మూకపంచశతీ మందస్మిత శతకం 51-60 శ్లోకాలకు తెలుగులో అర్థం

మూకపంచశతీ – మందస్మిత శతకం 51-60 శ్లోకాలు

మూకపంచశతీ మందస్మిత శతకం శ్రీ కామాక్షీ అమ్మవారి దివ్య మందహాస మహిమను వర్ణించే అపూర్వమైన స్తోత్రరత్నం. మహాకవి మూకకవి రచించిన ఈ శతకంలోని ప్రతి శ్లోకం అమ్మవారి కరుణ, సౌందర్యం, అనుగ్రహాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో అర్థం మరియు భావాన్ని తెలుసుకుందాం.

వ్యాపారం చతురాననైకవిహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ
రుద్రాక్షగ్రహణం మహేశి సతతం వాగూర్మికల్లోలితా ।
ఉత్ఫుల్లం ధవలారవిందమధరీకృత్య స్ఫురంతీ సదా
శ్రీకామాక్షి సరస్వతీ విజయతే త్వన్మందహాసప్రభా ॥51॥
అమ్మా! కామాక్షీ! నీ చిరునవ్వు ఎల్లప్పుడూ కవీశ్వరుల ముఖములలో వర్ధిల్లుతూ సరస్వతిగా ప్రభావిస్తున్నది. ఈశ్వరుని దృష్టితో మమేకమై, ధవళవర్ణము కల కమలమును ఆసనముగా చేసుకుని ఉన్నది. అట్టి నీ చిరునవ్వుల ప్రకాశమనే సరస్వతికి నమస్కారములు.

కర్పూరద్యుతితస్కరేణ మహసా కల్మాషయత్యాననం
శ్రీకాంచీపురనాయికే పతిరివ శ్రీమందహాసోఽపి తే ।
ఆలింగత్యతిపీవరాం స్తనతటీం బింబాధరం చుంబతి
ప్రౌఢం రాగభరం వ్యనక్తి మనసో ధైర్యం ధునీతేతరామ్ ॥52॥
అమ్మా! కాంచీపురాధీశ్వరీ! నీ చిరునవ్వులకు, ఈశ్వరునికి భేదమే లేదు. ఈశ్వరుడనే ఆ చిరునవ్వులు, నిన్ను తన కౌగిలిలో బంధిస్తుంది. నీ పెదవులను ముద్దిడుతుంది. నీపై అనురాగమును కలిగి ఉంటుంది. అట్టి చిరునవ్వులు మాకు మనో ధైర్యమును కలిగించుగాక.

వైశద్యేన చ విశ్వతాపహరణక్రీడాపటీయస్తయా
పాండిత్యేన పచేలిమేన జగతాం నేత్రోత్సవోత్పాదేన ।
కామాక్షి స్మితకందలైస్తవ తులామారోఢుముద్యోగినీ
జ్యోత్స్నాసౌ జలరాశిపోషణతయా దూష్యాం ప్రపన్నా దశామ్ ॥53॥
అమ్మా! నీ చిరునవ్వుల ప్రకాశములో వెన్నెల వెలవెలపోతున్నది. ఎందుకంటే మాతా! వెన్నెల నిర్మలమైనదే కానీ ఈ ప్రపంచములోని జీవుల బాధలను నీ చిరునవ్వులే తొలగించగలవు. వెన్నెలకు ఆ శక్తి లేదు కదా! నీ నవ్వులు చైతన్యమును ప్రసాదిస్తుంటే, వెన్నెల కేవలము జడత్వమును కలిగిస్తుంది.

లావణ్యాంబుజినీమృణాలవలయైః శృంగారగంధద్విప-
గ్రామణ్యః శ్రుతిచామరైస్తరుణిమస్వారాజ్యతేజోంకురైః ।
ఆనందామృతసింధువీచిపృషతైరాస్యాబ్జహంసైస్తవ
శ్రీకామాక్షి మథాన మందహసితైర్మత్కం మనఃకల్మషమ్ ॥54॥
అమ్మా! నీ చిరునవ్వులను ఏమని వర్ణించమంటావు. అవి సౌందర్యమనే సరసులోని తామర పుష్పములు. శృంగారము అనే మదగజమునకు గల వింజామరల వంటి చెవులు. సంతోషమనే సముద్రములో అలల తుంపరలు. ముఖమనే పద్మములో సంచరించే హంసలు. నీ చిరునవ్వులు నా మాలిన్యమును తొలగించుగాక.

ఉత్తుంగస్తనమండలీపరిచలన్మాణిక్యహారచ్ఛటా-
చంచచ్ఛోణిమపుంజమధ్యసరణిం మాతః పరిష్కుర్వతీ ।
యా వైదగ్ధ్యముపైతి శంకరజటాకాంతారవాటీపత-
త్స్వర్వాపీపయసః స్మితద్యుతిరసౌ కామాక్షి తే మంజులా ॥55॥
జగదీశ్వరీ! కామాక్షీ! నీ మాతృస్థానములలో ఎర్రటి వర్ణముకల మణిహారముల కాంతులుగా, ఈశ్వరుని జటల నుండి క్రిందకు దుమికే గంగానదీ ప్రవాహమువలే ఉన్న తెల్లని నీ చిరునవ్వుల ప్రవాహము మాకు శుభదాయిని అగుగాక.

సన్నామైకజుషా జనేన సులభం సంసూచయంతీ శనై-
రుత్తుంగస్య చిరాదనుగ్రహతరోరుత్పత్స్యమానం ఫలమ్ ।
ప్రాథమ్యేన వికస్వరా కుసుమవత్ప్రాగల్భ్యమభ్యేయుషీ
కామాక్షి స్మితచాతురీ తవ మమ క్షేమంకరీ కల్పతామ్ ॥56॥
అమ్మా! నీ అనుగ్రహము పొందాలంటే గురుకృప ఎంతో అవసరం. నీ అనుగ్రహము అనే వృక్షమునకు మూలమైన వేరు గురువు. ఆ వేళ్ళు వృక్షముగా పెరిగి, నీ చిరునవ్వులనే పుష్పములు వికసించి, అవి ఫలములై నీ అనుగ్రహమును ప్రసాదిస్తాయి. ఆ చిరునవ్వులు మాకు క్షేమంకరి అగుగాక.

ధానుష్కాగ్రసరస్య లోలకుటిలభ్రూలేఖయా బిభ్రతో
లీలాలోకశిలీముఖం నవవయస్సామ్రాజ్యలక్ష్మీపుషః ।
జేతుం మన్మథమర్దినం జనని తే కామాక్షి హాసః స్వయం
వల్గుర్విభ్రమభూభృతో వితనుతే సేనాపతిప్రక్రియామ్ ॥57॥
మాతా! కామాక్షీ! చూస్తే నీకొక కోరిక కలిగినట్టుంది. నీవు నీ నవయౌవన సామ్రాజ్యలక్ష్మిని వృద్ధి పరచడానికి, మన్మథుని జయించిన ఈశ్వరుని జయించాలనుకుని, నీ కనుబొమలనే ధనుసుగా చేసుకుని, చూపులను బాణములుగా చేసి నీ చిరునవ్వులనే సేనాధిపతి ద్వారా ఆ బాణములను ప్రయోగించి ఈశ్వరుని వశపరచుకున్నావు.

యన్నాకంపత కాలకూటకబలీకారే చుచుంబే న యద్-
గ్లాన్యా చక్షుషి రూషితానలశిఖే రుద్రస్య తత్తాదృశమ్ ।
చేతో యత్ప్రసభం స్మరజ్వరశిఖిజ్వాలేన లేలిహ్యతే
తత్కామాక్షి తవ స్మితాంశుకలికాహేలాభవం ప్రాభవమ్ ॥58॥
జగద్రక్షకీ! ఈశ్వరుడు నిశ్చలుడు, స్థిరచిత్తుడు. కాలకూట విషమును పండువలే మ్రింగినప్పుడు కూడా అతడు కించిత్ మాత్రము చలించలేదు. మన్మథుని తన మూడవ కంటి మంటతో దగ్ధము చేసినప్పుడూ చలించలేదు. కానీ నీ చిరునవ్వు అనే మన్మథ బాణమునకు మాత్రము చలించినాడు.

భిన్నేవ సుపర్వలోకతటినీ వీచీచయైర్యామునైః
సంమిశ్రేవ శశాంకదీప్తిలహరీ నీలైర్మహానీరదైః ।
కామాక్షి స్ఫురితా తవ స్మితరుచిః కాలాంజనస్పర్ధినా
కాలిమ్నా కచరోచిషాం వ్యతికరే కాంచిద్దశామశ్నుతే ॥59॥
మాతా! నీ చిరునవ్వులకు పోటీ ఎవరో తెలుసా! కాటుకవలే నల్లనైన నీ కేశముల కాంతియే. తెల్లని నీ చిరునవ్వుల ప్రకాశము నల్లని నీ కేశముల కాంతితో కలిసి పయనిస్తున్నపుడు అది గంగా, యమునా నదుల సంగమము వలె తోచుచున్నది.

జానీమో జగదీశ్వరప్రణయిని త్వన్మందహాసప్రభాం
శ్రీకామాక్షి సరోజినీమభినవామేషా యతః సర్వదా ।
ఆస్యేందోరవలోకేన పశుపతేరభ్యేతి సంఫుల్లతాం
తంద్రాలుస్తదభావ ఏవ తనుతే తద్వైపరీత్యక్రమమ్ ॥60॥
ఈశ్వరునిపై అమితమైన ప్రేమ కల ఓ కామాక్షీ! నేను నీ చిరునవ్వుల ప్రకాశమును కలువ పుష్పముగా భావిస్తున్నాను. ఎందుకంటే, ఈశ్వరుడు అనే ముఖచంద్రుని చూసినపుడు ఆ కమలము ఎంతో వికసిస్తుంది. ఆ చిరునవ్వు మాకు అభయమును ప్రసాదించుగాక.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top