శివానందలహరి తెలుగులో అర్థం 71-80 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
ఆరూఢభక్తి గుణకుంచిత భావచాప-
-యుక్తైః శివస్మరణ బాణ గణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిష రిపూన్విజయీ సుధీంద్రః
సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీమ్ ॥ 71 ॥
బుద్ధిమంతుడు భక్తిని వింటినారిగా, అంతఃకరణవృత్తిని విల్లుగా అమర్చుకొని, అందు ఈశ్వరధ్యానమను బాణమును ఎక్కుపెట్టి, పాపములు అను శత్రువులను జయించి, రాజు – రాజ్యలక్ష్మిని పొందునట్లు, పరమేశ్వర సారూప్యలక్ష్మిని పొందును.
ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్త్వా మహా బలిభిరీశ్వర నామమంత్రైః ।
దివ్యాశ్రితం భుజగ భూషణముద్వహంతి
యే పాద పద్మమిహ తే శివ తే కృతార్థాః ॥ 72 ॥
శివా! నిధులు వెతుకువాడు కన్నులకు అంజనము పూసుకొని కనిపెట్టి ఆనందించునట్లు – భక్తుడు ధ్యానాంజనముతో మీ పాదపద్మనిధిని కనుగొని, మీ నామమంత్రముతో మహాబలియొనర్చి, అలముకున్న అజ్ఞానము తొలగించి, మిమ్ముగొల్చి కృతార్థుడగును.
భూ దారతాం ఉదవహద్ యదపేక్షయా శ్రీ-
-భూదార ఏవ కిమతః సుమతే లభస్వ ।
కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం
పాదారవింద భజనం పరమేశ్వరస్య ॥ 73 ॥
ఓ సుబుద్ధి! మహావిష్ణువు సైతం శివుని పాదసందర్శనమునకై వరాహ రూపమెత్తి పలుశ్రమలకు ఓర్చినాడు. నీవు కూడా అట్టి శివపాద భజన చేయుము. పంటనేలయందు ఓషధులు ఫలించునట్లు, దానివలన సమస్త ముక్తులు లభించును.
ఆశాపాశ క్లేశ దుర్వాసనాది-
-భేదోద్యుక్తైర్ దివ్యగంధైరమందైః ।
ఆశా శాటీకస్య పాదారవిందం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ॥ 74 ॥
దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాదపద్మము నా మనఃపేటికయందు గల ఆశాపాశములు, పంచక్లేశములు మొదలగు దుర్వాసనలను అణచి, దివ్యమైన సువాసనలతో నింపుగాక!
కళ్యాణినం సరస చిత్ర గతిం సవేగం
సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్ ।
చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ॥ 75 ॥
ఓ వృషభవాహనా! బాణవేగమున పోవుచూ, చిత్రగతులు గలిగి, కల్యాణియై, ద్రువలక్షణములు కలిగి వర్తించు నా మనస్సను గుర్రమునెక్కి హాయిగా స్వారీ చేయుము.
భక్తిర్మహేశ పద పుష్కరమావసంతీ
కాదంబినీవ కురుతే పరితోషవర్షమ్ ।
సంపూరితో భవతి యస్య మనస్తటాకః
తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్ ॥ 76 ॥
భక్తి – మేఘమాలిక వలె మహాదేవుని పాదపద్మమను గగనమునందు వ్యాపించినదై ఆనందవర్షము కురియును. అట్టి ఆ వర్షమునకు ఏ పురుషుని మానస సరోవరమంతయు నిండునో వాని జన్మమను సస్యము సఫలమైనది అగును.
బుద్ధిః స్థిరా భవితుమీశ్వర పాదపద్మ-
-సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ ।
సద్భావనాస్మరణ దర్శన కీర్తనాది
సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే ॥ 77 ॥
శివా! నాబుద్ధి భర్తృవియోగమును పొందిన భార్యవలె నిరంతరము ధ్యానముచేయుచూ, శివమంత్రము జపించుచూ మోహమునొందినదై- మీ పాద ధ్యాన, స్మరణ, సందర్శన, కీర్తన, పూజనాదులను గూర్చి విచారించుచున్నది. దీనిని ఉద్ధరింపుము.
సదుపచార విధిష్వను బోధితాం
సవినయాం సుహృదం సముపాశ్రితామ్ ।
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢ వధూమివ ॥ 78 ॥
జగత్రభూ! మీపాదపూజయందు సుశిక్షితమై, వినయముతో కూడిన నా బుద్ధికి – ఉపచారము చేయుటయందు సుశిక్షితురాలు, వినయవంతురాలు అగు, కొత్తగా పెండ్లి చేసికొన్న భార్యను వలె ఉపదేశించి ఉద్ధరింపుము.
నిత్యం యోగిమనః సరోజ దళ సంచార క్షమస్త్వత్ క్రమః
శంభో తేన కథం కఠోర యమ రాడ్వక్షః కవాటక్షతిః ।
అత్యంతం మృదులం త్వదంఘ్రి యుగళం హా మే మనశ్చింతయత్
ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే ॥ 79 ॥
చంద్రశేఖరా! మునీశ్వరుల మనఃపద్మములందు సంచరింపదగిన మీ మృదుపాదములతో, కఠోరమైన ఆ యముని రొమ్ము ఎట్లు తన్నితివి? అయ్యో! నా మనస్సునకు మిక్కిలి విచారము కలుగుచున్నది. నీ పాదములు నా కన్నులకగుపడునట్లు చేయుము. నా చేతులతో మీ పాదములొత్తి సేవ చేసెదను.
ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి మ-
-ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః ।
నో చేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ॥ 80 ॥
శివా! నీవు నన్ను గురించి “ఈ పురుషుడు భూమిలో పుట్టబోవును. వీని మనస్సు మిక్కిలి కఠినముగానుండును. అప్పుడు నాకు దానియందు సంచరింపవలసి వచ్చును” అని ఆలోచించి నా రక్షణకై నేను పుట్టక పూర్వమే కఠినమైన కొండల మీద నీ కోమల పాదములతో నడచుటకు అలవాటు చేసుకొంటివి. కానిచో మేడలు మిద్దెలు పూలపాన్సులు, మంచిమంచి అరుగులు ఉండగా నీకేల ఈ రాళ్ళమీద నాట్యము చేయవలసివచ్చినది?
🙏 శివానందలహరి – తెలుగులో అర్థం
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









