వైశాఖ పురాణం 10 వ అధ్యాయము
సతీదేవి అగ్నికి ఆహుతి అయిందన్న వార్త వినగానే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రళయకాల యముడిలా భయంకరంగా మారి, వెయ్యి చేతులతో మహా బలవంతుడైన వీరభద్రుడిని పుట్టించాడు. “నా భార్య మరణానికి కారణమైన దక్షుడిని సంహరించు” అని వీరభద్రుడిని ఆదేశించి, తన భూతగణాలను తోడు పంపాడు.
వీరభద్రుడు తన సైన్యంతో యజ్ఞశాల మీద పడి అల్లకల్లోలం చేశాడు. సతీదేవి మాటలకు నవ్వినందుకు సూర్యుడి పళ్ళను పెరికివేశాడు. సతీదేవిని ఎగతాళి చేసిన వారు ఏ అవయవంతో వెటకారం చేశారో, ఆ అవయవాలను విరగ్గొట్టాడు. చివరకు శివుడే స్వయంగా దక్షుడి తలను నరికేశాడు.
ఆ తర్వాత బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్లి శివుడిని ప్రార్థించి శాంతింపజేశాడు. శివుడు శాంతించి అందరినీ మళ్ళీ బతికించాడు. కానీ దక్షుడికి జరిగిన అవమానానికి గుర్తుగా, బ్రహ్మ కోరిక మేరకు మేక తల పెట్టి బతికించాడు. భృగు మహర్షికి మేక గడ్డాన్ని అమర్చాడు. యజ్ఞం పూర్తయ్యాక, భార్యా వియోగంతో బాధపడుతూ శివుడు గంగాతీరంలో తపస్సుకు వెళ్ళిపోయాడు.
ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, “శివుడి కొడుకు చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు” అని వరం పొందాడు. శివుడికి భార్యే లేదు కదా, ఇక కొడుకు ఎక్కడ పుడతాడు.. నాకు చావే లేదు అని వాడు గర్వంతో దేవతలను హింసించసాగాడు. దేవతా స్త్రీలను తన పరిచారికలుగా మార్చుకున్నాడు.
దిక్కుతోచని దేవతలు బ్రహ్మను వేడుకోగా.. “సతీదేవి ఇప్పుడు హిమవంతుడి కుమార్తెగా పార్వతి పేరుతో పెరుగుతోంది. శివుడిని పార్వతితో కలిపితేనే కుమారస్వామి పుడతాడు, అప్పుడే తారకాసురుడికి అంతం వస్తుంది. దీనికోసం ఏదైనా ఉపాయం ఆలోచించండి” అని బ్రహ్మ చెప్పారు.
ఇంద్రుడు నారదుడిని హిమవంతుడి దగ్గరకు పంపి, పార్వతిని శివుడి సేవకు పంపేలా చేశాడు. మరోవైపు మన్మథుడిని పిలిచి, “నువ్వు వసంత ఋతువును తీసుకుని శివుడి దగ్గరకు వెళ్ళు. శివుడికి పార్వతి మీద ప్రేమ కలిగేలా బాణాలు వేయి” అని పంపాడు.
మన్మథుడు తన భార్య రతీదేవి, స్నేహితుడు వసంతుడితో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. అక్కడ అకాలంగా వసంతం వచ్చింది. పూలు వికసించాయి. పార్వతి శివుడికి పూజ చేయడానికి రాగానే, ఇదే సరైన సమయమని భావించి మన్మథుడు చెట్టు చాటు నుండి శివుడిపై మోహ బాణాన్ని వేశాడు.
తన మనస్సు చలిస్తుండటంతో శివుడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. బాణం వేయబోతున్న మన్మథుడిని చూడగానే, శివుడికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరిచాడు. ఆ నేత్రాగ్నికి మన్మథుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. భయంతో దేవతలు పారిపోయారు, రతీదేవి విలపించింది. స్త్రీల సాంగత్యం వద్దని శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. శ్రుతదేవ మహాముని ఈ కథ చెబుతూ శ్రుతకీర్తి మహారాజుతో “చూశావా రాజా! మన్మథుడు దేవతల మేలు కోసమే పని చేసినా, శివుడికి ఇష్టం లేని సమయంలో ఆ పని చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అలాగే హేమాంగదుడు కూడా.. విష్ణువుకు ఇష్టమైన జ్ఞానులను గౌరవించకుండా, తనకి ఇష్టమైన రీతిలో అపాత్ర దానం చేయడం వల్లే కుక్కగా, గ్రద్దగా పుట్టాల్సి వచ్చింది. సజ్జనుల సేవ అన్నిటికంటే ముఖ్యం. మనకి ఏది అనిపిస్తుందో అది చేయడం కాదు, భగవంతుడికి (ధర్మానికి) ఏది ఇష్టమో అది చేయడమే ముఖ్యం.” ఈ కథను ఎవరు విన్నా వారికి పునర్జన్మ భయం ఉండదని శ్రుతదేవుడు వివరించాడు.
వైశాఖ పురాణం పదవ అధ్యాయం సంపూర్ణం.
పదకొండవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


