సౌందర్యలహరి 91-100 శ్లోకాల తెలుగు అర్థం

సౌందర్యలహరి 91-100 శ్లోకాలకు అర్థం

సౌందర్యలహరి ఆదిశంకరాచార్యులు రచించిన అత్యంత ప్రసిద్ధి చెందిన దేవీ స్తోత్రాలలో ఒకటి. శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి అపారమైన మహిమ, దివ్య సౌందర్యం, పరాశక్తి తత్త్వాన్ని అద్భుతమైన కవిత్వంతో ఈ గ్రంథం వివరిస్తుంది. భక్తి, తంత్ర, వేదాంత సంప్రదాయాలలో సౌందర్యలహరికి విశిష్టమైన స్థానం ఉంది.

ఈ వ్యాసంలో సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకానికి సులభమైన తెలుగులో అర్థం, అంతర్లీన భావాన్ని అందిస్తున్నాము. ఈ దివ్య శ్లోకాల భావాన్ని తెలుసుకోవడం ద్వారా అమ్మవారి కరుణా కటాక్షాన్ని అనుభవిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింత లోతుగా గ్రహించవచ్చు.

పదన్యాసక్రీడాపరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలంభవనకలహంసానజహతి ।
అతస్తేషాంశిక్షాంసుభగమణిమంజీరరణిత-
చ్ఛలాదాచక్షాణంచరణకమలంచారుచరితే ॥ 91 ॥

ఓ చారుచరితా! అందమైన నీ పాదవిన్యాస క్రీడాభ్యాసమును తామునూ పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచూ, నీ విలాసగమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాదపద్మము కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియల చిరుసవ్వడులనెడి నెపముతో ఆ రాజహంసలకు విలాసగమనక్రీడా శిక్షణను నేర్పుచున్నట్లున్నది.

గతాస్తేమంచత్వంద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివఃస్వచ్ఛచ్ఛాయాఘటితకపటప్రచ్ఛదపటః ।
త్వదీయానాంభాసాంప్రతిఫలనరాగారుణతయా
శరీరీశృంగారోరసఇవదృశాందోగ్ధికుతుకమ్ ॥ 92 ॥

తల్లీ! జగజ్జననీ! బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు నీవు అధిష్టించు మంచము యొక్క నాలుగు కోడుల రూపమున ఉన్నారు. సదాశివుడు తన స్వచ్చమైన తెల్లని కాంతితో ఆ మంచముపై కప్పుదుప్పటి అగుచూ, ఎర్రని నీ మేనికాంతులు తనపై ప్రతిఫలించుట వలన తానూ పూర్తిగా ఎర్రగా మారి, మూర్తీభవించిన శృంగారరసము వలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు.

అరాలాకేశేషుప్రకృతిసరలామందహసితే
శిరీషాభాచిత్తేదృషదుపలశోభాకుచతటే ।
భృశంతన్వీమధ్యేపృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుంశంభోర్జయతికరుణాకాచిదరుణా ॥ 93 ॥

తల్లీ! జగజ్జననీ! తలకురులయందు వంకరయైనది, లేతనవ్వునందు స్వభావముచేతనే చక్కనిది, మనస్సునందు దిరిసెనపువ్వువలె మెత్తదనము గలది, వక్షములు సన్నికల్లు పొత్రమువలె బలము గలవి, నడుమునందు మిగుల సన్నదనము గలది, వక్షస్థలము వద్ద, పిరుదుల వద్ద విశాలత్వము గలది. ఈ విధముగా ఉండునని చెప్పనలవి కానిది, శంభుని కరుణారూపమైన “అరుణ” అనుశక్తి జగద్రక్షణ నిపుణయై సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది.

కలంకఃకస్తూరీరజనికరబింబంజలమయం
కలాభిఃకర్పూరైర్మరకతకరండంనిబిడితమ్ ।
అతస్త్వద్భోగేనప్రతిదినమిదంరిక్తకుహరం
విధిర్భూయోభూయోనిబిడయతినూనంతవకృతే ॥ 94 ॥

తల్లీ! జగజ్జననీ! ఆకాశములో కనబడుచున్న చంద్రమండలము మరకతమణులచే చేయబడిన నీవు కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొను బరణియే. చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది కస్తూరి. చంద్రునిలోని జలతత్త్వము నీవు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడునవి పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ బరణి నుండి నీవు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగిపోవుటచే, నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు.

పురారాతేరంతఃపురమసితతస్త్వచ్చరణయోః
సపర్యామర్యాదాతరలకరణానామసులభా ।
తథాహ్యేతేనీతాఃశతమఖముఖాఃసిద్ధిమతులాం
తవద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః ॥ 95 ॥

అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాదపద్మపూజ చేయగల భాగ్యము చపలచిత్తులైన వారికి లభించునది కాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ, తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధులతో కూడి, వారితో పాటు నీ ద్వారసమీపమునందే కావలివారివలె పడిగాపులు గాచుచున్నారు.

కలత్రంవైధాత్రంకతికతిభజంతేనకవయః
శ్రియోదేవ్యాఃకోవానభవతిపతిఃకైరపిధనైః ।
మహాదేవంహిత్వాతవసతిసతీనామచరమే
కుచాభ్యామాసంగఃకురవకతరోరప్యసులభః ॥ 96 ॥

ఓ పతివ్రతాశిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరు కవులు సేవింపకున్నారు? లక్ష్మీదేవి యొక్క ధనసంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవీ! నీ స్తనయుగముతోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంటచెట్టుకు గూడా లభించదు కదా!

గిరామాహుర్దేవీంద్రుహిణగృహిణీమాగమవిదో
హరేఃపత్నీంపద్మాంహరసహచరీమద్రితనయామ్ ।
తురీయాకాపిత్వందురధిగమనిఃసీమమహిమా
మహామాయావిశ్వంభ్రమయసిపరబ్రహ్మమహిషి ॥ 97 ॥

ఓ పరబ్రహ్మమైన సదాశివుని పట్టమహిషీ! ఆగమరహస్యార్థములు తెలిసిన విద్వాంసులు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు, వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా చెప్పుదురు. ఆ నిన్నే శ్రీమహావిష్ణుమూర్తి భార్య, కమలవాసిని అయిన మహాలక్ష్మీదేవిగా చెప్పుదురు. మరియు ఆ నిన్నే శివుని సహధర్మచారిణి అయిన పార్వతిగా గూడా చెప్పుదురు. కాని నీవు ఈ ముగ్గురికంటె వేరుగా నాల్గవ దానివై, ఇట్టిదని చెప్పనలవికాని ఆమెవై, అనిర్వాచ్యమై, మహాకష్టసాధ్యమై, మహామాయాతత్త్వమై, ఈ సర్వజగత్తును నానావిధములుగా మోహపెట్టుచున్నావు.

కదాకాలేమాతఃకథయకలితాలక్తకరసం
పిబేయంవిద్యార్థీతవచరణనిర్ణేజనజలమ్ ।
ప్రకృత్యామూకానామపిచకవితాకారణతయా
కదాధత్తేవాణీముఖకమలతాంబూలరసతామ్ ॥ 98 ॥

తల్లీ! జగజ్జననీ! స్వాభావికముగానే చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై, పూర్వానుభవము సామర్థ్యము లేకున్నా కవిత్వరచనా సౌభాగ్యమును ప్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూలరసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాదప్రక్షాళన జలమును విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము.

సరస్వత్యాలక్ష్మ్యావిధిహరిసపత్నోవిహరతే
రతేఃపాతివ్రత్యంశిథిలయతిరమ్యేణవపుషా ।
చిరంజీవన్నేవక్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యంరసయతిరసంత్వద్భజనవాన్ ॥ 99 ॥

తల్లీ! జగజ్జననీ! నిన్ను సేవించు భక్తుడు సరస్వతీకటాక్షము చేత, లక్ష్మీకటాక్షము చేత వరుసగా బ్రహ్మ, విష్ణువులకు ప్రత్యర్థిగా మారి విహరించును. అత్యంత సుందరమైన రూపముతో మన్మథపత్ని అయిన రతీదేవి పాతివ్రత్యమును కూడా సడలింపచేయును. చివరకు జీవసంబంధ, అవిద్యాసంబంధముల నుండి దూరుడై, జీవన్ముక్త స్థితిలో పరానందసుఖమును అనగా మోక్షానందమును అనుభవించును.

ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవిధిః
సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా ।
స్వకీయైరంభోభిఃసలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవజననివాచాంస్తుతిరియమ్ ॥ 100 ॥

వాక్ప్రపంచమునకెల్ల తల్లివగు ఓ దేవీ! భగవతీ! తన సంబంధము వలనే జ్వలించు దివిటీజ్వాలలచేత సూర్యునికి హారతి నిచ్చుట ఎట్లో, అట్లే తన సంబంధము వలననే స్రవింపబడు చంద్రకాంతాశిలా జలబిందువులచేత చంద్రునికి అర్ఘ్యము సమర్పించుట ఎట్లో, అట్లే తనకు సంబంధించినవే అయిన సముద్రోదకములచేతనే ఆ సముద్రుని తృప్తికి తర్పణము చేయుట ఎట్లో, అట్లే నీ అనుగ్రహము వలన నీ స్వరూపములో నా నుండి వ్యక్తమగు వాక్కుల కూర్చులచేత ఈ స్తుతి నీకు నా చేత చేయబడుచున్నది.

సౌందర్యలహరి ముఖ్యస్తోత్రం సంవార్తదాయకమ్ ।
భగవద్పాదసంక్లుప్తం పఠేన్ముక్తౌభవేన్నరః ॥

॥ ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ సౌందర్యలహరీ సంపూర్ణా ॥
॥ ఓం తత్సత్ ॥

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 1-10 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 11-20 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 21-30 శ్లోకాలు

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 31-40 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 41-50 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 51-60 శ్లోకాలు

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 61-70 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 71-80 శ్లోకాలు 

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 81-90 శ్లోకాలు

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం 91-100 శ్లోకాలు 

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

సౌందర్యలహరి స్తోత్రాలకు తెలుగులో అర్థం వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ కింది link ఓపెన్ చేసి చూడండి. 👇👇👇👇👇

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top