శివానందలహరి 41-50 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
సంస్కృత శ్లోకము – 41
పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే ।
జిహ్వా చిత్తశిరోంఘ్రి హస్త నయనశ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ॥ 41 ॥
తాత్పర్యము
పరమేశ్వరా! పాపములు నశించి ఇష్టములు సిద్ధించుటకు- పరమేశ్వరుని స్తుతింపుము అని నాలుక, ధ్యానింపుము అని మనస్సు, నమస్కరింపుము అని శిరస్సు, ప్రదక్షిణము చేయుము అని పాదములు, పూజింపుము అని చేతులు, చూడుము అని కన్నులు, కథలు వినుము అని చెవులు- నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నెరవేర్చలేను. అట్లు చేయుటకు నన్ను పురిగొల్పుము. మూగతనము, మతిలేనితనము, కుంటి, గ్రుడ్డి తనము మొదలగునవి నాకు రాకుండా చూడుము.
సంస్కృత శ్లోకము – 42
గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణః
తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।
విద్యా వస్తు సమృద్ధి రిత్యఖిల సామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 ॥
తాత్పర్యము
దుర్గమమైన కైలాస పర్వతమున ప్రీతితో నివసించుచున్న దేవా! గాంభీర్యము అగడ్తగా, ధైర్యము ప్రాకారముగా, ఉదయించు సుగుణములు బలముగా, చక్షురాది ఇంద్రియములు ద్వారములుగా, పరమ శివజ్ఞానము సకల పదార్ధ సంపదగా కలిగి, నా మనస్సు ఒక దుర్గము (కోట) నకు ఉండవలసిన అన్ని లక్షణములతో సమగ్రముగా ఉన్నది. దుర్గప్రియుడవు కాబట్టి నీవు అందు నివసింపుము.
సంస్కృత శ్లోకము – 43
మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామక మనః కాంతార సీమాంతరే ।
వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః
తాన్హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి ॥ 43 ॥
తాత్పర్యము
ఓ ఆది కిరాతమూర్తీ! నీవు ఎచ్చటకూ పోక నా మనస్సునందే ఉండుము. నా మనస్సు ఒక మహారణ్యము. అందులో కామక్రోధాదులను క్రూర మృగములు అనేకమున్నవి. వానిని వేటాడి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొనుము.
సంస్కృత శ్లోకము – 44
కర లగ్నమృగః కరీంద్ర భంగో
ఘనశార్దూల విఖండనోఽస్తజంతుః ।
గిరిశో విశదాకృతిశ్చ చేతః-
-కుహరే పంచముఖోఽస్తి మే కుతో భీః ॥ 44 ॥
తాత్పర్యము
చేతియందు మృగముగలవాడు, గజాసురుని సంహరించిన వాడు, ఘనుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు, తనయందు లీనమగు ప్రాణి సముదాయముగలవాడు, తెల్లని శరీరము కలవాడు, కొండయందు నివశించువాడు అగు పంచముఖుడు (శివుడు) నా హృదయమను గుహయందు విరాజిల్లుచున్నాడు. ఇంక నాకేభయము లేదు.
సంస్కృత శ్లోకము – 45
ఛందఃశాఖి శిఖాన్వితైః ద్విజ వరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।
చేతఃపక్షి శిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం
నిత్యం శంకర పాదపద్మయుగళీనీడే విహారం కురు ॥ 45 ॥
తాత్పర్యము
ఓ మనస్సనే పక్షీ! ఇటుఅటు తిరిగి ఎందుకు శ్రమపడెదవు. పరమేశ్వరుని పాదద్వంద్వము ఒక చక్కని పక్షిగూడు వలె ఉన్నది. దానికెన్నడూ చలనములేదు. అందు మంచి వెలుతురు గలదు. అది మిక్కిలి సౌఖ్యమిచ్చును. అమృతఫలము కలిగి దుఃఖ నివారకమై ఉన్నది. అందు విహరించి ఆనందింపుము. అనేక బ్రాహ్మణ శ్రేష్టులు ఆయా శాఖాగ్రములకు సంబంధించియుండి దానిని ఆశ్రయించుచుందురు. నీవు కూడా ఇతర ఆశ్రయము వదిలి దానిని ఆశ్రయింపుము.
సంస్కృత శ్లోకము – 46
ఆకీర్ణే నఖ రాజి కాంతి విభవైః ఉద్యత్సుధా వైభవైః
ఆధౌతేఽపి చ పద్మరాగలలితే హంస వ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే ॥ 46 ॥
తాత్పర్యము
మనస్సనే రాజహంసా! గోళ్ళవరుసకు సంబంధించిన కాంతి వైభవముతో కూడు కొనినది, ఉద్భవించుచున్న అమృతము వ్యాపించుటచే కడుగబడినది, పద్మములవంటి వన్నెతో ఇంపైనది, పరమహంసల గుంపులచే సేవింపబడునది అగు పార్వతీపతి యొక్క పాదమనే మేడయందు ఏకాంతమున భక్తిరూపములైన భార్యలతో కూడి నిరంతరము స్వేఛ్ఛగా విహరింపుము.
సంస్కృత శ్లోకము – 47
శంభుధ్యాన వసంతసంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః ।
దీప్యంతే గుణకోరకా జపవచఃపుష్పాణి సద్వాసనా
జ్ఞానానంద సుధామరంద లహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ॥ 47 ॥
తాత్పర్యము
పరమేశ్వర ధ్యానమనే వసంత బుతువుతో సంబంధము ప్రాప్తించడం వలన నా మనస్సను పూలతోటలో పాపములన్ని పండుటాకులుగా రాలినవి. పుణ్యములు చిగురుటాకులుగా మొలకలెత్తినవి. వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి. భక్తిలతలు సాగుచున్నవి. అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి. సత్కర్మసంస్కారములు సువాసన వెదజల్లుచున్నవి. జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి. బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది.
సంస్కృత శ్లోకము – 48
నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుష హృత్సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యాన సరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి ॥ 48 ॥
తాత్పర్యము
ఓ మనోరాజహంసమా! క్షుద్రదేవతల నాశ్రయించుటవలన కొన్ని పాపములు తొలగిన తొలగుగాక! శాశ్వతానందము చేకూరదు. శంభుధ్యానము చేయుము. అది గొప్ప సరోవరము. సత్కర్మసంస్కారముతో గాని లభింపదు.
సంస్కృత శ్లోకము – 49
ఆనందామృతపూరితా హర పదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానస కాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ॥ 49 ॥
తాత్పర్యము
ఈశ్వరసేవానురక్తి నీరుగా, శివుని పాదపద్మములను పాదుగా, చిత్తస్థైర్యము ప్రాకుడు కంపగా, క్రమముగా ఉన్నతమైన నా మనస్సను పందిరి అంతటా చిలవలుపలవలుగా అల్లుకొని, చీడ మొదలగు దోషములచే చెడిపోకుండా ఉన్న ఈ భక్తిలత, పూర్వ పుణ్యకర్మ అను దోహదముచే పెంపొంది, నా మనోభీష్టమైన శాశ్వత ఫలము ఫలించుగాక!
సంస్కృత శ్లోకము – 50
సంధ్యారంభవిజృంభితం శ్రుతిశిరః స్థానాంతరాధిష్ఠితం
స ప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనా శోభితమ్ ।
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ॥ 50 ॥
తాత్పర్యము
శ్రీశెల పర్వతమందున్న మల్లికార్జున మహాలింగము మల్లె తీగ అల్లుకొన్న మద్దిచెట్టుతో పోల్చి వర్ణింపబడినది. ఈశ్వరుడు సాయంకాలమున తాండవ నృత్యముతో భక్తులను ఆనందపరచును. అది పుష్పవికాసములతో తాండవించి ఆనందపరచును. శివుడు శ్రీశైలమందుగాక ఉపనిషత్తులయందు ఉండును. దాని పుష్పములు చెవులయందు, శిరస్సులయందు అలంకారములుగా ఉండును. మల్లికార్జునుడు భ్రమరాంబతో, అర్జున వ్పక్షము భ్రమరములతో కూడి ఒప్పును. ఈశ్వరునకు సాధుభావన యొక్క శోభ, దానికి సువాసనయొక్క శోభ కలదు. భోగీంద్రుడనగా వాసుకి శివుని ఆభరణము.
భోగీంద్రులనగా మహా భోగవంతులకు దాని పూలు అలంకారములు. శివుడు సర్వదేవతలచేతా పూజింపబడువాడు. దాని పుష్పములు అన్ని పుష్పములకంటే మిక్కిలి శ్లాఘనీయములు. భగవంతుడు సత్త్వమువలన తెలియబడును. అది సుగంధ గుణమున తెలియబడును. అట్టి మల్లికార్జున దేవుని భజించెదను.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



