వైశాఖ పురాణం 2వ అధ్యాయము
నారద మహర్షి అంబరీష మహారాజుతో మళ్ళీ ఇలా అన్నారు: “రాజా! విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది కాబట్టి వైశాఖ మాసాన్ని ‘మాధవ మాసం’ అని పిలుస్తారు. లోకంలో దీనికి సాటివచ్చేది ఏదీ లేదు.
నెలల్లో వైశాఖ మాసం లాంటిది మరొకటి లేదు. యుగాల్లో కృతయుగం కంటే గొప్పది లేదు. దానాల్లో నీటిని దానం (జల దానం) చేయడం కంటే మించినది లేదు. సుఖాల్లో భార్య ద్వారా కలిగే సుఖం, సంపదలో వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బు, లాభాల్లో ప్రాణాలతో జీవించి ఉండటం అనే లాభం సాటిలేనివి. తపస్సులో ఉపవాసం మించినది లేదు. సంతోషంలో దానం చేయడం వల్ల వచ్చే తృప్తి, ధర్మంలో దయ, వెలుగులో కన్ను, తృప్తిలో భోజనం గొప్పవి. వ్యాపారంలో వ్యవసాయం, స్నేహితుల్లో ధర్మం, కీర్తిలో సత్యం, అభివృద్ధిలో ఆరోగ్యం మరియు రక్షకులలో మహావిష్ణువు సాటిలేని వారు.
శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో వ్రతాన్ని పాటించకుండా కాలాన్ని వృథా చేసేవాడు ధర్మాన్ని కోల్పోతాడు. అంతేకాదు, తరువాతి జన్మలో పశువుగానో, పక్షిగానో పుడతాడు. ఒక వ్యక్తి ఎన్ని చెరువులు తవ్వించినా, ఎన్ని యజ్ఞాలు చేసినా.. వైశాఖ వ్రతాన్ని మాత్రం చేయకపోతే ఆ పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి. చాలా వ్రతాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి లేదా శరీరాన్ని కష్టపెట్టేవిగా ఉంటాయి. అవి కేవలం తాత్కాలిక ఫలితాలనే ఇస్తాయి కానీ ముక్తిని ఇవ్వవు. కానీ, వైశాఖ మాసంలో నియమంగా పొద్దున్నే చేసే స్నానం పునర్జన్మ లేకుండా చేస్తుంది. అన్ని దానాల వల్ల వచ్చే పుణ్యం, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం.. ఒక్క వైశాఖ మాసంలో నీటిని దానం చేయడం వల్ల వస్తుంది. ఒకవేళ నీటిని దానం చేసే శక్తి లేకపోయినా, ఇంకొకరిని దానం చేయమని ప్రోత్సహించినా కూడా అపారమైన సంపదలు, మేలు కలుగుతాయి. అన్ని దానాల కంటే జల దానమే గొప్పది.
బాటసారుల దాహం తీర్చడానికి దారిలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే, వారి వంశంలోని వారందరికీ పుణ్యలోకాలు కలుగుతాయి. దీనివల్ల మనుషులే కాదు- దేవతలు, పితృదేవతలు కూడా సంతోషించి వరం ఇస్తారు. ఎండలో అలసిపోయిన వారికి నీరు, నీడ, విసనకర్ర అవసరం. అందుకే వైశాఖంలో గొడుగులు, విసనకర్రలు, నీటితో నిండిన కుండలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేయనివారు ‘చాతక పక్షి’గా పుడతారు (ఆ పక్షి భూమి మీద నీటిని తాగలేదు, కేవలం వాన చినుకుల కోసమే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది).
ఎండకు అలసివచ్చిన వారికి విసనకర్రతో విసిరితే రాజసూయ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. విసనకర్ర లేకపోతే కనీసం తన పైబట్టతో విసిరినా పాపాలు పోతాయి. తాటాకు విసనకర్రను దానం ఇస్తే బ్రహ్మలోకం లభిస్తుంది. గొడుగును దానం చేయడం వల్ల అన్ని రకాల మానసిక, శారీరక బాధలు తొలగిపోతాయి. ఇది దానం ఇవ్వనివాడు పిశాచంలా మారి నీడ లేక ఇబ్బంది పడతాడు.
చెప్పులను దానం ఇచ్చేవాడు యమదూతలను ఎదిరించి మరీ విష్ణులోకానికి వెళ్తాడు. ఈ లోకంలో కూడా అతనికి ఎలాంటి కష్టాలు ఉండవు. అడిగిన వారికి చెప్పులు దానం ఇస్తే, వచ్చే జన్మల్లో రాజు అవుతాడు. బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు కట్టించేవారి పుణ్యాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా లెక్కించలేడు.
మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే అనంతమైన పుణ్యం వస్తుంది. ఆకలితో ఉన్నవాడికి పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, బట్టలు ఏవీ గుర్తుకు రావు.. కేవలం అన్నం మాత్రమే కావాలి. ఆకలి తీరిన తర్వాతే మిగతావన్నీ గుర్తుకు వస్తాయి. అందుకే అన్నం అనేది అన్నింటికంటే ముఖ్యమైనది. అన్నదానం చేసేవాడు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. కన్నవారు కేవలం జన్మనిస్తారు కానీ, అన్నదాత ప్రాణాన్ని నిలబెట్టి జీవితాన్ని ఇస్తాడు. అన్నదాత అంటే సాక్షాత్తు అన్ని తీర్థాలూ, దేవతలూ, ధర్మాల స్వరూపం. వైశాఖంలో ఈ దానాలు చేయని వారు పిశాచాలుగా మారి, ఆహారం దొరకక తమ మాంసాన్ని తామే తింటూ నరకయాతన అనుభవిస్తారు. కాబట్టి శక్తి కొద్దీ ప్రతి ఒక్కరూ అన్నదానాదులు చేయాలి.
వైశాఖ పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం.
మూడవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


