శ్రావణ మాస మహాత్మ్యం – పదవ అధ్యాయం
పరమశివుడు సనత్కుమారునితో శ్రావణ మాసంలో శనివారం నాడు చేయాల్సిన వ్రత విధానాలను ఇలా వివరించసాగాడు:
“ఓ సనత్కుమారా! ఇప్పుడు శనివారం నాడు చేయాల్సిన వ్రత విధానాన్ని చెబుతాను విను. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషిలోని మందబుద్ధి పూర్తిగా పోయి, ఎంతో చురుకుగా తయారవుతాడు. నాయనా, శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో నరసింహ స్వామిని, శనీశ్వరుడిని, ఆంజనేయ స్వామిని పూజించాలి.
1. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజ: ముందుగా నరసింహ స్వామి పూజ గురించి చెబుతాను. విను. గోడ మీద కానీ, స్తంభం మీద కానీ పసుపు కలిపిన మంచి గంధంతో లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి బొమ్మను గీయాలి. ఎర్రటి పూలు, నీలం (లేదా నల్లటి) పూలతో ఆ స్వామిని పూజించాలి. కజ్జికాయలు, పెసరపప్పుతో చేసిన కిచిడీ, పాయసం, అలాగే గారెలు-అన్నం కలిపి నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని మాత్రమే తానూ భుజించి, బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేయాలి.
శనివారం నాడు ఏ పని చేసినా దానికి ‘నూనె‘ వాడటం చాలా శ్రేష్ఠం. నరసింహ స్వామికి నూనెతోనూ, నెయ్యితోనూ అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ శనివారం నాడు బ్రాహ్మణులకు, ముత్తైదువులకు నూనెతో తలంటి స్నానం చేయించాలి. కుటుంబ సమేతంగా తాను కూడా నూనెతో తలంటి స్నానం చేయాలి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు ఈ వ్రతం చేస్తే… వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ధనధాన్యాలకు లోటుండదు, పిల్లలు లేనివాళ్లకు సంతానం కలుగుతుంది. నరసింహ స్వామి దయ వల్ల వాళ్ళ కీర్తి పది దిక్కులా వ్యాపిస్తుంది.
2. శనీశ్వర వ్రతం: ఇదే విధంగా శనీశ్వరుడికి ప్రీతి కలగడానికి చేయాల్సిన వ్రతం గురించి చెబుతాను విను. ఒక కుంటి బ్రాహ్మణుడిని (కుంటివాడు దొరకకపోతే ఏ ఇతర బ్రాహ్మణుడిని అయినా సరే) ఇంటికి తీసుకురావాలి. అతనికి నువ్వుల నూనెతో తలంటి, వేడి నీళ్లతో స్నానం చేయించాలి. ఎంతో శ్రద్ధతో, నరసింహ స్వామి వ్రతానికి వండిన పదార్థాలనే అతనికి కూడా భోజనంగా వడ్డించాలి. శనీశ్వరుడు నా మీద దయతో ఉండాలని కోరుకుంటూ.. ఆ బ్రాహ్మణుడికి నువ్వుల నూనె, ఇనుము, నువ్వులు, మినుములు, కంబళి దానంగా ఇవ్వాలి.

శనీశ్వరుడి పూజ కోసం ఇనుముతో చేసిన ప్రతిమను వాడటం ఎంతో శుభప్రదం. ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం చేసి, పూజలో నువ్వులను, మినుములను అక్షింతలుగా వాడాలి. ఆయనను ఆరాధించేటప్పుడు నల్లటి బట్టలు, నల్లటి ఆవును దానం ఇవ్వాలి.
ఎవరైతే ఇలా స్థిరమైన మనసుతో శనీశ్వరుడిని పూజిస్తారో, వాళ్లకు కలలో కూడా శని వల్ల భయం కలగదు. ఒకవేళ జన్మ రాశి నుంచి రెండు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పన్నెండు స్థానాల్లో శని ఉండి కష్టాలు పెడుతున్నా సరే… ఈ వ్రతం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.
3. ఆంజనేయ స్వామి పూజ: ఇక ఆ వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామికి సంతోషం కలిగించే పూజా విధానం గురించి చెబుతాను. శ్రావణ మాసం శనివారాల్లో ఆంజనేయుడికి రుద్ర మంత్రం చదువుతూ నూనెతో అభిషేకం చేయాలి. నూనెలో సింధూరం కలిపి స్వామికి పూయాలి. మందార పూలు, జిల్లేడు పూలు, దాసాని పూలతో పాటు గారెల దండను వేసి పదహారు ఉపచారాలతో పూజించాలి. ఆ తర్వాత స్వామి తాలూకు ఈ పన్నెండు నామాలను జపించాలి.
1. హనుమాన్, 2. ఆంజనీసూనుడు, 3. వాయుపుత్రుడు, 4. మహాబలుడు, 5. రామేష్టుడు, 6. ఫల్గుణసఖుడు, 7. పింగాక్షుడు, 8. అమితవిక్రముడు, 9. ఉదధిక్రమణుడు, 10. సీతాశోక వినాశకుడు, 11. లక్ష్మణ ప్రాణదాత, 12. దశగ్రీవ దర్పహరుడు.
ఈ పన్నెండు నామాలను ఉదయాన్నే చదివేవాళ్ళకు ఏ అశుభమూ జరగదు, సమస్త సంపదలు కలుగుతాయి. ఈ విధంగా పూజిస్తే, ఆ మనిషికి వజ్రం లాంటి గట్టి శరీరం వస్తుంది. ఎలాంటి రోగాలూ దరిచేరవు. శత్రువులు నాశనమైపోతారు. ఇక ఆంజనేయ స్వామి గుడిలో కూర్చుని లక్ష సార్లు ‘హనుమత్ కవచం‘ చదివిన వాడికి అష్ట సిద్ధులు వస్తాయి. వాణ్ణి చూడగానే రాక్షసులు, భేతాళులు, పిశాచాలు కూడా గజగజ వణుకుతూ పది దిక్కులకూ పారిపోతాయి.
రావి చెట్టు (అశ్వత్థ వృక్ష) పూజ: సనత్కుమారా! శనివారం నాడు రావి చెట్టును కౌగిలించుకుని పూజించడం చాలా మంచిది. మందబుద్ధితో బాధపడేవాళ్ళు ఈ రావి చెట్టును తప్పకుండా తాకాలి. శనివారం నాడు ఆ చెట్టును ఆలింగనం చేసుకుంటే అన్ని రకాల సంపదలు వృద్ధి చెందుతాయి. ఇలా ఏడు శనివారాలు రావి చెట్టుకు పూజ చేయాలి, అందులోనూ ఈ శ్రావణ మాసంలో చేయడం ఇంకా ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.” అని పరమశివుడు వివరించాడు.
📥 ఈ అధ్యాయానికి సంబంధించిన తెలుగు PDF
ఈ అధ్యాయానికి సంబంధించిన పూర్తి తెలుగు PDFను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా?
మా Bharatiya Samskruthi YouTube Channelలో చాలా తక్కువ మొత్తంతో Membershipలో చేరి, ఈ అధ్యాయంతో పాటు రాబోయే శ్రావణ మాస మహాత్మ్యం అన్ని అధ్యాయాల PDFలను,ఇతర స్తోత్రాల తెలుగు అర్థం pdf లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
🙏 ఈరోజే Memberగా చేరి అన్ని PDFలను పొందండి.
ఓం నమః శివాయ! 🕉️
శ్రావణ మాస మహాత్మ్యం
మొదటి అధ్యాయం: శ్రావణ మాస విశిష్టత
రెండవ అధ్యాయం: వ్రత నియమాలు, విశేషాలు
మూడవ అధ్యాయం: నక్త వ్రత పూజా విశేషాలు
నాలుగవ అధ్యాయం: విశేష వ్రతాలు, రుద్ర వర్తి వ్రత మహిమ
ఐదవ అధ్యాయం: కోటి లింగాల మహిమ, ఆదివార వ్రతం
ఆరవ అధ్యాయం: సోమవార వ్రత విశిష్టత
ఏడవ అధ్యాయం: మంగళగౌరీ వ్రత మహిమ, శ్రుతకీర్తి రాజు కథ
ఎనిమిదవ అధ్యాయం: బుధ, గురువార వ్రత విశిష్టత
తొమ్మిదవ అధ్యాయం: జీవంతికా దేవి వ్రత మహిమ
పదవ అధ్యాయం: శనివార వ్రత విశేషాలు
పదకొండవ అధ్యాయం: రోటక వ్రతం, ఔదుంబర వ్రత విశిష్టత
పన్నెండవ అధ్యాయం: స్వర్ణ గౌరీ వ్రత విశిష్టత
పదమూడవ అధ్యాయం: దూర్వా గణపతి వ్రత విశిష్టత
పదునాలుగవ అధ్యాయం: నాగ పంచమి వ్రత విశేషాలు
పదిహేనవ అధ్యాయం: సూపోదన వ్రతం, నాగ పంచమి విశేషాలు
పదహారవ అధ్యాయం: శీతలాష్టమి వ్రత విశిష్టత
పదిహేడవ అధ్యాయం: పవిత్రారోపణ వ్రతం, కుమారి పూజా మహిమ
పద్దెనిమిదవ అధ్యాయం: ఆషాఢ శుక్ల దశమి వ్రత మహిమ
పంతొమ్మిదవ అధ్యాయం: ఏకాదశీ వ్రతం, పవిత్రారోపణ వ్రత విశేషాలు
ఇరవయ్యవ అధ్యాయం: త్రయోదశీ మన్మథ పూజ, చతుర్దశి వ్రత విశేషాలు
ఇరవై ఒకటవ అధ్యాయం: త్రిమోదకి వ్రతం, రక్షాబంధన విశిష్టత
ఇరవై రెండవ అధ్యాయం: సంకష్టహరణ చతుర్థీ వ్రత మహిమ
ఇరవై మూడవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత విశేషాలు
ఇరవై నాలుగవ అధ్యాయం: శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత మహిమ – ముగింపు
“శ్రావణ మాస మహాత్మ్యం ద్వారా మనం ఎన్నో వ్రతాల విశిష్టతలను, వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఈ పవిత్ర మాసంలో భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన జీవితంలో సుఖసంతోషాలను నింపుతుంది.
ఈ అద్భుతమైన సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం 👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link సబ్‌స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ!”








