వైశాఖ పురాణం 4 వ అధ్యాయము
అంబరీష మహారాజు నారద మహర్షితో “మహర్షీ! వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి? ఏవి చేయకూడదు? దయచేసి ఆ ధర్మాలను వివరించండి” అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పగలు పడుకోకూడదు. కంచు పళ్ళెంలో తినకూడదు (దీనికి బదులు అరటి ఆకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి). మంచం మీద పడుకోకూడదు. ఉల్లిపాయ లాంటి వస్తువులను తినకూడదు. పగలు మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా, తామరాకులో భోజనం చేసేవారు పాపాలను పోగొట్టుకుని వైకుంఠానికి వెళ్తారు. ఎండలో నడిచి అలసిపోయిన వారిని లేదా ఉత్తమ బ్రాహ్మణులను ఆదరించి, వారిని కూర్చోబెట్టి సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించాలి. వారిని సేవిస్తే, గంగా నది వంటి అన్ని పుణ్య తీర్థాలలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది.
వైశాఖ మాసంలో ఆరోగ్యంగా ఉండి కూడా నదీ స్నానం చేయకుండా, విష్ణు పూజ చేయకుండా కాలం గడిపేవారు చాలా నష్టపోతారు. అటువంటి వారు వచ్చే జన్మలో గాడిదగా, ఆ తర్వాత కంచర గాడిదగా పుడతారు. ఇంట్లోనే స్నానం చేసేవారు నీచ జన్మలు పొందుతారు. అసలు స్నానమే చేయని వారు పిశాచాలుగా మారుతారు. మళ్ళీ వైశాఖ వ్రతం చేస్తే తప్ప ఆ పిశాచ రూపం వదలదు. శక్తి ఉండి కూడా అన్నం, నీరు దానం చేయని లోభి తన పాపాలను ఎప్పటికీ పోగొట్టుకోలేడు.
విష్ణువును ధ్యానిస్తూ నదిలో స్నానం చేస్తే గత మూడు జన్మల పాపాలు పోతాయి. సూర్యోదయ సమయంలో సముద్రంలో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి. గంగ, యమున, సరస్వతి, నర్మద, కృష్ణవేణి, కావేరి, వృద్ధ గంగ.. ఈ ఏడు నదుల్లో వైశాఖంలో స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. బయట ప్రవహించే నీరు గోపాదమంత లోతు ఉన్నా సరే, అందులో అన్ని తీర్థాలు ఉంటాయని నమ్మి స్నానం చేయాలి. పాలలో పెరుగు, పెరుగులో నెయ్యి ఎలా ఉత్తమమో.. అలాగే కార్తీకం కంటే మాఘం, మాఘం కంటే వైశాఖం గొప్పది. ఈ నెలలో చేసే చిన్న దానమైనా సరే, మర్రి చెట్టులాగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది.
ఇంట్లో ఎన్ని అలంకారాలు ఉన్నా పైన కప్పు లేకపోతే ఆ ఇల్లు ఎలా వృథానో.. అన్ని వ్రతాలు చేసినా వైశాఖ వ్రతం చేయకపోతే జీవితం అలాగే వ్యర్థం. ఎన్ని పప్పులు, కూరలు వండినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు.. అలాగే ఈ వ్రతం లేని పూజలు రుచించవు. స్త్రీ ఎన్ని నగలు వేసుకున్నా వస్త్రం లేకపోతే గౌరవం ఉండదు.. అలాగే ఈ వ్రతం లేకపోతే ఇతర పుణ్యకార్యాలు శోభించవు. ఎంత అందగత్తె అయినా, గుణవంతురాలైనా భర్త ప్రేమ లేకపోతే ఆమెకు గుర్తింపు ఉండదు.. వైశాఖ వ్రతం లేని భక్తి కూడా అలాంటిదే.
చివరికి ఎంతటి భోగి అయినా, మదమెక్కిన రాజైనా సరే.. వైశాఖంలో కేవలం స్నానం చేస్తే చాలు, సర్వ దోషాలు పోయి పుణ్యాత్ముడై వైకుంఠానికి వెళ్తాడు. ఈ మాసానికి అధిదేవుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు.
శ్రీమహావిష్ణువును ప్రార్థించి అర్ఘ్యమిచ్చి స్నానం పూర్తి చేశాక, ఉతికిన పొడి బట్టలు కట్టుకుని ఆ నెలలో పూచిన పూలతో శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించే విష్ణుమూర్తి కథలను చదవాలి లేదా వినాలి. ఇలా చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి.
ఈ వ్రతాన్ని పాటించే వారు భూలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా లేదా పాతాళంలో ఉన్నా.. వారికి ఎక్కడా ఎలాంటి కష్టాలూ రావు. వారికి పునర్జన్మ ఉండదు. నేరుగా మోక్షం లభిస్తుంది. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రల్లో భోజనం చేస్తారో, విష్ణు కథలను వినరో, స్నాన దానాలు చేయరో.. వారు కచ్చితంగా నరకానికి వెళ్తారు. బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలకైనా ఏదో ఒక పరిహారం ఉంటుంది కానీ, వైశాఖ వ్రతాన్ని చేయని వారికి మాత్రం ఆ పాపం నుండి విముక్తి పొందే దారే లేదు.
శరీరం సహకరిస్తున్నా, నీళ్లు అందుబాటులో ఉన్నా స్నానం చేయని వాడు.. నోరు ఉండి కూడా ‘హరి’ అనే రెండు అక్షరాలు పలకని వాడు.. బతికున్నా మరణించినవారితో సమానమే. వాడు జీవించి ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ నెలలో విష్ణువును ఏ రకంగానూ సేవించని వాడు వచ్చే జన్మలో పందిగా పుడతాడు.
పవిత్రమైన వైశాఖ మాసంలో తెల్లవారుజామునే నది లేదా చెరువులో స్నానం చేసి, తులసి దళాలతో విష్ణువును పూజించి, ఆయన కథలను వింటూ దానాలు చేసేవారు వచ్చే జన్మలో గొప్ప రాజులుగా పుడతారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులందరితో కలిసి విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటారు. భగవంతుడిని రూపం ఉన్నవానిగా లేదా రూపం లేని శక్తిగా ఎలా తలచుకున్నా సరే, నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే చాలు.
వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం.
ఐదోవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


