మూకపంచశతీ మందస్మిత శతకం 11-20 శ్లోకాలకు తెలుగులో అర్థం

మూకపంచశతీ – మందస్మిత శతకం 11-20 శ్లోకాలు

మూకపంచశతీ మందస్మిత శతకం శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య మందహాస మహిమను వర్ణించే అపూర్వమైన స్తోత్రరత్నం. మహాకవి మూకకవి రచించిన ఈ శతకంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణ, సౌందర్యం, అనుగ్రహాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో అర్థం మరియు భావాన్ని తెలుసుకుందాం.

వక్త్రశ్రీసరసీజలే తరలితభ్రూవల్లికల్లోలితే
కాలిమ్నా దధతీ కటాక్షజనుషా మాధువ్రతీం వ్యాపృతిమ్ ।
నిర్నిద్రామలపుండరీకకుహనాపాండిత్యమాబిభ్రతీ
కామాక్ష్యాః స్మితచాతురీ మమ మనః కాతర్యమున్మూలయేత్ ॥11॥
మాతా! కామాక్షీ! నీ చిరునవ్వులు మాలో అపారమైన ధైర్యమును కలిగిస్తాయి. నీ ముఖము ఒక సరోవరమైతే, కనుబొమలు దానిలో తీగలు. నీ కనుచూపులు తెల్ల తామరల వలె ఉండగా, క్రీగంటి చూపులు తుమ్మెదల చంచలత్వమును సూచిస్తున్నాయి.

నిత్యం బాధితబంధుజీవమధరం మైత్రీజుషం పల్లవైః
శుద్ధస్య ద్విజమండలస్య చ తిరస్కర్తారమప్యాశ్రితా ।
యా వైమల్యవతీ సదైవ నమతాం చేతః పునీతేతరాం
కామాక్ష్యా హృదయం ప్రసాదయతు మే సా మందహాసప్రభా ॥12॥
మాతా! నీ పెదవులు మంకెన పూల కాంతిని ధిక్కరిస్తున్నాయి. అవి లేత చిగురుటాకుల ఎర్రదనమును పోలి ఉన్నాయి. ఎరుపు వర్ణము కలిగిన పెదవుల వెనుక తెల్లని పలువరుస శోభిస్తున్నది. ఆ పలువరుస మీదుగా ఎర్రని పెదవులపై నెలకొన్న నీ చిరునవ్వులు మా మనసులో శాశ్వతంగా నిలచిపోవుగాక.

ద్రుహ్యంతీ తమసే ముహుః కుముదినీసాహాయ్యమాబిభ్రతీ
యాంతీ చంద్రకిశోరశేఖరవపుఃసౌధాంగణే ప్రేంఖణమ్ ।
జ్ఞానాంభోనిధివీచికాం సుమనసాం కూలంకషాం కుర్వతీ
కామాక్ష్యాః స్మితకౌముదీ హరతు మే సంసారతాపోదయమ్ ॥13॥
మాతా! వెన్నెల కాంతివంటి నీ చిరునవ్వులు మా హృదయములోని తమోగుణమనే చీకటిని తొలగింపచేస్తాయి. ఆ నవ్వులు ఈశ్వరుడనే ఇంటి ఆవరణలో పరుగెత్తుతూ ఆడుకుంటున్నాయి. మునీశ్వరుల జ్ఞానమనే సముద్రములో ఆ నవ్వులే తరంగములు. అటువంటి నీ చిరునవ్వులు మా సాంసారిక బాధలను తొలగించుగాక.

కాశ్మీరద్రవధాతుకర్దమరుచా కల్మాషతాం బిభ్రతీ
హంసౌధైరివ కుర్వతీ పరిచితిం హారీకృతైర్మౌక్తికైః ।
వక్షోజన్మతుషారశైలకటకే సంచారమాతన్వతీ
కామాక్ష్యా మృదులస్మితద్యుతిమయీ భాగీరథీ భాసతే ॥14॥
అమ్మా! కామాక్షీ! గంగానది వలె సుకుమారమైన, ప్రకాశవంతమైన, అనురాగమును కురిపించే నీ నవ్వులను తిలకించడానికి మహా జ్ఞానులు సైతం తాపత్రయపడతారు. మునీశ్వరులనే నీ హారముగా ధరించి, ఆ హారములపై ప్రకాశించే నీ చిరునవ్వులు మమ్ములను కాపాడుగాక.

కంబోర్వంశపరంపరా ఇవ కృపాసంతానవల్లీభువః
సంఫుల్లస్తబకా ఇవ ప్రసృమరా మూర్తాః ప్రసాదా ఇవ ।
వాక్పీయూషకణా ఇవ త్రిపథగాపర్యాయభేదా ఇవ
భ్రాజంతే తవ మందహాసకిరణాః కాంచీపురీనాయికే ॥15॥
కాంచీ పురాధీశ్వరీ! శంఖము వలె తెల్లనై, కరుణ అనే కల్పవృక్షమునకు పూసిన తెల్లని పుష్పములై, దయా స్వరూపములై, అమృతము వంటి పలుకులైన నీ చిరునవ్వుల కాంతులను మాపై నిరంతరము ప్రకాశింప చేయుము.

వక్షోజే ఘనసారపత్రరచనాభంగీసపత్నాయితా
కంఠే మౌక్తికహారయష్టికిరణవ్యాపారముద్రాయితా ।
ఓష్ఠశ్రీనికురుంబపల్లవపుటే ప్రేంఖత్ప్రసూనాయితా
కామాక్షి స్ఫురతాం మదీయహృదయే త్వన్మందహాసప్రభా ॥16॥
జగదీశ్వరీ! నీ చిరునవ్వుల ప్రకాశము, నీ వక్షస్థలము పై అలమబడిన పచ్చ కర్పూరముతో పోటీపడుతూ, నీ మెడలో ఏనుగు దంతములచే కూర్చబడిన హారముల కంటే మిన్నగా, పెదవులు అనే చిగురుల గుంపులలో వికసించిన పుష్పములలాగా ఉన్నాయి. ఆ మందస్మిత వదనము నా మనసులో ప్రకాశించుగాక.

యేషాం బిందురివోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణిః
యేషాం దీన ఇవాధికంఠమయతే హారః కరాలంబనమ్ ।
యేషాం బంధురివోష్ఠయోరరుణిమా ధత్తే స్వయం రంజనం
కామాక్ష్యాః ప్రభవంతు తే మమ శివోల్లాసాయ హాసాంకురాః ॥17॥
అమ్మా! నీ పెదవులపై చిరునవ్వులు, ఆపైన నాసికకు ఉన్న ముక్కెర, నీ కంఠహారముల కాంతులు, నీ కరకంకణముల ప్రకాశము అపరిమితంగా శోభిస్తూ, అవి మాకు అపరిమితమైన శుభములను, ఆనందమును కలుగచేయుగాక.

యా జాడ్యాంబునిధిం క్షిణోతి భజతాం వైరాయతే కైరవైః
నిత్యం యాం నియమేన యా చ యతతే కర్తుం త్రిణేత్రోత్సవమ్ ।
బింబం చాంద్రమసం చ వంచయతి యా గర్వేణ సా తాదృశీ
కామాక్షి స్మితమంజరీ తవ కథం జ్యోత్స్నేత్యసౌ కీర్త్యతే ॥18॥
మాతా! కామాక్షీ! నీ చిరునవ్వులు అనే పుష్పగుచ్చములు మాలోని అజ్ఞానము, అలసత్వము అనే మహా సముద్రమును ఇంకింపచేసి, కలువ పుష్పములతో నిత్యం కలహిస్తూ, ఈశ్వరునికి అమిత సంతోషమును కలిగిస్తున్నాయి. చంద్రబింబమును సైతం అదృశ్యం చేయగల నీ నవ్వులు కేవలం వెన్నెల వలే ఉన్నాయని చెప్పడము సమంజసము కాదు.

ఆరుఢా రభసాత్పురః పురరిపోరాశ్లేషణోపక్రమే
యా తే మాతరుపైతి దివ్యతటినీశంకాకరీ తత్క్షణమ్ ।
ఓష్ఠౌ వేపయతి భ్రువౌ కుటిలయత్యానమ్రయత్యాననం
తాం వందే మృదుహాసపూరసుషమామేకామ్రనాథప్రియే ॥19॥
అమ్మా ఏకామ్రనాధేశ్వరుని దేవేరీ! ఈశ్వరుని కౌగిలిలో చేరాలనే తపనతో నీ చిరునవ్వులు అనే నది వేగముగా ప్రవహిస్తున్నది. నీ పెదవులను కదిలిస్తూ, కనుబొమలను త్రిప్పుతూ, ఎంతో శోభస్కరముగా ఉన్న నీ మృదువైన చిరునవ్వులకు నమస్కరిస్తున్నాను.

వక్త్రేందోస్తవ చంద్రికా స్మితతతిర్వల్గు స్ఫురంతీ సతాం
స్యాచ్చేద్యుక్తిమిదం చకోరమనసాం కామాక్షి కౌతూహలమ్ ।
ఏతచ్చిత్రమహర్నిశం యదధికామేషా రుచిం గాహతే
బింబోష్ఠద్యుమణిప్రభాస్వపి చ యద్బిబ్బోకమాలంబతే ॥20॥
మాతా! నీ ముఖము చంద్రబింబమైతే, ఆ శశాంకుని వెన్నెల కాంతులు చకోర పక్షులకు ఆహ్లాదమును కలుగచేస్తున్నాయి. కానీ అమ్మా! దొండపండువంటి ఎర్రని సూర్యకాంతిని పోలిన నీ పెదవులపై ఉండే నవ్వులు కూడా చకోర పక్షులను సంతోషింపచేయటం మాత్రం చాలా విచిత్రము.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top