శివానందలహరి తెలుగులో అర్థం 91-100 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
ఆద్యావిద్యా హృద్గతా నిర్గతాసీత్
విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌళే ॥ 91 ॥
చంద్రశేఖరా! నీ దయవలన నా అజ్ఞానము తొలగిపోయి, సుజ్ఞానము కలిగినది. శ్రీకరము, మోక్ష్మప్రదము అగు నీ పాదయుగ్మమును సేవించెదను.
దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి ।
సారం త్వదీయ చరితం నితరాం పిబంతం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః ॥ 92 ॥
గౌరీనాథా ! నుదుటవ్రాసిన బ్రహ్మవ్రాతకు సూచకములగు సమస్త దుఃఖములు నీ కటాక్షము వలన పోయినవి. నీ సార చరిత్రములనే విను నన్ను ఈ జన్మము నుండి తరింపజేయుము.
సోమ కళాధర మౌళౌ
కోమల ఘన కంధరే మహామహసి ।
స్వామిని గిరిజానాథే
మామక హృదయం నిరంతరం రమతామ్ ॥ 93 ॥
పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగుచున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తమెప్పుడూ విహరించు గాక!
సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి ॥ 94 ॥
సదా ఈశ్వర నామము ఉచ్చరించు నాలుకయే నాలుక. ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు. ఈశ్వరుని పూజించు చేతులే చేతులు. ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు. అతడే ధన్యుడు.
అతిమృదులౌ మమ చరణా-
-వతికఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా ప్రవేశః ॥ 95 ॥
భూతనాథా ! “ఈ భక్తుని మనస్సు అతి కఠినము, కోమలమైన నా పాదములతో దానియందు సంచరించుట ఎట్లు? అని సంశయమక్కరలేదు. ఎంతో కఠోరముగానుండు పర్వతముమీద గౌరీసమేతులై మీరు సంచరించుటలేదా?
ధైర్యాంకుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృంఖలయా ।
పురహర చరణాలానే
హృదయమదేభం బధాన చిద్యంత్రైః ॥ 96 ॥
నా మనస్సను మదపుటేనుగును ధైర్యాంకుశమున ఒంచి, నీ పాదమను కట్టుకంబమునందు భక్తియను గొలుసుతో గట్టిగా కట్టివేయుము.
ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనః కరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్వా
పరమ స్థాణు పదం దృఢం నయాముమ్ ॥ 97 ॥
శంకరా ! నా మనస్సను మదగజము పట్టుటకు వీలులేక పలువంకల పరుగులెత్తుచున్నది. దీనిని భక్తియను త్రాటితో కట్టి, స్థిరమైన బ్రహ్మపదమున చేర్చుము.
సర్వాలంకార యుక్తాం సరళ పదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిః సంస్తూయ మానాం సరస గుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థ రేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ॥ 98 ॥
దేవా! నా కవితాకన్య- కన్యకా లక్షణము కలిగి కళ్యాణమునకు తగియున్నది. సర్వాలంకారములు, సరళపదములు, సాధువృత్తము, సువర్ణము, సరసగుణములు, వేవేల సర్వలక్షణములు గలిగి ప్రకాశించుచున్న నా కవితాకన్యను పరిగ్రహింపుము.
ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్కథయ మమ వేద్యోఽసి పురతః ॥ 99 ॥
మీ పాద దర్శనమునకై వరాహరూపము దాల్చి శ్రీహరి, శిరోదర్శనమునకై హంసరూపము దాల్చి బ్రహ్మ, భూమి, అంతరిక్షములందు అంతటా తిరిగి, ఫలమును పొందలేకపోయిరి. ఇప్పుడు నా ఎదుట ప్రసన్నులై, నాకెట్లు తెలియగలరో సెలవిమ్ము.
స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః
స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానా తుషస్తోమవ-
-ద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః ॥ 100 ॥
దేవా! బ్రహ్మాదులగు ముప్పది మూడు కోట్ల దేవతలు- స్తోత్రార్హులను లెక్కించునప్పుడు నిన్ను మొట్టమొదటివానిగా లెక్కించుచున్నారు. సృష్టి, స్థితి, లయ రూపమైన మాహాత్యమును గురించి చర్చించునప్పుడు, ధాన్యపురాశి ఎగురబట్టునపుడు పొట్టు అంతా దూరముగా పోవునట్లు, తామందరూ దూరమైపోయి సారమైన ధాన్యమువలె నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు. ఇది వట్టి స్తుతిపాఠము గాదు. నేను చెప్పినదంతయూ నిజముగా ఇసుమంతయు అసత్యము కాదు.
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శివానందలహరీ ॥
🙏 శివానందలహరి – తెలుగులో అర్థం
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









