స్తోత్రాలకు తెలుగులో అర్థం » శివ స్తోత్రాలు » శివానందలహరి తెలుగులో అర్థం 81-90 శ్లోకాలు
శివానందలహరి 81-90 శ్లోకాల తెలుగులో అర్థం మరియు శివభక్తి సందేశం

శివానందలహరి తెలుగులో అర్థం 81-90 శ్లోకాలు

శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.

శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.

కంచిత్కాలముమా మహేశ భవతః పాదారవిందార్చనైః
కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।
కంచిత్కంచిద్ అవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ స ముక్తః ఖలు ॥ 81 ॥

ఉమానాథా! ఒకప్పుడు మీ పాదపూజలు, వేరొకప్పుడు మీ ధ్యానములు ఇంకొకప్పుడు మీ పాదవందనములు, మరొకప్పుడు మీ కథలు వినుట, కొన్నివేళల మీ దర్శనము చేయుచు సంతోషము నొందువాడు జీవన్ముక్తుడగును.

బాణత్వం వృషభత్వమర్ధ వపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్య తరః స ఏవ హి న చేత్కో వా తదన్యోఽధికః ॥ 82 ॥

ఓ పార్వతీశ్వరా ! త్రిపురసంహార కాలమందు విష్ణువు నీకు బాణమయ్యెను. వృషభరూపమై నీకు వాహనముగా ఉండెను. సగము శరీరముతో నీ అర్థాంగియై భార్య అయ్యేను. నీ పాద సందర్శనకై వరాహరూపమెత్తెను. జగన్మోహినీ రూపమున నీ సాన్నిధ్యము పొందెను. నీ తాండవ సమయమున మద్దెల వాయించెను. తన నేత్రమును నీ పాదములకు అర్పించెను. మీ అనుగ్రహమునకు పాత్రుడై మీ దేహమునందు భాగము కలవాడు కాబట్టియే కదా బ్రహ్మాదులందరికంటె పూజ్యతరుడయ్యెను. కానిచో అంతటి వాడు ఇంకెవ్వడైనా కలడా ? (కనుక బ్రహ్మాదులు పూజ్యులు, విష్ణువు పూజ్యతరుడు, నీవు పూజ్యతముడవు అని భావము).

జనన మృతి యుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృత రూపం సాంబమీశం భజంతే
య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే ॥ 83 ॥

ఇతర దేవతలందరూ జనన మరణములు గలవారు. అట్టివారిని సేవించువారికి విషయానందమైనను తృప్తి కలుగదు. “జనన మరణములు లేని పార్వతీ సమేత పరమేశ్వరుని- శరీరవంతులై ఉండగానే సేవించువారు కృతార్థులై మోక్షానందమును పొందుదురు.

శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకల భువన బంధో సచ్చిదానంద సింధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ॥ 84 ॥

శివా! సమస్త సద్గుణములు కల నా బుద్ధి అనే కన్యను నీకిత్తును. అది గౌరిని కూడి, నీకు నిరంతరము సత్సపర్యలు చేయగలదు. నా హృదయసీమ యందు గృహస్థుడవై సుఖముగా నివసింపుము.

జలధిమథన దక్షో నైవ పాతాళభేదీ
న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశన కుసుమ భూషావస్త్ర ముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీందు మౌళే ॥ 85 ॥

చంద్రశేఖరా! నీకిష్టమైన కాలకూటాహారముగాని, పుష్పమువలె శిరోభూషణముగా చంద్రునిగాని యిచ్చుటకు, నేను సముద్రమును మధింపగల వాడనుకాను. నీకిష్టమైన భుజగభూషణము కల్పించుటకు పాతాళమును భేదింపలేను. గజచర్మ వస్త్రమిచ్చుటకు అడవులలో వేటాడు బోయను కాలేను. ఇంక నిన్నెట్లు పూజింపగలను?

పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమంఘ్రి పల్లవం ఉమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥

పార్వతీ వల్లభా ! పూజాద్రవ్యములు విశేషముగా ఉన్నా కూడా నిన్ను పూజించుట ఎట్లు? నీ శిరస్సు తెలియదు. నీ పాదములు తెలియవు. హంస, వరాహ రూపములు ధరించి నిన్ను తెలిసికొన యత్నించిన బ్రహ్మ, విష్ణువులే తెలిసికొనలేకపోయిరి గదా !

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి ॥ 87 ॥

నీలకంఠా ! నీవు భుజించునది విషము. అలంకరించుకొనునది పాము. కట్టుబట్ట ఏనుగు తోలు. వాహనము ఎద్దు. నీవేమి నాకు ఇచ్చెదవు? నీ పాదభక్తి ఒక్కటే చాలు, అది ఇమ్ము.

యదా కృతాంభో నిధి సేతుబంధనః
కరస్థ లాధః కృత పర్వతాధిపః ।
భవాని తే లంఘిత పద్మసంభవ-
-స్తదా శివార్చా స్తవ భావన క్షమః ॥ 88 ॥

శివా ! నేను ఎప్పుడు సముద్రమునకు వంతెన కట్టిన శ్రీరాముడను, అరచేతితో వింధ్యపర్వతమును నేలకూల్చిన అగస్యుడను, బ్రహ్మదేవుని కన్న ఎక్కువవాడను అగుదునో, అప్పుడు నీ పూజా, స్తోత్ర, ధ్యానములు చేయుటకు సమర్థుడను అగుదును.

నతిభిర్ నుతిభిర్ స్త్వమీశ పూజా-
-విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥

ఈశ్వరా! నమస్కారములు, స్తోత్రములు, పూజలు, ధ్యానములు, సమాధులు మొదలగు వానితో తృప్తిపడక, వింటి దెబ్బలు, రోకటిపోట్లు, రాళ్ళు రువ్వుట మొదలగువానితో పరమప్రీతినొందితివని పురాణగాధలు (కిరాతార్జునీయం) వింటిని. ఇందు నీకేది ప్రియమో చెప్పుము. ఆ విధముగానే చేసెదను.

వచసా చరితం వదామి శంభోః
అహముద్యోగ విధాసు తేఽప్రసక్తః ।
మనసాకృతిం ఈశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥

శివా ! ఉత్తమ శివయోగముల పరిచయము లేదు. మనస్సు స్థిరముగా నిలువదు. కనుక వాక్కుతో మీ చరిత్రలు పలుకుచూ, మనస్సున మీ ఆకృతి ధ్యానించుచూ, శిరస్సుతో మీ పాదపద్మములకు నమస్మరించుచూ, శక్తివంచన లేక సేవించెదను.

🙏 శివానందలహరితెలుగులో అర్థం

శివానందలహరి 1-10 శ్లోకాలు

శివానందలహరి 11-20 శ్లోకాలు

శివానందలహరి 21-30 శ్లోకాలు

శివానందలహరి 31-40 శ్లోకాలు

శివానందలహరి 41-50 శ్లోకాలు

శివానందలహరి 51-60 శ్లోకాలు

శివానందలహరి 61-70 శ్లోకాలు

శివానందలహరి 71-80 శ్లోకాలు

శివానందలహరి 81-90 శ్లోకాలు

శివానందలహరి 91-100 శ్లోకాలు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మనభారతీయ సంస్కృతిYouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top