వైశాఖ పురాణం 17 వ అధ్యాయము
యమదుఃఖ నిరూపణము
వాయుదేవుడు చేసిన ఉపచారాలతో కొంచెం తేరుకున్న యముడు, బ్రహ్మదేవుడితో తన మనసులోని బాధను ఇలా చెప్పుకున్నాడు.
“స్వామీ! లోకపితామహా! నా మాట వినండి. నేను నా కర్తవ్యాన్ని చేయకుండా అడ్డుకోబడ్డాను. నా పని నేను చేయలేకపోవడం నాకు మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తోంది. శాస్త్రాల ప్రకారం.. ఒక అధికారి యజమాని దగ్గర జీతం తీసుకుంటూ, తన బాధ్యతను సరిగ్గా నెరవేర్చకపోతే అతనికి వచ్చే జన్మలో ‘కొయ్యపురుగు’ వంటి నీచ జన్మలు వస్తాయి. యజమాని సొమ్ముతో బతుకుతూ, తన తెలివితేటలతో పనిని ఎగ్గొట్టేవాడు వందల కల్పాల పాటు నరకంలో ఉండి ఆ తర్వాత జంతువుగా పుడతాడు. పని చేయగలిగే శక్తి ఉండి కూడా ఇంట్లో ఖాళీగా కూర్చునే వాడు పిల్లిగా పుడతాడు. యజమాని చెప్పిన పనిని పాడు చేసేవాడు ఎలుకగా పుట్టి శిక్ష అనుభవిస్తాడు.”
“ప్రభూ! మీ ఆజ్ఞ ప్రకారం నేను ప్రాణుల పాపపుణ్యాలను లెక్క కట్టి, వారికి తగిన శిక్షలు వేస్తూ ధర్మబద్ధంగా పాలిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ కీర్తిమంతుడు అనే రాజు వల్ల నేను నా పని చేయలేకపోతున్నాను. ఆ రాజు తన భూమండలమంతా వైశాఖ మాస వ్రతాన్ని తప్పనిసరి చేశాడు. దీనివల్ల పెద్దలను గౌరవించని వారు, తీర్థయాత్రలు చేయని వారు, చివరకు భయంకరమైన పాపాలు చేసిన వారు కూడా కేవలం ఈ వ్రతం చేయడం వల్ల పవిత్రులైపోతున్నారు. వారు ఒక్కరే కాదు.. వారి తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు.. ఇలా 26 తరాల వారు నరకం నుండి తప్పించుకుని విష్ణు లోకానికి వెళ్లిపోతున్నారు. చివరకు వారి భార్య వైపు వారు, ఇతర బంధువులు కూడా విష్ణులోకానికి చేరుకుంటున్నారు. నేను రాసిన పాపాల పట్టికలన్నీ కొట్టివేయబడుతున్నాయి.
స్వామీ! లోకంలో యజ్ఞాలు చేసినా, తీర్థయాత్రలకు వెళ్లినా, యుద్ధంలో వీరమరణం పొందినా లేక కాశీ వంటి క్షేత్రాల్లో ప్రాణాలు విడిచినా ఇంతటి పుణ్యం రాదు. కానీ వైశాఖంలో పొద్దున్నే స్నానం చేసి, విష్ణువును పూజించి, కథలు విని దానాలు చేస్తే చాలు.. పాపాత్ములు కూడా చాలా సులభంగా వైకుంఠానికి వెళ్లిపోతున్నారు. ఇది నాకు అస్సలు నచ్చడం లేదు. అందరూ ఇలాగే వెళ్తే స్వర్గం, నరకం రెండూ ఖాళీ అయిపోతాయి.
మీ ఆజ్ఞను పాటిస్తున్న నా పనిని అడ్డుకున్న ఆ రాజు మీకు కూడా శత్రువే కదా! అతడిని మీరు శిక్షించాల్సిందే. ఇదిగో.. నా పాపపుణ్యాల పట్టిక, నా యమదండం.. వీటిని మీ పాదాల దగ్గరే పెట్టేస్తున్నాను. మేఘాల్లో మెరుపు ఎలాగో, నా జన్మ కూడా అలాగే నిరర్థకమైపోయింది.
కానీ ఆ కీర్తిమంతుడిని కన్న తల్లి నిజంగా ‘వీరమాత’. నా రాతనే మార్చేసి, జనులందరినీ విష్ణులోకానికి పంపిస్తున్న కొడుకుని కన్నది ఆమె. ఇంతవరకు నా వ్రాతను మార్చగలిగిన వారు ఎవరూ లేరు, కానీ ఈ రాజు అది చేసి చూపించాడు” అని యముడు తన ఆవేదనను బ్రహ్మ ముందు వెళ్లగక్కాడు.
వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం.
పద్దెనిమిదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


