత్కారం, సన్మానం, పూజలుపొందడం కోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, ఆనిశ్చితం. అలాంటిది రాజసమంటారు. మొండి పట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లు కాని, ఇతరులకు హాని తలపెట్టి కాని చేసే తపస్సు తామసమవుతుంది. దానం చేయడం కర్తవ్యంగా భావించి, పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి, ప్రత్యుపకారం చేయలేని వాళ్లకు చేసే దానమే సాత్త్వికం. ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశ్యంతో కాని, ప్రతి ఫలాన్ని ఆశించి కాని మనసులో బాధపడుతూ కాని చేసే దానం రాజసం.
అనువు గాని చోట అకాలంలో అపాత్రుడికి- ఆగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానం తామసం. పరబ్రహ్మకు ఓం తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగా చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడు “ఓమ్” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు. మోక్షాన్ని కోరేవాళ్లు ఫలాపేక్ష లేకుండా పలు విధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సుల వంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు. ఈ రెండు అర్ధాలతో సత్ అనే పదాన్ని వాడుతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు. యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్టకు కూడా సత్ శబ్ధం సంకేతం. ఈశ్వరుడికి ప్రీతి చేసే కర్మలన్నీటిని సత్ అనే చెబుతారు. హోమం, దానం, తపస్సు ఇతర కర్మలు వీటికి అశ్రద్దగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటి వల్ల ఇహలోకంలో కాని పరలోకంలోకాని ఫలితమేమి ఉండదు.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
Tags: , , , , , , , , , , ,