వైశాఖ పురాణం 30వ అధ్యాయము
నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో వైశాఖ మాసపు ముగింపు రోజులను గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. వైశాఖ శుక్లపక్షంలో వచ్చే చివరి మూడు తిథులు అంటే త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలను కలిపి ‘పుష్కరిణి’ అని పిలుస్తారు. ఈ మూడు రోజులు సర్వ పాపాలను హరించి, సకల శుభాలను కలిగిస్తాయి. ఒకవేళ నెలంతా వైశాఖ వ్రతాన్ని ఆచరించలేకపోయిన వారు, ఈ మూడు రోజుల్లో నియమ నిష్ఠలతో స్నాన, దానాదులు చేసినా సరే.. నెలంతా వ్రతం చేసినంత పుణ్యం లభిస్తుంది. త్రయోదశి నాడు సకల దేవతలు జలాల్లో కొలువై ఉంటారు, చతుర్దశి నాడు అన్ని యజ్ఞాలు ఆ తిథిలో ఉంటాయి, ఇక పూర్ణిమ నాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆవహించి ఉంటాడు. అందుకే ఈ మూడు తిథులు అంత ప్రశస్తమైనవి. బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలు చేసిన వారు కూడా ఈ రోజుల్లో పవిత్రులవుతారని పెద్దలు చెబుతారు.
ఈ మూడు తిథులకు ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం క్షీరసాగర మథనం. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు ఏకాదశి నాడు అమృతం పుట్టింది, ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆ అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడారు, త్రయోదశి నాడు దేవతలకు అమృతాన్ని పంచారు, చతుర్దశి నాడు రాక్షసులను సంహరించారు, ఇక పూర్ణిమ నాడు దేవతలు తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. దీనివల్ల సంతృప్తి చెందిన దేవతలు, ఈ మూడు రోజులు ఎవరైతే వైశాఖ స్నానం చేస్తారో వారికి సకల సంపదలు, మోక్షం లభిస్తుందని వరం ఇచ్చారు. అయితే ఈ రోజుల్లో పొరపాటున కూడా వేడినీటితో స్నానం చేయకూడదు, అలా చేస్తే నరక బాధలు తప్పవు. పితృదేవతలకు, గురువులకు, దేవతలకు పెరుగన్నం దానం చేయని వారు పిశాచాలై పుడతారని దేవతలు కట్టడి చేశారు.
ఈ ‘అంత్య పుష్కరిణి’ రోజుల్లో భగవద్గీత పఠించినా, విష్ణు సహస్రనామాలను చదివినా వచ్చే పుణ్యం ఇంత అని చెప్పలేము. ప్రతిరోజూ అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. పూర్ణిమ నాడు శ్రీహరికి పాలతో అభిషేకం చేసిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు. అలాగే ఈ మూడు రోజుల్లో భాగవతాన్ని కొద్దిగా చదివినా సరే బ్రహ్మ పదవి లభిస్తుంది. లోకంలోని మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలన్నీ కూడా మనుషుల పాపాలను కడిగి తాము కల్మషమైపోయామని విష్ణుమూర్తిని వేడుకోగా.. ఆయన ‘అంత్య పుష్కరిణి’ కాలంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి మీ కల్మషాలను పోగొట్టుకోమని సెలవిచ్చారు. అందుకే ఈ మూడు రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పవిత్రం.
వైశాఖ మాస మహిమ గురించి శివుడు కైలాసంలో పార్వతీదేవికి నూరు దివ్య సంవత్సరాల పాటు వివరించినా అది పూర్తి కాలేదంటే, ఇక సామాన్యులకు అది చెప్పడం సాధ్యమా అని శ్రుతదేవుడు పేర్కొన్నాడు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శుభాలను పొందమని శ్రుతకీర్తికి హితవు పలికి ఆయన తన దారిన తాను వెళ్ళిపోయారు. శ్రుతకీర్తి మహారాజు కూడా ఎంతో వైభవంగా వ్రతాన్ని ఆచరించి ధన్యుడయ్యాడు. అంబరీష మహారాజా! నీకు కూడా సర్వ శుభాలను కలిగించే వైశాఖ మహిమను వివరించాను, దీనివల్ల నీకు ముక్తి లభిస్తుందని నారద మహర్షి ఆశీర్వదించారు. ఈ కథను విన్నా, చదివినా లేదా పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా శ్రీహరి అనుగ్రహం కలిగి సర్వ శుభాలు కలుగుతాయి.
వైశాఖ పురాణం ముప్పైవ అధ్యయము సంపూర్ణము
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


