వైశాఖ పురాణం 20 వ అధ్యాయము
పిశాచత్వ విముక్తి
నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస గొప్పతనాన్ని వివరిస్తూ పురుయశుడు అనే రాజు కథను ఇలా చెప్పారు.
పూర్వం పాంచాల దేశంలో పుణ్యశీలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు పురుయశుడు. తండ్రి తర్వాత పురుయశుడు రాజయ్యాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, ధర్మబద్ధంగా పాలించేవాడు. కానీ, తన పూర్వజన్మ పాపాల వల్ల అనుకోకుండా ఆయన సంపదనంతా కోల్పోయాడు. గుర్రాలు, ఏనుగులు, సైన్యం అంతా నశించిపోయాయి. చివరకు రాజ్యం కూడా శత్రువుల పాలైపోయింది. దాంతో ఆయన తన భార్య శిఖినితో కలిసి ఒక పర్వత గుహలో దాక్కుని ఏకంగా 53 ఏళ్ల పాటు అడవుల్లోనే గడిపాడు.
“నేను మంచి వంశంలో పుట్టాను, అందరినీ గౌరవించాను, ఎప్పుడూ దేవుడిని నమ్మాను.. మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి?” అని ఆయన తన గురువులైన యాజుడు, ఉపయాజుడు అనే వారిని తలచుకున్నాడు. ఆయన తలచుకోగానే ఆ మునులు అక్కడికి వచ్చారు.
రాజు తన బాధను చెప్పుకోగా, ఆ మునులు కాసేపు ధ్యానం చేసి ఇలా చెప్పారు: “రాజా! నీ కష్టాలకు కారణం నీ పూర్వజన్మలే. పది జన్మల క్రితం నువ్వు చాలా క్రూరమైన వేటగాడివి. నీలో ఏనాడూ దయ ఉండేది కాదు, దేవుడిని నమ్మలేదు. గత జన్మలో సహ్య పర్వతం మీద ఉంటూ బాటసారులను దోచుకుంటూ బతికావు. అడవిలో జంతువులను, పక్షులను, చివరకు పసిబిడ్డలను కూడా చంపేవాడివి. ఆ పాపం వల్లే నీకు ఇప్పుడు సంతానం లేదు, శత్రువుల వల్ల ఈ భయం కలిగింది.”
మరి కిరాతుడిగా అంత పాపం చేసిన వాడు ఈ జన్మలో రాజుగా ఎలా పుట్టాడు? దానికి మునులు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు: “నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒకసారి అడవిలో ఇద్దరు వైశ్యులను, కర్షణుడు అనే మునిని చూశావు. నువ్వు వారిని అడ్డగించి ఒక వైశ్యుడిని చంపావు. రెండో వాడు భయంతో తన ధనాన్ని పొదల్లో దాచి పారిపోయాడు. కర్షణ మహాముని కూడా నీకు భయపడి పరిగెత్తి, ఎండ వేడికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు.
నిజానికి నువ్వు ఆ ముని మీద జాలితో సేవ చేయలేదు. ఆ వైశ్యుడు డబ్బు ఎక్కడ దాచాడో మునిని అడిగి తెలుసుకోవాలని ఆయన మొహం మీద నీళ్లు చల్లి, ఆకులతో విసిరి సేదతీర్చావు. ఆయన తెలివిలోకి వచ్చాక ‘డబ్బు ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే చంపేస్తాను’ అని బెదిరించావు. ఆయన ప్రాణభయంతో ఆ డబ్బున్న చోటు చూపించాడు. ఆ తర్వాత నువ్వు ఆయనకు అడవి నుండి బయటకు వెళ్లే దారి, నీళ్లు దొరికే చెరువు చూపించి, ‘ఈ మోదుగ ఆకులతో విసురుకో, చల్లగా ఉంటుంది’ అని ఇచ్చి పంపావు.
నువ్వు ఆ మునికి సేవ చేసింది నీ స్వార్థం కోసమే అయినా.. ఆ సమయం వైశాఖ మాసం అవ్వడం వల్ల, ఆ చిన్న సేవ నీకు అపారమైన పుణ్యాన్ని ఇచ్చింది. ఆ పుణ్యం వల్లే నువ్వు ఈ జన్మలో రాజ వంశంలో పుట్టావు.”
“నీ కష్టాలు తీరి, పోయిన రాజ్యం మళ్ళీ రావాలంటే ఇప్పుడు వైశాఖ వ్రతం చెయ్యి. ఒక ఆవును దూడతో సహా దానం ఇవ్వు. గొడుగు దానం చెయ్యి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణువును పూజించు” అని మునులు సలహా ఇచ్చి వెళ్లిపోయారు.
పురుయశుడు గురువులు చెప్పినట్టే భక్తితో వైశాఖ వ్రతం, దానధర్మాలు చేశాడు. ఆ వ్రత ప్రభావంతో ఆయన బంధువులందరూ మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చారు. శత్రువులు భయంతో రాజ్యాన్ని వదిలి పారిపోయారు. రాజు తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా, కుమారస్వామి అంతటి సమర్థులైన ఐదుగురు కొడుకులను (ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు) పొందాడు.
రాజ్యం వచ్చినా రాజు గర్వపడకుండా ప్రతి ఏటా వైశాఖ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, వైశాఖ శుద్ధ తృతీయ (అక్షయ తృతీయ) నాడు లక్ష్మీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని చూసి పురుయశుడు ఆనందంతో పులకించిపోయి భక్తితో స్తుతించాడు.
వైశాఖ పురాణం ఇరవయ్యవ అధ్యాయం సంపూర్ణం.
ఇరవై ఒకటవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


