వైశాఖ పురాణం 8 వ అధ్యాయము
శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. “పూర్వం రేవా నది తీరంలో మా తండ్రిగారు చనిపోయాక పాపఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి, దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ, ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి, అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని నీళ్లున్నా, అవి తాగితే కాలకూట విషంలా మండిపోయేవి. ఒకరోజు నేను గంగా యాత్రకు వెళ్తూ దారిలో ఆ ప్రదేశానికి వెళ్లాను. ఆ బూరుగు చెట్టు మీద తన మాంసాన్ని తనే తింటూ, గొంతు బాధతో అరుస్తున్న ఆ పిశాచాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను.
ఆ పిశాచం నన్ను చూడగానే చంపడానికి వచ్చింది, కానీ నా ధార్మిక ప్రవర్తన వల్ల నన్ను ఏమీ చేయలేకపోయింది. అప్పుడు నేను జాలిపడి ‘నువ్వు ఎవరు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నేను నిన్ను ఈ కష్టం నుండి విడిపిస్తాను, నిజం చెప్పు’ అని అడిగాను. అప్పుడు ఆ పిశాచం ఇలా చెప్పింది. “నేను భూవరమనే పట్టణంలో ఉండే మైత్రుడిని, నాది సంకృతి గోత్రం. నేను అన్ని శాస్త్రాలూ చదివాను, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. కానీ, వైశాఖ మాసంలో మాత్రం పిసినారితనంతో ఎవరికీ అన్నదానం చేయలేదు. దారిలో వచ్చిన వారికి కనీసం భిక్షం కూడా వేయలేదు. అదే నా ఈ దురవస్థకు కారణం. నాకు శ్రుతదేవుడు అనే కొడుకు ఉన్నాడు, అతను చాలా ప్రసిద్ధుడు. ఒకవేళ నీకు అతను కనిపిస్తే.. నీ తండ్రి నర్మదా నది తీరంలో బూరుగు చెట్టు మీద పిశాచమై బాధపడుతున్నాడని చెప్పు. వైశాఖ మాసంలో వ్రతం చేసి, నా పేరు మీద నీటి తర్పణాలు వదిలి, బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే నాకు ఈ బాధ నుండి విముక్తి కలుగుతుందని అతనికి వివరించు’ అని వేడుకుంది.
ఆ మాటలు వినగానే ఆయన నా తండ్రి అని గుర్తుపట్టి, నేను ఆయన కాళ్ల మీద పడి చాలా సేపు ఏడ్చాను. ‘నాన్న! నేనే నీ కొడుకు శ్రుతదేవుడిని, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు’ అని అడిగాను. దానికి నా తండ్రి కూడా బాధపడి, ‘నాయనా! నీ యాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ పూజ చేసి, దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణుడికి దానమివ్వు. దానివల్ల నాకు, మన వంశం మొత్తానికి ముక్తి కలుగుతుంది’ అని చెప్పారు.
తండ్రి చెప్పినట్టే నేను ఇంటికి వెళ్లి, వైశాఖ మాసంలో నిష్టగా వ్రతం చేసి, దేవుడికి నివేదించిన అన్నాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చాను. దానివల్ల వెంటనే మా తండ్రికి పిశాచరూపం పోయింది. ఆయన దివ్య విమానంలో విష్ణులోకానికి వెళ్తూ, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాజా! అన్ని దానాల్లో అన్నదానం అత్యంత గొప్పది. సర్వ ధర్మాల సారం అన్నదానమే. అన్నాడు. ఈ విషయాన్నే నారద మహర్షి అంబరీష మహారాజుకు వివరించారు.
వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం.
తొమ్మిదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


