
మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం 11-20
మూకపంచశతీ అనేది శ్రీ కామాక్షీ పరమేశ్వరి మహిమను గానం చేసే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్ర గ్రంథాలలో ఒకటి. దీనిని శ్రీ మూకకవి (మూకశంకరుడు) రచించినట్లు ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మాటలేని మూకుడు మహాకవిగా మారి, తన హృదయంలో ఉప్పొంగిన భక్తిని ఐదు శతకాల రూపంలో వ్యక్తపరిచాడు. ఈ అయిదు శతకాలలో ఆర్యా శతకం కూడా ఒక విశిష్టమైన భాగం.
ఈ శ్లోకాలను పారాయణం చేయడం ద్వారా భక్తి, జ్ఞానం, మనశ్శాంతి మరియు అమ్మవారి అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం.
ఈ పోస్ట్‌లో మూకపంచశతీ ఆర్యా శతకంలోని ప్రతి శ్లోకాన్ని మూలపాఠంతో పాటు సులభమైన తెలుగులో అర్థం అందిస్తున్నాము.
కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్ ।
పరమాం కలాముపాసే పరశివవామాంకపీఠికాసీనామ్ ॥11॥
కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మథుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను.
కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్ ।
కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానామ్ ॥12॥
అమ్మా, నా మనసు ఒక క్రీడా స్థలము. కంపానదీ తీరములో ఉన్న ఆ క్రీడా స్థలములో దయాసముద్రురాలవైన నీవు చిద్విలాసముగా, సర్వత్ర విహరిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.
ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయనపీయూషమ్ ।
ఆరబ్ధయౌవనోత్సవం ఆమ్నాయరహస్యమంతరవలంబే ॥13॥
ఒక మామిడి చెట్టు క్రింద నివాసుడైన, ఏకామ్రనాధుడైన ఈశ్వరుని మూడు నేత్రములైన సూర్య, చంద్ర, అగ్నులకు, నీ దృక్కులు అమృతపానమువంటివి. సర్వ వేద స్వరూపిణి, నిత్యయౌవని అయిన తల్లిని ప్రార్థిస్తున్నాను.
అధికాంచి పరమయోగిభిః ఆదిమపరపీఠసీమ్ని దృశ్యేన ।
అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వసంప్రదాయేన ॥14॥
అమ్మా, ఈ సకల ప్రపంచమును నీవు నీ రక్త వర్ణములో ముంచి వేస్తావు. అటువంటి ఎరుపు వర్షములో, కాంచీ పురములో నెలకొన్న నిన్ను యోగీశ్వరులు, ఏ రూపములో సందర్శిస్తారో, ఆ రూపముతో ఉన్న మాత నన్ను కరుణించుగాక.
అంకితశంకరదేహాం అంకురితోరోజకంకణాశ్లేషైః ।
అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్ ॥15॥
ఒక నిత్య యౌవనయైన బాలా స్వరూపము శంకరుని దేహమును తన అంకిత సీమగా చేసుకున్నపుడు, ఆమె కౌగిలింతల అంకములు ఈశ్వరుని శరీరముపై ఏర్పడినవి. అటువంటి జగన్మాతను నేను కాంచీపురములో తిలకించాను.
మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా ।
చిద్వపుషా కాంచిపురే కేలిజుషా బంధుజీవకాంతిముషా ॥16॥
పర్వతరాజు పుత్రికగా జన్మించి, మంకెన పూవుల వర్ణమువంటి ఎర్రని వర్ణముతో, పూల బాణములను ధరించి, కాంచీపురములో క్రీడిస్తున్న తల్లిని నేను మానసికముగా తిలకిస్తున్నాను.
మధురస్మితేన రమతే మాంసలకుచభారమందగమనేన ।
మధ్యేకాంచి మనో మే మనసిజ సామ్రాజ్యగర్వబీజేన ॥17॥
క్లీంకార స్వరూపిణిగా, సకల జగత్తుల పోషణా స్థానములైన మాతృస్థానముల భారముతో మందగమనయై, ఈశ్వరుని శృంగారాధిదేవతయై, కాంచీ పురములో సంచరించే అమ్మను తిలకించి, నా మనసు సంతోషముతో పులకరిస్తున్నది.
ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీమ్ ।
అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే ॥18॥
పంచభూతములైన భూమి, ఆకాశము, అగ్ని, నీరు, వాయువు మరియు సూర్యచంద్రులలో నిండి, మహేశ్వర తత్వముతో నిండిన మాతృమూర్తి- కంపానదీ తీరములో సంచరిస్తుండగా చూసిన నా మనసు ఆనంద పరవశమౌతున్నది.
లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకంపమ్ ।
పీనస్తనభరమీడే మీనధ్వజతంత్ర పరమతాత్పర్యమ్ ॥19॥
అమ్మా! నీవు అంతర్ముఖ సమారాధ్యవు. కాంచీపురములో తపస్సు చేస్తున్న నిన్ను, యోగులు మానసికముగా దర్శించారు. ఆ రూపమునే నేను కూడా దర్శించి ధ్యానము చేస్తున్నాను.
శ్వేతా మంథరహసితే శాతా మధ్యే చ వాడ్భనోఽతీతా ।
శీతా లోచనపాతే స్ఫీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా ॥20॥
జగన్మాతా! నీకు ఆది అంతములు లేవు. మందస్మితవదనారవిందవు నీవు. క్షీరముతో నిండి ఉన్న మాతృస్థానముల బరువుతో వంగిన సన్నని నడుము కలిగిన చక్కని తల్లివి నీవు. నీ రూపము భావనాతీతమైనది. అటువంటి పరబ్రహ్మమును ఆరాధిస్తున్నాను.
మూక పంచశతీ ఆర్యా శతకం – 1-10 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 11-20 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 21-30 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 31-40 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 41-50 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 51-60 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 61-70 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 71-80 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 81-90 శ్లోకాలు
మూక పంచశతీ ఆర్యా శతకం – 91-100 శ్లోకాలు
ఈ పోస్ట్‌లో అందించిన మూకపంచశతీ ఆర్యా శతకం తెలుగులో అర్థం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పవిత్రమైన స్తోత్ర జ్ఞానాన్ని పంచుకోండి. అలాగే మూకపంచశతీలోని ఇతర శతకాలైన స్తుతి శతకం, కటాక్ష శతకం, మందస్మిత శతకం మరియు పాదారవింద శతకాల తెలుగులో అర్థాలను కూడా మా వెబ్‌సైట్‌లో చదవవచ్చు.
శ్రీ కామాక్షీ పరమేశ్వరి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, జ్ఞానం మరియు సర్వమంగళాలను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
ఈ శ్లోకాలను Video రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింది link click చేయండి. 👇👇



