పురాణాలు » వైశాఖ పురాణం 16 వ అధ్యాయము
Vaisakha Puranam Chapter 16 Telugu

వైశాఖ పురాణం 16 వ అధ్యాయము

యముని పరాజయము

ఆ సమయంలో నారద మహర్షి యమలోకానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. “యమధర్మరాజా! నీ లోకంలో ఎప్పుడూ నరక బాధలు పడే వారి ఏడుపులు, అరుపులు వినిపిస్తుంటాయి కదా, ఇప్పుడు ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపపుణ్యాల లెక్కలు రాయడం మానేసి ఏదో మునిలాగా మౌనంగా కూర్చున్నాడు ఏంటి? అసలు పాపాలు చేసే మనుషులు నీ లోకానికి రాకపోవడానికి కారణం ఏమిటి?” అని నారదుడు ప్రశ్నించాడు.

అప్పుడు యముడు ఇలా సమాధానమిచ్చాడు. “నారద మహర్షీ! భూలోకంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు అనే రాజు ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆ రాజు తన రాజ్యమంతటా ఒక చాటింపు వేశాడు. ప్రజలందరూ కచ్చితంగా వైశాఖ వ్రతాన్ని పాటించాలని, అలా చేయని వారిని కఠినంగా శిక్షిస్తానని భయపెట్టాడు. దాంతో ప్రజలందరూ భక్తితోనో లేక రాజు పెట్టిన దండన భయంతోనో తప్పకుండా వైశాఖ మాస వ్రతాన్ని, ఆ ధర్మాలను ఆచరిస్తున్నారు. దీనివల్ల వారు చేసిన పాపాలన్నీ నశించిపోయి నేరుగా విష్ణులోకానికి వెళ్లిపోతున్నారు. అందుకే నరకానికి వచ్చే వారు ఎవరూ లేక నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను. నాకు మళ్ళీ నా పాత గౌరవం రావాలి. అందుకే ఆ రాజుపై యుద్ధం ప్రకటించాలని అనుకుంటున్నాను. యజమాని చెప్పిన పని చేయకుండా జీతం తీసుకునే వాడు నరకానికి వెళ్తాడు. బ్రహ్మ దేవుడు నన్ను ఇక్కడ పాపులను శిక్షించడానికి నియమించారు, నేను ఆ పని చేయకుండా ఇలా ఖాళీగా ఉండటం నాకు కూడా పాపమే. ఒకవేళ నేను ఆ రాజును ఓడించలేకపోతే , నేరుగా బ్రహ్మ దేవుడి దగ్గరకు వెళ్లి నేనేం చేయాలో అడుగుతాను” అని యముడు తన బాధను చెప్పుకున్నాడు. నారదుడు “సరే నీ ఇష్టం” అని తన దారిన తాను వెళ్లిపోయాడు.

వెంటనే యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతును ఎక్కి, భయంకరమైన యమదండాన్ని పట్టుకుని, యాభై కోట్ల మంది యమభటులతో కలిసి కీర్తిమంతుడిపై దండెత్తాడు. వచ్చిన వాడు సాక్షాత్తు యముడని తెలిసి కూడా కీర్తిమంతుడు ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యముడికి, రాజుకు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. యముడి సైన్యమైన మృత్యువు, రోగాలు, యమదూతలు రాజు పరాక్రమానికి తట్టుకోలేక పారిపోయారు. యముడు ప్రయోగించిన ఆయుధాలన్నీ కీర్తిమంతుడి అస్త్రాల ముందు పని చేయలేదు. చివరికి యముడు కోపంతో బ్రహ్మాస్త్రంతో మంత్రించిన యమదండాన్ని రాజుపై విసిరాడు. ఆ భయంకరమైన ఆయుధాన్ని చూసి అందరూ హాహాకారాలు చేశారు.

కానీ శ్రీమహావిష్ణువు తన భక్తుడైన కీర్తిమంతుడిని రక్షించడానికి వెంటనే సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం యమదండాన్ని, దానిలోని బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి వెనక్కి తిప్పి యముడి మీదకు దూసుకెళ్లింది. అప్పుడు విష్ణు భక్తుడైన ఆ రాజు సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ.. “ఓ సుదర్శన చక్రమా! నువ్వు లోకాలను రక్షించడానికి విష్ణుమూర్తి ధరించిన ఆయుధానివి. నీకు నమస్కారం. దయచేసి యమధర్మరాజును చంపకు, ఆయనపై కరుణ చూపించు” అని ప్రార్థించాడు. రాజు ప్రార్థన మన్నించిన చక్రం యముడిని విడిచిపెట్టి రాజు దగ్గర నిలబడింది. తన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడం, తనను చంపవద్దని శత్రువు (రాజు) వేడుకోవడం చూసి యముడు ఎంతో అవమానంగా భావించాడు, బాధ పడ్డాడు.

యముడు బ్రహ్మ దేవుడి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు తన సభలో కొలువై ఉన్నాడు. ఆ సభ ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ లోకపాలకులు, దిక్పాలకులు మాత్రమే కాదు.. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ రూపాలు ధరించి అక్కడ ఉన్నాయి. కాలానికి సంబంధించిన క్షణాలు, నిమిషాలు, గడియలు, నెలలు, ఏళ్లు, రుతువులు, యుగాలు కూడా అక్కడ కొలువై ఉన్నాయి. సుఖదుఃఖాలు, భయం, గెలుపు ఓటములు, సత్వ-రజ-తమ గుణాలు వంటివి కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి గొప్ప సభలోకి యమధర్మరాజు ప్రవేశించాడు. నిరంతరం పనితో ఉండే యముడు ఇలా ఎందుకు వచ్చాడు? ఆయన వెంట ఉన్న పాపపుణ్యాల పట్టికలో అన్నీ కొట్టివేతలు ఎందుకు ఉన్నాయి? అని సభలోని వారు ఆశ్చర్యపోయారు.

యముడు వెళ్ళి బ్రహ్మ దేవుడి పాదాల మీద పడి ఏడుస్తూ.. “స్వామీ! నన్ను రక్షించు. అందరినీ ఏడిపించే నేను ఈరోజు పరాభవం పాలయ్యాను. చిత్రగుప్తుడు రాసిన పాపాలను నేనే కొట్టివేయవలసి వస్తోంది. ప్రజలందరూ వైశాఖ వ్రతం చేసి విష్ణులోకానికి వెళ్లిపోతున్నారు, నేను ఇక్కడ పని లేకుండా ఉన్నాను” అని బాధపడ్డాడు. అప్పుడు వాయుదేవుడు ముందుకు వచ్చి బ్రహ్మ పాదాలపై పడి ఉన్న యముడిని లేవదీసి, ఓదార్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. “యమధర్మరాజా! నిన్ను ఇంతలా అవమానించింది ఎవరు? నీ పనికి అడ్డుపడింది ఎవరు? ఆ పాపపుణ్యాల లెక్కలను తుడిచేసింది ఎవరు? వివరంగా చెప్పు. మనందరికీ ప్రభువు ఒక్కడే ఉన్నాడు, భయపడకుండా చెప్పు” అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు చాలా దీనంగా జరిగినదంతా చెప్పడం మొదలుపెట్టాడు.

వైశాఖ పురాణం పదహారవ అధ్యాయం సంపూర్ణం.

పదిహేడవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:

1వ అధ్యాయం – వైశాఖమాస ప్రశంస

2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి  ఫలితములు

3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు

4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస

5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత

6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ

7వ అధ్యాయం – వైశాఖమాస  దానములు

8వ అధ్యాయం – పిశాచ మోక్షము

9వ అధ్యాయం – సతీ దేహత్యాగము

10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము

11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు

12వ అధ్యాయం – కుమార జననము

13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము

14వ అధ్యాయం – ఛత్రదాన మహిమ

15వ అధ్యాయం – వైశాఖవ్రత మహిమ

16వ అధ్యాయం – యముని పరాజయము

17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము

18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట

19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి

20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి

21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము

22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి

23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ

24వ అధ్యాయం – వాయుశాపము

25వ అధ్యాయం – భాగవత ధర్మములు

26వ అధ్యాయం – వాల్మీకి జన్మ

27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి

28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత

29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి

30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి

శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top