వైశాఖ పురాణం 28వ అధ్యాయము
నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ విశిష్టతను ఈ విధంగా వివరించారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో చెబుతూ.. వైశాఖ శుద్ధ తృతీయ అనేది సర్వ పాపాలను హరించి, శ్రీహరి సాన్నిధ్యాన్ని ప్రసాదించే గొప్ప తిథి అని పేర్కొన్నారు. ఈ రోజున దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు చేసే తర్పణాలు వారికి ఎంతో తృప్తిని కలిగిస్తాయి. ఈ తిథి నాడు చేసే దానం ‘అక్షయం’ అవుతుంది, అంటే అది ఎప్పటికీ తరిగిపోని ఫలితాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన తిథికి ఇంతటి మహిమ రావడానికి వెనుక ఒక పురాతన గాథ ఉంది.
పూర్వం ఇంద్రుడు బలిచక్రవర్తిని పాతాళంలో ఓడించి తిరిగి వస్తూ, దారిలో ఉతథ్య మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అక్కడ గర్భవతిగా ఉన్న ముని భార్యను చూసి మోహించి, ఆమెను బలాత్కారం చేశాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న పిండము ఇంద్రుడిని లోనికి రానీయకుండా పాదాన్ని అడ్డుపెట్టింది. దీనికి ఆగ్రహించిన ఇంద్రుడు ఆ పిండాన్ని ‘గుడ్డివాడివి కమ్మని’ శపించాడు. ఆ బాలుడే తర్వాత దీర్ఘతపుడు అనే పేరుతో పుట్టుగుడ్డిగా జన్మించాడు. అయితే ముని వస్తే తనను శపిస్తాడనే భయంతో ఇంద్రుడు అక్కడి నుండి పారిపోయి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు. ఇంద్రుడు లేని సమయం చూసి బలిచక్రవర్తి దేవలోకాన్ని ఆక్రమించాడు. దిక్కుతోచని దేవతలు తమ గురువు బృహస్పతిని వేడుకున్నారు.
బృహస్పతి దేవతలను వెంటబెట్టుకుని మేరు పర్వత గుహ వద్దకు వెళ్లి ఇంద్రుడిని కలిశాడు. ఇంద్రుడు తన పాపాన్ని ఒప్పుకుని, శక్తిహీనుడనై ఉన్నానని చెప్పాడు. అప్పుడు బృహస్పతి ఒక ఉపాయం చెప్పాడు. ప్రస్తుతం శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాసం జరుగుతోందని, అందులోనూ వచ్చే అక్షయ తృతీయ నాడు స్నాన, దానాదులు చేస్తే ఇంద్రుడి పాపం తొలగిపోయి పూర్వపు శక్తి తిరిగి వస్తుందని వివరించాడు. ఇంద్రుడు ఆ రోజున భక్తితో శ్రీహరిని పూజించి, వ్రతాన్ని ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో ఇంద్రుడు మళ్ళీ మహా బలవంతుడై బలిచక్రవర్తిని ఓడించి అమరావతిని దక్కించుకున్నాడు.
దీనివల్ల దేవతలకు యజ్ఞ భాగాలు, మునులకు ప్రశాంతత, పితృదేవతలకు పిండ ప్రదానాలు మళ్ళీ దక్కాయి. అందుకే అక్షయ తృతీయ అందరికీ సంతోషాన్ని, ముక్తిని ఇచ్చే తిథిగా ప్రసిద్ధి చెందిందని శ్రుతదేవుడు వివరించాడు. ఈ తిథి నాడు చేసే ఏ చిన్న సత్కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని నారద మహర్షి అంబరీషుడికి తెలియజేశారు.
వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
ఇరవై తొమ్మిదవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


