వైశాఖ పురాణం 1వ అధ్యాయము
సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నారు: “మహర్షులారా! వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు, బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగాడు: ‘మహర్షీ! మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు.
కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే పనులు (ధర్మాలు) ఏమిటి? మనుషులు చేయాల్సిన దానాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ దేవుడిని పూజించాలి? పూజకు ఏయే వస్తువులు వాడాలి? వీటన్నింటినీ దయచేసి నాకు వివరంగా చెప్పండి’ అని వినయంగా వేడుకున్నాడు.
అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు: “అంబరీషా! విను. పూర్వం నేను కూడా బ్రహ్మదేవుడిని ఈ మాస ధర్మాల గురించి అడిగాను. అప్పుడు బ్రహ్మగారు- విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెబుతుండగా తాను విన్న విషయాలను నాకు చెప్పారు. అవే ఇప్పుడు నీకు చెబుతున్నాను.
అన్ని నెలల్లోనూ కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు చాలా గొప్పవి. ఈ మూడింటిలో మరీ ముఖ్యంగా వైశాఖ మాసం అత్యంత శ్రేష్టమైనది. ఒక తల్లి తన బిడ్డల కోరికలను ఎలా తీరుస్తుందో, వైశాఖ మాసం కూడా ప్రాణుల కోరికలన్నీ అలా తీరుస్తుంది. ఈ నెలలో చేసే స్నానం, పూజ, దానం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో చేసే జపతపాలను దేవతలు కూడా ఎంతో గౌరవిస్తారు.”
విద్యల్లో వేద విద్య, మంత్రాల్లో ఓంకారం, చెట్లలో కల్పవృక్షం, ఆవుల్లో కామధేనువు, పాముల్లో శేషనాగు, పక్షుల్లో గరుత్మంతుడి, దేవతల్లో మహావిష్ణువు, వర్ణాలలో బ్రాహ్మణుడు, ప్రియమైనవాటిలో ప్రాణం, హితులైన వారిలో భార్య, నదుల్లో గంగ, వెలుగునిచ్చే వాటిలో సూర్యుడు, ఆయుధాల్లో సుదర్శన చక్రం, లోహాల్లో బంగారం,భక్తుల్లో శివుడు,రత్నాల్లో కౌస్తుభం లాగా.. నెలలన్నింటిలోనూ వైశాఖ మాసం అంత గొప్పది.
విష్ణువుకు (మాధవుడికి) ఇష్టమైన నెల కాబట్టి దీనిని ‘మాధవ మాసం‘ అని కూడా అంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదిలో లేదా చెరువులో స్నానం చేస్తే.. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఆ భక్తుడిని ఆశీర్వదిస్తారు. ఆకలితో ఉన్నవాడు అన్నం తిని ఎంత సంతోషిస్తాడో, వైశాఖ స్నానం చేసేవారిని చూసి విష్ణుమూర్తి అంతగా ఆనందిస్తాడు. ఈ నెలలో- ఒక్కసారి స్నానం చేసి పూజ చేసినా విష్ణులోకానికి వెళ్తారు. ఒక వారం రోజులు నియమంగా స్నానం చేస్తే, వేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోయినా, ‘స్నానం చేయాలి’ అనే బలమైన కోరిక ఉంటేనే వంద అశ్వమేధ యాగాల పుణ్యం దక్కుతుంది. నదికి వెళ్లి స్నానం చేయాలని బయలుదేరి, మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చినా కూడా విష్ణు సాయుజ్యం లభిస్తుంది.
అంబరీష మహారాజా! వైశాఖ మాసంలో నదులు, చెరువులు, సెలయేర్లలో అన్ని పుణ్య తీర్థాల దేవతలు వచ్చి కొలువై ఉంటారు. మనిషి చేసిన పాపాలు- ఆ మనిషి పవిత్రస్నానం చేసే వరకు అతనిని వదలవు. కానీ ఎప్పుడైతే బయట ఉన్న జలవనరులలో స్నానం చేస్తాడో, ఆ తీర్థ దేవతల శక్తి వల్ల పాపాలన్నీ నశించిపోతాయి. సూర్యోదయం నుంచి ఆరు ఘడియల వరకు సుమారు 2 గంటల 24 నిమిషాలు ఈ దేవతలందరూ ఆ నీటిలోనే ఉంటారు. ఆ సమయంలో స్నానం చేసే వారికి మేలు చేస్తారు. సూర్యోదయం తర్వాత ఆరు ఘడియలు గడిచాక దేవతలు తమ స్థానాలకు వెళ్లిపోతారు. కాబట్టి వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం.
వైశాఖ పురాణం మొదటి అధ్యాయం సమాప్తం.
రెండవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞనాశము కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూరజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత


