వైశాఖ పురాణం 9 వ అధ్యాయము
నారద మహర్షి అంబరీష మహారాజుతో “శ్రుతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక, శ్రుతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో “మునీశ్వరా! హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా, బల్లిగా పుట్టాడని చెప్పారు సరే. కానీ ఆయన యజ్ఞయాగాలు, ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా! మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గ్రద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికీ కీడు చేయలేదు కదా! కేవలం గౌరవించనంత మాత్రాన ఇంతటి శిక్షా?’ అని అడిగాడు.
దానికి శ్రుతదేవుడు “రాజా! దీని గురించి పూర్వం కైలాసంలో శివుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఒకటి ఉంది. భగవంతుడు ఈ లోక స్థితిని రెండు విధాలుగా విభజించాడు:
- ఇహలోక సుఖం: దీని కోసం నీరు (జల సేవ), అన్నం (అన్న సేవ), మందులు (ఔషధ సేవ) అనే మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి.
- పరలోక సుఖం: దీని కోసం సాధువుల సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గాన్ని అనుసరించడం అనే మూడు ముఖ్యమైనవి.
మనకు ఇష్టమైన పనైనా సరే, అది సజ్జనులకు ఇష్టం లేనిదైతే దాని వల్ల మనకు ఏదో ఒక ఆపద తప్పదు. మంచివారికి అప్రియమైన పని చేస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా దక్ష ప్రజాపతి కథను విను.
పూర్వం దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞం చేయాలనుకున్నాడు. అంతకుముందే తన కూతురు సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లుడిని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్లాడు దక్షుడు. అప్పుడు శివుడు ఇలా ఆలోచించాడు. “నేను అందరికీ గురువును, దేవదేవుడిని. దక్షుడు నాకు మామగారు, గౌరవార్హుడు. కానీ, గురువు శిష్యుని చూసి, యజమాని సేవకుని చూసి, భర్త భార్యను చూసి గౌరవంతో లేచి నిలబడకూడదు. నేను ఈశ్వర స్థితిలో ఉన్నాను కాబట్టి, మామగారు వచ్చారని నేను లేచి నిలబడితే అది ఆయనకే నష్టం. ఆయన ఆయువు, కీర్తి, సంపద తగ్గిపోతాయి” అని తలచి శివుడు లేచి నిలబడలేదు.
కానీ ఆ ధర్మ సూక్ష్మాన్ని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. ‘అల్లుడు నన్ను చూసి లేవలేదు’ అన్న అహంకారంతో శివుడిని అక్కడే ఘోరంగా నిందించాడు. “శివుడు దరిద్రుడు, ఎముకలు ధరించేవాడు, స్మశానంలో ఉంటాడు, ఇతనికి కులగోత్రాలు లేవు, ఇతని పేరుకు అర్థం నక్క” అని రకరకాలుగా అవమానించి, కూతురిని, అల్లుడిని తన యజ్ఞానికి పిలవకుండానే వెళ్ళిపోయాడు.
యజ్ఞం మొదలైంది. దేవతలందరూ వచ్చారు కానీ శివుడు, విష్ణువు రాలేదు. సతీదేవికి తన పుట్టింటికి, యజ్ఞానికి వెళ్ళాలనిపించింది. శివుడు ‘వద్దు, అక్కడ నీకు అవమానం జరుగుతుంది, ఆ నిందను నువ్వు భరించలేవు’ అని ఎంత చెప్పినా వినకుండా, నంది వాహనం ఎక్కి యజ్ఞానికి వెళ్లింది.
యజ్ఞశాలలోకి వెళ్ళిన సతీదేవిని ఎవరూ పలకరించలేదు. పైగా ఆమె తండ్రి దక్షుడు శివుడికి ఇవ్వాల్సిన యజ్ఞ భాగాన్ని (రుద్రాహుతి) ఇవ్వకుండా మిగతా దేవతలకు ఇస్తున్నాడు. అది చూసి సతీదేవి తట్టుకోలేకపోయింది. “తండ్రీ! ఈశ్వరుడిని అవమానించడం మంచిది కాదు, ఆయన లేని యజ్ఞం పూర్తి కాదు’ అని హితవు చెప్పింది. కానీ అక్కడ ఉన్న సూర్యుడు, భృగు మహర్షి వంటి వారు కూడా సతీదేవిని చూసి నవ్వి, ఎగతాళి చేశారు. దక్షుడు మళ్ళీ శివుడిని అసభ్య పదజాలంతో దూషించాడు.
పతి నిందను వినడం మహా పాపమని, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం తన శరీరాన్ని వదలడమే అని భావించి, అందరూ చూస్తుండగానే సతీదేవి అక్కడి యజ్ఞ కుండంలోని అగ్నిలో దూకి ప్రాణ త్యాగం చేసింది. ఇది చూసి అందరూ హాహాకారాలు చేశారు. శివ పరివారం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని పరమశివుడికి చేరవేశారు.”
వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం.
పదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


