పురాణాలు » వైశాఖ పురాణం 14 వ అధ్యాయము
Vaisakha Puranam Chapter 14 Chatra Danam

వైశాఖ పురాణం 14 వ అధ్యాయము

ఛత్రదాన మహిమ

శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో ఇలా వివరించారు: “వైశాఖ మాసంలో ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు లేదా గొప్ప వారికి ఎండ తగలకుండా గొడుగులు దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను విను.

పూర్వం కృతయుగంలో వంగ దేశాన్ని కుశకేతువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు హేమకాంతుడు గొప్ప వీరుడు. ఒకసారి వేటకు వెళ్లిన హేమకాంతుడు అడవిలో అడవి పందులను, ఇతర జంతువులను చాలా వేటాడి బాగా అలసిపోయాడు. విశ్రాంతి కోసం దగ్గరలో ఉన్న ‘శతర్చి’ అనే మునుల ఆశ్రమమునకు వెళ్లాడు. ఆ మునులు అప్పుడు గాఢమైన తపస్సులో ఉన్నారు. ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలకరించాడు, కానీ వారు సమాధానం ఇవ్వలేదు. తనను ఆదరించలేదన్న కోపంతో వారిని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న ముని శిష్యులు వచ్చి, ‘రాజకుమారా! ఆగండి, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు, అందుకే మిమ్మల్ని పలకరించలేదు. వారి మీద కోపపడటం తప్పు’ అని చెప్పారు.

అప్పుడు హేమకాంతుడు, ‘మీ గురువులు తపస్సులో ఉంటే ఉన్నారు, అలసిపోయిన నాకు మీరైనా ఆతిథ్యం ఇవ్వండి’ అని కోపంగా అడిగాడు. దానికి వారు ‘మేము భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నాన్ని తింటాము, మా గురువుల అనుమతి లేకుండా మీకు ఆతిథ్యం ఇవ్వలేము’ అని బదులిచ్చారు. దీనికి హేమకాంతుడు మరింత కోపంతో ఊగిపోయి, ‘దొంగల నుండి, క్రూర జంతువుల నుండి మిమ్మల్ని కాపాడే రాజులం మేము. మేమిచ్చిన భూములు, సౌకర్యాలు అనుభవిస్తూ మాకే ఎదురు చెబుతారా?’ అని వారిపై బాణాలు వేసి కొంతమందిని చంపేశాడు. మిగిలిన వారు భయంతో పారిపోగా, రాజభటులు ఆశ్రమాన్ని దోచుకుని పాడు చేశారు.

హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్లాక, జరిగిన విషయం తెలుసుకున్న తండ్రి కుశకేతువు చాలా ఆగ్రహించాడు. ‘ఇంతటి పాపం చేసిన నువ్వు రాజుగా ఉండటానికి అర్హుడివి కావు’ అని కొడుకును దేశం నుండి వెళ్లగొట్టాడు. అలా హేమకాంతుడు అడవుల పాలై ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు వేటగాడిగా బతికాడు. బ్రహ్మహత్యా దోషం వల్ల ఎక్కడా ప్రశాంతత లేకుండా అడవుల వెంట తిరుగుతూ కాలం గడిపాడు.

ఒకసారి వైశాఖ మాసంలో త్రితుడు అనే ముని ఆ అడవి దారిలో ప్రయాణిస్తున్నాడు. తీవ్రమైన ఎండ వేడికి, దాహానికి తట్టుకోలేక ఆ ముని స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసిన హేమకాంతుడికి జాలి కలిగింది. వెంటనే మోదుగ ఆకులను తెచ్చి గొడుగులా తయారు చేసి ఎండ తగలకుండా మునిపై ఉంచాడు. తన దగ్గర సొరకాయ బుర్రలో ఉన్న కొన్ని నీళ్లను జల్లి ఆయనను సేదతీర్చాడు. ఆ నీళ్లు తాగి, మోదుగాకుల గొడుగు పట్టుకున్న ఆ ముని ఎండ బాధ నుండి బయటపడి సురక్షితంగా గ్రామానికి చేరుకున్నాడు. హేమకాంతుడు తెలిసి వ్రతం చేయకపోయినా, కేవలం జాలితో ఆ మునికి వైశాఖంలో గొడుగును, నీటిని ఇవ్వడం వల్ల అతని పాపాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి.

కొంత కాలానికి హేమకాంతుడు జబ్బు పడ్డాడు. భయంకరంగా ఉన్న యమదూతలు అతని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు. వారిని చూసి హేమకాంతుడు భయపడిపోయాడు. అయితే వైశాఖంలో గొడుగును, నీటిని ఇచ్చిన పుణ్యం వల్ల అతనికి విష్ణువు మీద స్మృతి కలిగి ఆయనను ప్రార్థించాడు. దయానిధి అయిన శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రి అయిన విష్వక్సేనుడిని పిలిచి, ‘నువ్వు వెళ్లి యమదూతలను ఆపి హేమకాంతుడిని రక్షించు. అతడు వైశాఖ ధర్మాన్ని పాటించి నాకు ఇష్టమైన వాడయ్యాడు. గతంలో తప్పులు చేసినా, ఒక మునికి గొడుగును, నీటిని ఇచ్చి కాపాడిన పుణ్యం వల్ల అతను పవిత్రుడయ్యాడు. అతడు చిరంజీవిగా, శౌర్యవంతుడిగా ఉంటాడు. వెళ్లి అతని తండ్రికి అప్పగించి, అతడినే రాజును చేయమని చెప్పు’ అని పంపాడు.

విష్వక్సేనుడు వచ్చి యమదూతలను పంపివేసి, హేమకాంతుడిని తన తండ్రి కుశకేతువు వద్దకు తీసుకువెళ్లాడు. విష్ణుమూర్తి చెప్పిన విషయాలను విని కుశకేతువు ఎంతో సంతోషించి తన కొడుకును తిరిగి స్వీకరించాడు. కొడుకుకు పట్టాభిషేకం చేసి, తాను భార్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లాడు. రాజు అయిన హేమకాంతుడు ఆ తర్వాత ప్రతి ఏటా వైశాఖ వ్రతాన్ని, దానాలను ఎంతో భక్తితో చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. అన్ని యజ్ఞాలు చేసి, అపారమైన సంపదలతో సుఖంగా గడిపి, చివరికి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. చూశావా శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మాలు అంత గొప్పవి. అవి చాలా సులభంగా చేయదగ్గవి, పాపాలను దహించి ముక్తిని ఇచ్చేవి” అని శ్రుతదేవ మహాముని వివరించారు. ఈ కథను నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేశారు.

వైశాఖ పురాణం పదునాలుగవ అధ్యాయం సంపూర్ణం.

పదిహేనవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:

1వ అధ్యాయం – వైశాఖమాస ప్రశంస

2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి  ఫలితములు

3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు

4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస

5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత

6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ

7వ అధ్యాయం – వైశాఖమాస  దానములు

8వ అధ్యాయం – పిశాచ మోక్షము

9వ అధ్యాయం – సతీ దేహత్యాగము

10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము

11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు

12వ అధ్యాయం – కుమార జననము

13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము

14వ అధ్యాయం – ఛత్రదాన మహిమ

15వ అధ్యాయం – వైశాఖవ్రత మహిమ

16వ అధ్యాయం – యముని పరాజయము

17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము

18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట

19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి

20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి

21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము

22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి

23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ

24వ అధ్యాయం – వాయుశాపము

25వ అధ్యాయం – భాగవత ధర్మములు

26వ అధ్యాయం – వాల్మీకి జన్మ

27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి

28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత

29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి

30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి

శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top