అర్జునుడు కన్నీరు కారుస్తుండగా, శ్రీ కృష్ణ పరమాత్మ “అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్దమూ, అపకీర్తిదాయకమూ, నరకప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ది నీకెందుకు పుట్టింది? అధైర్యం పనికిరాదు. నీచమైన మనోదౌర్బల్యం విడిచిపెట్టు. యుద్దం ప్రారంభించు” అన్నాడు.
అప్పుడు అర్జునుడు “మధుసూధనా! పూజార్హులైన భీష్మ ద్రోణాదులను, బాణాలతో నేనెలా కొట్టగలను. మహానుభావులైన గురువులను చంపడం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి, రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించడం కంటే, బిచ్చమెత్తుకోవడం మేలు. యుద్దం చేయడం మంచిదో కాదో తెలియడం లేదు. మనం జయిస్తామో, వారు జాయిస్తారో చెప్పలేం. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో, ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా వున్నారు. గురువులూ, బంధువులూ అనే మమకార దోషం వల్ల నా బుద్ది నశించింది. మంచి ఏదో తెలియడం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించిన నాకు ఏది శ్రేయమార్గమో దాన్ని ఆదేశించు. భూలోకాధిపత్యం లభించినా, స్వర్గాధిపత్యం సిద్ధించినా, నా శోకం తగ్గుతుందనుకోకు” అని శ్రీ కృష్ణుడితో చెప్పి, యుద్దం చేయనని ఊరుకున్నాడు.
రెండు సేనల మధ్య విషాదవశుడైవున్న అర్జునున్ని చూసి, శ్రీ కృష్ణపరమాత్మడు పరిహాసంగా ఇలా అన్నాడు. “అర్జునా! దుఃఖించనవసరం లేని వాళ్ల కోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతున్నావు. చనిపోయినవాళ్ళ గురించి కానీ, బ్రతికున్న వాళ్ల గురించి కానీ, వివేకులు శోకించరు. నీవు, నేను, వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్ లో కూడా వుంటాము. జీవికి ఈ శరీరంలో… కౌమారం, యవ్వనం, వార్ధక్యం వచ్చినట్టే, మరణానతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు. విషయాలకు వశమైన ఇంద్రియాల వల్ల సుఖ దుఃఖాలు కలుగుతూంటాయి. సుఖ దుఃఖాదులు ఎవడినో బాధించవో, అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.
ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మ నాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలూ కావు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక, యుద్దం మొదలు పెట్టు. ఈ ఆత్మ చంపుతుందని కానీ చంపబడుతుంది అని కానీ భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కానీ చచ్చేది కానీ కాదు. ఆత్మకు పుట్టడం, చావడం అనేవి లేవు. జన్మరహిత్యమూ, శాశ్వతమూ, అనాది సిద్దమూ అయిన ఆత్మ, నిత్యం. అందువల్ల, శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.
మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్టే, ఆత్మ కృశించిన శరీరాలను వదిలి, కొత్త దేహాలను పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు. అగ్ని కాల్చలేదు. నీరు తడుపలేదు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకుని నీవు విచారించడం మానుకో. పుట్టినవాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టక తప్పదు. జీవులు పుట్టుకకు పూర్వం కానీ మరణానంతరం కానీ ఏ రూపంలో వుంటాయో ఎవ్వరికీ తెలియదు. మధ్య కాలంలో మాత్రమే కనపడుతాయి. అలాంటప్పుడు విచారించడమెందుకు?
ఆత్మ స్వరూప స్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు. అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు, చావు అనేది లేదు. అందువల్ల, ఈ ప్రాణుల గురించి నీవు దుఖిఃంచనక్కరలేదు. ఎందుకంటే, క్షత్రియుడికి ధర్మయుద్దానికి మించిన మహభాగ్యం మరోకటి లేదు. తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం, పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు. నీవు ఈ ధర్మయుద్దం చేయకపోతే, నీ కులధర్మమూ, పేరుప్రఖ్యాతులు పాడు చేసి, పాపం కట్టుకుంటావు. అంతే కాకుండా, నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువుప్రతిష్టలున్న వాడికి, అపనిందకంటే మరణమే మంచిది. ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా, భయపడి యుద్దం మానేశావని భావించి, చులకనగా చూస్తారు. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ, అనరాని మాటలెన్నో అంటారు. అంతకుమించిన దుఖఃమేముంది. అర్జున! ధర్మయుద్దంలో మరణిస్తే, స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే, రాజ్య భోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్దానికి నడుము బిగించు. సుఖదుఖఃలూ, లాభనష్టాలు, జయాపజయాలు సమానంగా భావించి, సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలుగదు. ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసారబంధం వదులుకోవడానికి సాధనమైన, నిష్కామ కర్మయోగం గురించి చెపుతాను విను. ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా వృధాగా పోదు. దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా, ఈ యోగం దారుణమైన సంసార భయం నుంచి కాపాడుతుంది. స్థిర సంకల్పం లేని వాళ్ల ఆలోచనలు, పరిపరివిధాల పరుగులెడతాయి. అవివేకులూ, స్వర్గ సుఖాలకు మించి మరొకటి లేదని భావించే వాళ్ళు, తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించాక, వాళ్ళకు మళ్ళీ కర్మ భూమిలో పునర్జన్మరూపమైన కర్మఫలమే తప్ప మోక్షం లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వశులైనవారి బుద్ది నిలకడగా వుండదు. నది నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళు, బావికి ఎలా ప్రాముఖ్యమివ్వరో, అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం యివ్వరు. కర్మలు చేయడం వరకే నీకు అధికారం.
కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మానడానికి చూడకు. ఫలం దక్కినా, దక్కక పోయినా, కర్మలు సమభావనతో సాగించు. ఈ సమదృష్టినే యోగమంటారు. ఫలితం ఆశించి కర్మచేసే వాళ్ళు అల్పులు. సమభావన కలిగిన పురుషుడు, పుణ్య పాపాలను రెండింటిని ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ది అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో. నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మ బంధనాలనుంచి తప్పించుకొని ఉపద్రవం లేని మోక్షం పొందుతున్నారు. నీ బుద్ది అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు, అర్ధవాదాలు అనేకం విన్నా నీ మనస్సు నిశ్చలంగా వున్నప్పుడు, నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.” అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో. “కేశవా! సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞనుడి లక్షణాలేమిటి? అతని ప్రసంగమూ, ప్రవర్తన ఎలా ఉంటాయి? అని అడిగాడు.
అప్పుడు శ్రీ కృష్ణాభగవానుడు! “మనస్సులోని కోరికలన్నీటిని విడిచిపెట్టి ఎప్పడూ ఆత్మానందం అనుభవించే వాడే స్థితప్రజ్ఞడు. దుఃఖాలకు క్రుంగనివాడు, సుఖాలకు పొంగని వాడు, భయం, రాగద్వేషాలు వదిలిపెట్టిన వాడు అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞడు. స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ, శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడే స్థితప్రజ్ఞడు. తాబేలు తన అవయవాలు లోపలికి ఎలా ముడుచుకుంటుందో, అలాగే ఇంద్రియాలను సర్వవిధాలా విషయ సుఖాల నుంచి మళ్లించినవాడు స్థితప్రజ్ఞడవుతాడు. ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం, ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. యోగాసాధకుడు ఇంద్రియాలన్నింటిని వశపరచుకొని, నా మీదే మనసు వుండాలి. ఎప్పుడు విషయాల గురించి ఆలోచించేవాడికి వాటిమీద బాగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలుగజేస్తాయి. కోపం వల్లన అవివేకం కలుగుతుంది. ఆవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ది నశించశడం, బుద్ది నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. మనసుని నిగ్రహించుకొని, రాగద్వేషాలు లేకుండా, తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించే వాడు మనశ్శాంతిని పొందుతాడు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కానీ ఆత్మ చింతన కానీ అలవడవు. అలాంటివాడికి, మనశ్శాంతి, సుఖం శూన్యం. చుక్కాని లేని నావను సుడిగాలి దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు, పురుషుని బుద్దిని పాడు చేస్తుంది. అందువల్ల విషయ సుఖాల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి, స్థిరమైన బుద్ది కలుగుతుంది. వాడే స్థితప్రజ్ఞడు. కోరికలన్నీటిని విడిచిపెట్టి, ఆశ అహంకారం, మమకారం లేకుండా మెలిగేవాడు పరమ శాంతిని పొందుతాడు. బ్రహ్మజ్ఞానం పొందిన వాడి మనసు, ప్రపంచ విషయాల మీదకు మరలా మళ్లదు. జీవితం చివరి ఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.