శ్రావణ మాస మహాత్మ్యం – మూడవ అధ్యాయం
పరమశివుడు చెప్పిన అద్భుతమైన మాటలు విన్న సనత్కుమారుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అయినా సరే, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపనతో శివుణ్ణి ఇలా అడిగాడు: “స్వామీ! మీరు శ్రావణ మాసంలో చేయాల్సిన వ్రతాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. కానీ, నా మనసుకు ఇంకా పూర్తి తృప్తి కలగలేదు. నేను ఏ వ్రతం చేస్తే జీవితం తరిస్తుందో, దయచేసి ఆ వ్రతం గురించి నాకు ఇంకా వివరంగా చెప్పండి దేవా!” అని ప్రార్థించాడు.
సనత్కుమారుడి భక్తికి మురిసిపోయిన కైలాసనాథుడు, ఎంతో ఆప్యాయంగా ఆ రహస్యాలను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు:
“ఓ మునీశ్వరా! ఎవరైతే ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటూ ‘నక్త వ్రతం‘ (పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ మాత్రమే భోజనం చేయడం) ఆచరిస్తారో… వాళ్లు ఏకంగా పన్నెండు నెలల పాటు వ్రతం చేసిన గొప్ప ఫలాన్ని పొందుతారు. సూర్యాస్తమయం అవ్వకముందే తినడాన్ని ‘నక్త భోజనం’ అంటారు, దాన్నే రాత్రి భోజనం అని కూడా అంటారు.
అయితే ఇక్కడో ముఖ్యమైన నియమం ఉంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఉండే మూడు ఘడియల కాలాన్ని ‘సంధ్యాకాలం’ అంటారు. ఆ తర్వాత భోజనం చేయడమే గృహస్థులకు సరైన సమయం. ఈ సంధ్యాకాలంలో భోజనం చేయడం, నిద్రపోవడం, సంభోగించడం, వేదాలు చదవడం లాంటి నాలుగు పనులను అస్సలు చేయకూడదు.
గృహస్థులకు, సన్యాసులకు ఈ నక్త వ్రతంలో ఒక చిన్న తేడా ఉంది, శ్రద్ధగా విను. సూర్యుడు పడమటి వైపు వెళ్తున్నప్పుడు, మనిషి నీడ తన ఎత్తు కంటే రెట్టింపుగా పడే సమయాన్ని సన్యాసులకు (యతీశ్వరులకు) నక్త కాలం అంటారు. కాబట్టి వాళ్ళు సూర్యుడు అస్తమించకముందే భోజనం చేయాలి, వాళ్లకు రాత్రి భోజనం నిషిద్ధం. అదే గృహస్థులకు అయితే ఆకాశంలో నక్షత్రాలు బయటికి వచ్చాక తినడమే మంచి సమయం. సన్యాసులు, విధవలు, భార్యను కోల్పోయిన వాళ్ళు సూర్యుడు అస్తమించకముందే తినేయాలి. భార్య లేకపోయినా పిల్లలు ఉన్నవాళ్లు మాత్రం గృహస్థులతో సమానమే కాబట్టి వాళ్ళు రాత్రిపూట తినొచ్చు. ఈ విధంగా తమ అర్హతను బట్టి నక్త వ్రతం చేసేవాళ్లు అత్యంత ఉత్తమమైన లోకాలను చేరుకుంటారు.

నక్త వ్రతం చేసేవాళ్ళు శ్రావణ శుద్ధ పాడ్యమి రోజున ఉదయాన్నే లేచి నా ముందు నిలబడి ఇలా సంకల్పం చేసుకోవాలి: ‘స్వామీ! ఈ శ్రావణ మాసం ముప్పై రోజుల పాటూ ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, బ్రహ్మచర్యం పాటిస్తూ, రాత్రులే భోజనం చేస్తూ, నేల మీదే పడుకుంటూ, ప్రాణుల మీద దయ చూపిస్తూ ఈ నక్త వ్రతం చేస్తున్నాను. ఒకవేళ ఇది పూర్తి కాకముందే నేను ప్రాణాలు విడిస్తే, నా భక్తిని చూసి మీ దయవల్ల ఈ వ్రతం పూర్తయినట్టుగానే నన్ను అనుగ్రహించండి తండ్రీ!’ అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసి ఆ నెలంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తే… వాళ్ళు నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు అవుతారు.
తానే స్వయంగా కానీ, లేదా బ్రాహ్మణుల ద్వారా కానీ రుద్రం, మహారుద్రం లాంటి మంత్రాలతో నాకు అభిషేకం చేయించాలి. నెల రోజుల పాటూ తనకు బాగా ఇష్టమైన వస్తువును నాకోసం వదిలేస్తున్నానని సంకల్పించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి. దాన్ని మళ్ళీ తాను అస్సలు తినకూడదు. అలా తనకు ఎంతో ఇష్టమైన వస్తువును నాకు అర్పించి వదిలేస్తే, దానికి లక్ష రెట్ల ఫలాన్ని వాళ్ళు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ పొందుతారు. కోరికతో చేస్తే ఆ కోరిక తీరుతుంది, నిష్కామంగా చేస్తే ఏకంగా మోక్షమే వస్తుంది! నా మంత్రంలోని అక్షరాల సంఖ్య ప్రకారం అభిషేకం చేసినవాళ్లు… ఒక్కో అక్షరానికి కోటి సంవత్సరాల పాటు కైలాసంలో నా వెంటే ఉంటారు. ఇక పంచామృతాలతో అభిషేకం చేస్తే జన్మరాహిత్యం వస్తుంది” అని పరమశివుడు ఇంకా ఇలా చెప్పాడు.
సనత్కుమారా! కోరిన కోర్కెలు తీర్చే లక్షపత్రి పూజా విధానం గురించి చెబుతాను విను.
- సంపదలు కావాలనుకునే వాళ్ళు – మారేడు దళాలతో
- శాంతి కోరుకునే వాళ్ళు – గరికతో
- ఆయుష్షు కావాలనుకునే వాళ్ళు – సంపంగి పూలతో
- చదువు కావాలనుకునేవాళ్ళు – మల్లెలు, సన్నజాజులతో పూజ చేయాలి.
- శివకేశవుల అనుగ్రహం కోసం – తులసి దళాలతో
- పిల్లల కోసం – వాకుడు పూలతో
- పీడ కలలు రాకుండా ఉండటానికి – ధాన్యాలతో నన్ను పూజించాలి.
నా ముందు శంఖం, చక్రం, పద్మం లాంటి ముగ్గులు వేసి అలంకరించి, కోరికలన్నీ తీరడం కోసం అన్నిరకాల పూలతో లక్షపత్రి పూజ చేస్తే నేను సంతోషించి వారు కోరిన కోరికలన్నీ తీరుస్తాను.
పూజ పూర్తయ్యాక దానికి ఉద్యాపన చేయాలి. ఒక మండపాన్ని, దానికంటే మూడు రెట్లు పెద్దదైన అరుగును ఏర్పాటు చేయాలి. ఆచార్యుడిని పిలిపించి, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య మండపంలోకి వెళ్లి రాత్రంతా జాగరణ చేయాలి. ఆ మండపంలో ఒక శుభప్రదమైన లింగాకారాన్ని పెట్టి కైలాసం లాగా అలంకరించాలి. అక్కడ బంగారంతో చేసిన శివుడి ప్రతిమను పెట్టి పంచామృతాలతో అభిషేకం చేసి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.
తెల్లవారాక ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధుడై, ఆ మండపంలో హోమం ఏర్పాటు చేసుకోవాలి. గాయత్రీ మంత్రం, శివ సహస్రనామాలు చదువుతూ నెయ్యి, నువ్వులు, పాయసంతో హోమం చేసి పూర్ణాహుతి సమర్పించాలి. ఈ లక్ష పూజ చేసిన వాళ్ళంతా ఆ బంగారు శివుడి ప్రతిమను పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఒకవేళ దీపారాధన చేస్తే… వెండి ప్రమిదలో బంగారు వత్తి పెట్టి ఆవు నెయ్యి పోసి దానం ఇస్తే అన్ని కోరికలూ నెరవేరుతాయి. వంద మంది బ్రాహ్మణులకు అన్నదానం పెడితే నేను వారిని కచ్చితంగా కరుణిస్తాను.
భూమి శయనం మరియు మౌన వ్రతం ఫలాలు: ఈ నెల రోజులూ నేల మీద పడుకునే వాళ్ళు వచ్చే జన్మలో నవరత్నాలతో చేసిన మంచి మంచాన్ని, రత్న దీపాలు ఉండే అద్భుతమైన పడకగదిని పొందుతారు. అలాగే ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే మంచి తేజస్సు, గొప్ప దేహబలం లభిస్తాయి. చివరకు సందేహం లేకుండా మోక్షం వస్తుంది.
ఇక పగలు కానీ, రాత్రి కానీ, కనీసం భోజనం చేసేటప్పుడు కానీ మౌన వ్రతం పాటించే వాళ్ళు.. స్వర్గలోకంలో అద్భుతమైన సుఖాలు అనుభవించి, మళ్ళీ ఈ భూమి మీద గొప్ప సత్యవంతులుగా పుడతారు. వ్రతం పూర్తయ్యాక గంటను కానీ, పుస్తకాన్ని కానీ దానమిస్తే… సమస్త శాస్త్రాలు నేర్చుకున్నవాడై, బృహస్పతి అంతటి బుద్ధిమంతుడు అవుతాడు. మౌనంగా ఉంటే మనసులో ఏ గొడవలు రావు కాబట్టి మౌన వ్రతం అనేది ఎంతో గొప్పది నాయనా!” అని పరమశివుడు వివరించాడు.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.








