వైశాఖ పురాణం 18 వ అధ్యాయము
విష్ణువు యముని ఊరడించుట
యముడు పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు, “యమధర్మరాజా! నువ్వు దీనికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? శ్రీహరి నామం ఎంత శక్తివంతమైందో నీకు తెలియదా? ఒక్కసారి “శ్రీహరీ” అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు.. వంద అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా పుణ్యం అయిపోయాక మళ్ళీ జన్మించాల్సిందే, కానీ విష్ణువుకు నమస్కరిస్తే పునర్జన్మ ఉండదు. మరణకాలంలో ఆయన్ని స్మరించినా చాలు, ఎలాంటి పాపి అయినా విష్ణులోకానికి వెళ్తాడు. అటువంటి విష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షం పొందడంలో వింతేముంది?
అంతేకాదు, “ఒక అధికారి తన శక్తి కొలది పనిచేసి కూడా ఆ పని పూర్తి చేయలేకపోతే అతనికి నరకం రాదు. తన వల్ల కానప్పుడు ఆ విషయాన్ని యజమానికి చెబితే అతనికి ఎలాంటి దోషం ఉండదు. కీర్తిమంతుడు విష్ణు భక్తుడు, అతన్ని శిక్షించే శక్తి నాకు కూడా లేదు” అని బ్రహ్మ స్పష్టం చేశారు. అప్పుడు యముడు.. “స్వామీ! మీ మాట విన్నాను, ఆ కీర్తిమంతుడు వైశాఖ వ్రతాలు చేయిస్తూ భూమిని పాలిస్తుంటే నా అధికారం సాగదు. ఆ రాజు ఈ వ్రతాన్ని మానుకునేలా ఏదైనా ఉపాయం చెప్పండి” అన్నాడు.
బ్రహ్మదేవుడు యముడిని వెంటబెట్టుకుని క్షీరసముద్రం దగ్గర ఉన్న శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళారు. అక్కడ విష్ణుమూర్తిని స్తుతించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. యముడి ముఖం వాడిపోయి ఉండటం చూసి విష్ణువు కారణం అడిగారు. బ్రహ్మ గారు జరిగిందంతా వివరించి, “స్వామీ! నీ భక్తుడైన కీర్తిమంతుడి వల్ల యమలోకం ఖాళీ అయిపోయింది. యముడికి పరాభవం జరిగింది. నీ భక్తుడిని శిక్షించే శక్తి మాకు లేదు, నువ్వే ఈ సమస్యను తీర్చి యముడిని కాపాడు” అని వేడుకున్నారు.
అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ.. “నేను నా భార్య లక్ష్మీదేవినైనా, నా ప్రాణాలనైనా, వైకుంఠాన్నైనా వదులుకుంటాను కానీ నా భక్తుడిని మాత్రం వదులుకోను. నా మీద ఆధారపడిన భక్తుడిని నేను ఎలా శిక్షిస్తాను? అయితే యమధర్మరాజా! నీ బాధ పోవడానికి ఒక ఉపాయం చెబుతాను విను. కీర్తిమంతుడికి నేను పదివేల సంవత్సరాల ఆయుష్షు ఇచ్చాను. అందులో ఎనిమిదివేల ఏళ్లు గడిచిపోయాయి. అతని తర్వాత ‘వేనుడు’ అనే దుర్మార్గుడు రాజు అవుతాడు. వాడు అన్ని ధర్మాలను, వైశాఖ వ్రతాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నీకు మళ్ళీ చాలా పని దొరుకుతుంది, అప్పటివరకు ఓపిక పట్టు” అని చెప్పారు.
అంతేకాకుండా యముడిని సంతోషపెట్టడానికి విష్ణువు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. “వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజూ నీకు కూడా భాగం ఇచ్చేలా చేస్తాను. స్నానం చేసినప్పుడు నీకు ‘అర్ఘ్యం’ ఇవ్వాలి. వ్రతం చివరలో నీ పేరుతో నీటితో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని దానం చేయాలి. అలా నీకు భాగం ఇవ్వని వారి వ్రతం వ్యర్థమవుతుంది. అప్పుడు వారు నీ లోకానికే వస్తారు” అని చెప్పారు. ఈ విషయం చెప్పడానికి తన దూత అయిన సునందుడిని కీర్తిమంతుడి దగ్గరకు పంపారు. కీర్తిమంతుడు కూడా ఆ మాటలకు ఒప్పుకున్నాడు.
దీనివల్ల యమధర్మరాజు శాంతించి తన లోకానికి వెళ్ళాడు. అప్పటి నుండి వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు యముడిని తలుచుకుని అర్ఘ్యం ఇవ్వడం, పూర్ణిమ రోజున యముడి కోసం జల కలశం, పెరుగన్నం దానం చేయడం ఆచారమైంది. కీర్తిమంతుడు పదివేల ఏళ్లు పాలించి విష్ణులోకానికి వెళ్ళాక, వేనుడు రాజు కావడంతో వైశాఖ ధర్మాలు లోకంలో కనుమరుగయ్యాయి.
చివరిగా శ్రుతదేవుడు ఒక విషయం చెప్పారు.. “రాజా! ఒక కల్పంలో వేనుడు దుర్మార్గుడుగా ఉండవచ్చు, మరో కల్పంలో మంచివాడుగా ఉండవచ్చు. కాలాన్ని బట్టి కథలు మారినా, మనం గ్రహించాల్సింది కీర్తిమంతుడి గొప్పతనం, వేనుడి దుష్టత్వం మాత్రమే.” ఈ విధంగా నారదుడు అంబరీషుడికి వైశాఖ పురాణ విశిష్టతను ముగించారు.
వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం.
పందొమ్మిదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


